India Lost Match To New Zealand By 8 Wickets Dubai: ఏమైంది మన జట్టుకి. ఎందుకీ భంగపాటు. అసలు ప్రపంచకప్‌లో పాక్ చేతిలో పరాభవమే ఘోరమనుకుంటే... కివీస్ చేతిలోనూ మహా పరాభవమేంటి? ఆతిథ్య వేదిక యూఏఈ మనోళ్లకి కొత్తకాదు. ఆడుతున్నది ఆషామాషీ క్రికెటర్లు కానేకాదు. వరుసగా రెండేళ్లు మెరుపుల లీగ్ (ఐపీఎల్) ఆడిన వేదిక ఇది.
ఇటీవలే ముగిసిన ఐపీఎల్ ప్రాక్టీస్ కూడా ఉంది. అంతెందుకు వార్మప్ మ్యాచ్‌ల్లోనూ ఇరగదీసింది. బ్యాట్స్‌మెన్, బౌలర్లు ఫామ్‌లో ఉన్నారు. మరి ఈ ఆటేంది... చెత్త బ్యాటింగ్ ఏంటి... బౌలింగ్‌లో పసలేదేంటి. మెగాటోర్నీలో గెలుపు అటకెక్కడమేంటి? ఆటగాళ్లకు ఈ ప్రపంచ కప్ అంతులేని వ్యథగా మారడమేంటి?
దుబాయ్: పటిష్టమైన బ్యాటింగ్ లైనప్‌కు దిష్టి తగిలిందా? లేకా ఆటగాళ్ల పట్టుదల సన్నగిల్లిందో తెలియదు కానీ... భారత బ్యాటింగ్ మళ్లీ కూలబడింది. ప్రత్యర్థి బౌలింగ్ ముందు బోల్తాపడింది. మన బౌలింగ్ మళ్లీ చెదిరింది. ప్రత్యర్థి టాపార్డర్ ధాటికి డీలాపడింది. తొలి టి20 ప్రపంచకప్ (2007) విజేత, ఈ ప్రపంచకప్ ఫేవరెట్, చాంపియన్ కెప్టెన్ ధోని మార్గదర్శనంలో, జగమెరిగిన బ్యాటింగ్ సంచలనం కోహ్లి కెప్టెన్‌గా ఆఖరి ప్రపంచకప్ ఆడుతున్నాడు.
కానీ చివరకు... ఇంకా మూడు మ్యాచ్‌లున్నా కానీ లీగ్ దశలోనే ఇంటిదారి దాదాపు ఖాయమైంది. ఆదివారం ఆవిష్కృతమైన ఆల్‌రౌండ్ వైఫల్యంతో భారత్ సెమీస్ దారులు మూసుపోయాయి. గ్రూప్–1లో జరిగిన లీగ్ మ్యాచ్‌లో భారత్ 8 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ చేతిలో పరాభవం చవిచూసింది. భారత బ్యాటింగ్ లైనప్‌ను దెబ్బతీసిన ‘బర్త్ డే బాయ్’ ఇష్ సోధి (2/17) ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.
మొదట బ్యాటింగ్ చేపట్టిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 110 పరుగులు చేసింది. జడేజా (19 బంతుల్లో 26 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్)నే భారత ఇన్నింగ్స్‌లో టాప్ స్కోరర్. తర్వాత న్యూజిలాండ్ 14.3 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 111 పరుగులు చేసి జయభేరి మోగించింది. ఓపెనర్ డారిల్ మిచెల్ (35 బంతుల్లో 49; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) చెలరేగాడు.
చిన్నాభిన్నం...
టాస్ కీలకపాత్ర పోషిస్తున్న ఈ టోర్నీలో కోహ్లికి మళ్లీ టాస్ కలిసిరాలేదు. విలియమ్సన్ టాస్ నెగ్గగానే ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఆశ్చర్యకరంగా రోహిత్‌ను కాదని రాహుల్‌కు జతగా ఇషాన్ కిషన్‌ను ఓపెనింగ్‌లో దించాడు. టాస్ లాగే ఇదీ కలిసి రాలేదు. కాస్త జాగ్రత్తగా ఆడినట్లు కనిపించిన ఓపెనర్లు పవర్ ప్లే ముగియకముందే ఔటయ్యారు.
భారీ షాట్లకు ప్రయత్నించగానే కిషన్ (4)కు బౌల్ట్, రాహుల్ (18; 3 ఫోర్లు)కు సౌతీ పెవిలియన్ దారి చూపించారు. తొలి బంతికే మిల్నే సునాయాస క్యాచ్ జారవిడువడంతో కలిసొచి్చన అదృష్టాన్ని రోహిత్ (14; ఫోర్, సిక్స్) విజయవంతంగా మలచుకోలేకపోయాడు.
