Akash Chopra predictions for today's match Pakistan Vs Australia: టీ20 వరల్డ్‌కప్-2021లో పాకిస్తాన్ చరిత్రను తిరగరాయబోతుందని టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అన్నాడు. దుబాయ్ వేదికగా రెండో సెమీ ఫైనల్‌లో భాగంగా ఆస్ట్రేలియాను ఓడిస్తుందని జోస్యం చెప్పాడు. కాగా ఇంగ్లండ్‌పై భారీ విజయంతో న్యూజిలాండ్ ఇప్పటికే ఫైనల్‌కు చేరగా.. పాక్- ఆసీస్ తుదిపోరుకు అర్హత సాధించేందుకు సిద్ధమవుతున్నాయి. నవంబరు 11 నాటి సెమీ ఫైనల్‌లో గెలవాలని ఉవ్విళ్లూరుతున్నాయి.
కాగా ఇప్పటి వరకు ఐసీసీ ఈవెంట్లలో నాకౌట్ దశలో నాలుగు సార్లు ఆసీస్‌తో ముఖాముఖి తలపడిన పాకిస్తాన్‌కు చేదు అనుభవాలే ఎదురయ్యాయి. చివరిసారిగా 2015 వన్డే వరల్డ్‌కప్ టోర్నీలో ఆసీస్ పాక్‌పై ఆరు వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. ఈ నేపథ్యంలో ఆకాశ్ చోప్రా సోషల్ మీడియా వేదికగా ఈ మ్యాచ్ గురించి తన అభిప్రాయం పంచుకున్నాడు. ‘‘పాకిస్తాన్ కచ్చితంగా గెలుస్తుంది. చరిత్ర పునరావృతం కాదు. చరిత్రను తిరగరాయబోతున్నారు’’ అని పాకిస్తాన్ జట్టు గెలుపుపై ధీమా వ్యక్తం చేశాడు.
అదే విధంగా ఇరు జట్ల బలాబలాల గురించి మాట్లాడుతూ.. ‘‘పవర్‌ప్లేలో రెండు లేదా అంతకంటే ఎక్కువే వికెట్లు పడతాయి. ఇరు జట్లు మెరుగ్గా బౌలింగ్ చేయగలవు. లెఫ్టార్మ్ సీమర్లు మిచెల్ స్టార్క్, షాహిద్ ఆఫ్రిది ఇద్దరూ కలిసి మూడు లేదంటే అంతకంటే ఎక్కువ వికెట్లు తీస్తారు. లెగ్ స్పిన్నర్లు ఆడం జంపా, షాబాద్ ఖాన్ కూడా ఇదే తరహాలో రాణిస్తారు. అయితే, ఆసియా దేశమైన పాకిస్తాన్.. లెగ్ స్పిన్నర్లను ఆడించకపోవచ్చును’’ అని ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు.
ఇక దుబాయ్‌లో టాస్ గెలవడం విజయానికి కీలకంగా మారుతుందన్న ఆకాశ్ చోప్రా.. లక్ష్య ఛేదనకు దిగిన జట్టుకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అభిప్రాయపడ్డాడు. అయితే ప్రతిసారీ ఇదే పునరావృతం కాకపోవచ్చని.. మంచు ప్రభావం ఉంటుంది కాబట్టి రెండో సెమీ ఫైనల్, ఫైనల్ నిర్వహణ వేళల్లో మార్పులు చేయాలని సూచించాడు.
చదవండి: James Neesham: సెలబ్రేట్ చేసుకోని జిమ్మీ నీషమ్.... ఫొటో వైరల్.. పని పూర్తైందా? ఇంకా లేదేమో!
1411077
Comments
Please login to add a commentAdd a comment