
అప్పుడు యూటర్న్ తీసుకున్న బ్రావో.. తాజాగా వీడ్కోలు ప్రకటన
T20 World Cup 2021- Dwayne Bravo Confirms Retirement: వెస్టిండీస్ స్టార్ క్రికెటర్ డ్వేన్ బ్రావో కీలక ప్రకటన చేశాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలుకనున్నట్లు ప్రకటించాడు. టీ20 ప్రపంచకప్-2021 తర్వాత ఇంటర్నేషనల్ క్రికెట్‌కు గుడ్ బై చెప్పనున్నట్లు పేర్కొన్నాడు. ఈ మేరకు... ‘‘సమయం ఆసన్నమైందని అనిపిస్తోంది. వెస్టిండీస్‌కు 18 ఏళ్ల పాటు ప్రాతినిథ్యం వహించాను. ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో ఎత్తుపళ్లాలు చూశాను.
అయితే, వెనక్కి తిరిగి చూసుకుంటే నా కెరీర్‌లో ఎన్నో విజయాలు సాధించాను. కరేబియన్ ప్రజల తరఫున అంతర్జాతీయ స్థాయిలో ప్రాతినిథ్యం వహించడం పట్ల కృతజ్ఞతాభావంతో నా మనసు నిండిపోయింది. మూడు ఐసీసీ ట్రోఫీలు గెలిచిన విండీస్ జట్టులో సభ్యుడిని కావడం సంతోషకరం’’ అని బ్రావో వ్యాఖ్యానించాడు. నవంబరు 4న శ్రీలంకతో మ్యాచ్‌లో 20 పరుగుల తేడాతో వెస్టిండీస్ ఓడిన తర్వాత ఆల్‌రౌండర్ బ్రావో ఈ మేరకు ప్రకటన చేశాడు.
యూటర్న్ తీసుకుని.. మళ్లీ..
అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు ప్రకటించి ఏడాది దాటిన తర్వాత తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు బ్రావో 2019లో ప్రకటించిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా టీ20 ఫార్మాట్ సెలక్షన్స్‌కు అందుబాటులో ఉండేందుకే తాను యూటర్న్ తీసుకున్నట్లు వెల్లడించాడు. అప్పట్లో బోర్డు పెద్దల వ్యవహారం సరిగ్గా లేనందు వల్లే రిటైర్మెంట్ ఆలోచన చేశానన్న బ్రావో... ఆ తర్వాత నిర్ణయం మార్చుకున్నట్లు తెలిపాడు.
90 టీ20 మ్యాచ్‌లు
2004లో డ్వేన్ బ్రావో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. వెస్టిండీస్ తరఫున ఇప్పటి వరకు మొత్తంగా అన్ని ఫార్మాట్లు కలిపి 293 మ్యాచ్‌లు ఆడాడు. ఇక 2006లో న్యూజిలాండ్‌తో మ్యాచ్‌తో పొట్టి ఫార్మాట్‌లో అరంగేట్రం చేసిన బ్రావో.. ఇప్పటివరకు 90 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. 1000 పరుగులు చేశాడు. 78 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.
అదే విధంగా 2012, 2016 టీ20 ప్రపంచకప్ గెలిచిన జట్టులో అతడు సభ్యుడు. ముఖ్యంగా 2012 టోర్నీలో విన్నింగ్ క్యాచ్ అందుకుని జట్టును విజయతీరాలకు చేర్చిన తీరును ఎవరూ మర్చిపోలేరు. ఇక టీ20 వరల్డ్‌కప్-2021లో భాగంగా ఆస్ట్రేలియాతో నవంబరు 6న జరగనున్న మ్యాచ్‌లో తుది జట్టులో చోటు దక్కితే విండీస్ తరఫున బ్రావో ఆడిన మ్యాచ్‌ల సంఖ్య 294కు చేరుతుంది.
చదవండి: Chris Gayle: ఏంటిది గేల్.. చెత్త రికార్డు...ఇన్ని ఘనతలు ఉన్నా.. శ్రీలంకపై మాత్రం..