రోహిత్‌ను, ఇన్నింగ్స్‌ను నడిపిద్దామనుకున్న కెపె్టన్ కోహ్లి (9)ని సోధి బోల్తా కొట్టించాడు. బౌలర్లకు దాసోహమైన పిచ్‌పై మన బ్యాట్స్‌మెన్ షాట్లు బౌండరీ లైనుకు ఇవతలే క్యాచ్‌లుగా మారడంతో 48 పరుగులకే 4 కీలక వికెట్లన్నీ పడిపోయాయి. కష్టంగా భారత్ స్కోరు 10.4 ఓవర్లలో 50 పరుగులకు చేరింది. పంత్ (12)ను మిల్నే క్లీన్‌బౌల్డ్ చేయగా, బౌల్ట్ బౌలింగ్‌లో హార్దిక్ (23; 1 ఫోర్) నిష్క్రమించాడు. జడేజా ఆడిన ఆ మాత్రం ఆటతో జట్టు స్కోరు 100 దాటింది.
చకచకా లక్ష్యంవైపు...
అదేంటో పిచ్ ప్రభావమో లేక మన చెత్త షాట్ల సెలక్షనో కానీ భారత బ్యాట్స్‌మెన్ కొడితే కివీస్ ఫీల్డర్ల చేతుల్లో నేరుగా పడిన బంతి... అదే న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ కొడితే మాత్రం బౌండరీ అవతల ఫోర్‌గానో, సిక్సర్‌గానో పడింది. గప్టిల్ (20; 3 ఫోర్లు) వేగంగా ఆడుతూనే నిష్క్రమించగా, మరో ఓపెనర్ డారిల్ మిచెల్ ధనాధన్ ఇన్నింగ్స్ ఆడేశాడు.
జడేజా వేసిన 6వ ఓవర్లో 6, 0, 4, 4 కొట్టిన మిచెల్ తిరిగి శార్దుల్ వేసిన 10వ ఓవర్లో దాన్ని రిపీట్ చేశాడు. ఈ రెండు ఓవర్లలో 14 చొప్పున పరుగులొచ్చాయి. దీంతో ఏడో ఓవర్లోనే 50 పరుగులు చేసిన కివీస్ 14వ ఓవర్ ముగియకముందే వంద పరుగులు చేసింది. విలియమ్సన్ (31 బంతుల్లో 33 నాటౌట్; 3 ఫోర్లు) అజేయంగా నిలబడి ఇంకో 5.3 ఓవర్లు మిగిలుండగానే ముగించాడు.
రెండు మార్పులతో భారత్
సూర్యకుమార్ యాదవ్ వెన్ను నొప్పి కారణంగా మ్యాచ్‌కు దూరమవగా, భువనేశ్వర్‌పై వేటు పడింది. వీరి స్థానాల్లో ఇషాన్ కిషన్, శార్దుల్ ఠాకూర్ జట్టులోకి వచ్చారు. వీరిద్దరికీ ఇదే తొలి ప్రపంచ కప్ మ్యాచ్. అయితే ఇద్దరు కూడా మ్యాచ్‌లో పెద్దగా ప్రభావం చూపలేకపోయారు.
స్కోరు వివరాలు:
భారత్ ఇన్నింగ్స్: రాహుల్ (సి) మిచెల్ (బి) సౌతీ 18; ఇషాన్ కిషన్ (సి) మిచెల్ (బి) బౌల్ట్ 4; రోహిత్ (సి) గప్టిల్ (బి) సోధి 14; కోహ్లి (సి) బౌల్ట్ (బి) సోధి 9; పంత్ (బి) మిల్నే 12; హార్దిక్ (సి) గప్టిల్ (బి) బౌల్ట్ 23; జడేజా (నాటౌట్) 26; శార్దుల్ (సి) గప్టిల్ (బి) బౌల్ట్ 0; షమీ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం ( 20 ఓవర్లలో 7 వికెట్లకు) 110. వికెట్ల పతనం: 1–11, 2–35, 3–40, 4–48, 5–70, 6–94, 7–94. బౌలింగ్: బౌల్ట్ 4–0–20–3, సౌతీ 4–0–26–1, సాన్‌ట్నర్ 4–0–15–0, మిల్నే 4–0–30–1, సోధి 4–0–17–2.
న్యూజిలాండ్ ఇన్నింగ్స్: గప్టిల్ (సి) శార్దుల్ (బి) బుమ్రా 20; మిచెల్ (సి) రాహుల్ (బి) బుమ్రా 49; విలియమ్సన్ (నాటౌట్) 33; కాన్వే (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (14.3 ఓవర్లలో 2 వికెట్లకు) 111. వికెట్ల పతనం: 1–24, 2–96. బౌలింగ్: వరుణ్ 4–0–23–0, బుమ్రా 4–0–19–2, జడేజా 2–0–23–0, షమీ 1–0–11–0, శార్దుల్ 1.3–0–17–0, హార్దిక్ పాండ్యా 2–0–17–0.
🎙 "I think the pressure led to a lot of wickets and thankfully I was on the receiving end of that."#NewZealand spinner Ish Sodhi reacts to what was a gallant victory for his side over India in the #T20WorldCup pic.twitter.com/78b3guybCV
— T20 World Cup (@T20WorldCup) October 31, 2021
Comments
Please login to add a commentAdd a comment