టీ20 వరల్డ్‌కప్ 2024లో భాగంగా పాకిస్తాన్‌తో నిన్న (జూన్ 9) జరిగిన ఉత్కంఠ సమరంలో టీమిండియా 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో భారత్ 120 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని విజయవంతంగా కాపాడుకోగలిగింది. ఓటమి తప్పదనుకున్న మ్యాచ్‌లో పేసర్లు ఆకాశమే హద్దుగా చెలరేగి టీమిండియాకు చిరస్మరణీయ విజయాన్నందించారు. ముఖ్యంగా బుమ్రా (4-0-13-3), హార్దిక్ (4-0-24-2) తమ అనుభవాన్నంత రంగరించి పాక్ చేతుల్లో నుంచి మ్యాచ్‌ను లాగేసుకున్నారు.
భారత్‌ను విజయపథాన నడిపించడానికి బుమ్రా ప్రధాన కారకుడైతే.. ఈ గెలుపుకు బీజం పోసింది మాత్రం హార్దిక్ పాండ్యా. ఈ మ్యాచ్‌లో తొలి రెండు ఓవర్లలో వికెట్ లేకుండా 18 పరుగులు సమర్పించుకున్న హార్దిక్.. ఆతర్వాత రెండు ఓవర్లలో కేవలం 6 పరుగులు మాత్రమే ఇచ్చి అత్యంత కీలకమైన ఫఖర్ జమాన్, షాదాబ్ ఖాన్‌ల వికెట్లు పడగొట్టాడు. ఈ రెండు వికెట్లే భారత్‌ను మ్యాచ్‌లోకి తిరిగి తీసుకొచ్చాయి.
హార్దిక్ తన తొలి వికెట్ (ఫఖర్ జమాన్) తీసే సమయానికి పాక్ గెలుపు దిశగా సాగుతుండింది. ఈ దశలో హార్దిక్ ఫఖర్ జమాన్ వికెట్‌తో పాటు షాదాబ్ ఖాన్ వికెట్ (17వ ఓవర్) తీసి పాక్‌ను డిఫెన్స్‌లోకి నెట్టాడు. హార్దిక్ దెబ్బకు కోలుకోలేకపోయిన పాక్ ఆతర్వాత పరుగులు సాధించేందకు ఇబ్బంది పడటంతో పాటు వరుసగా వికెట్లు కోల్పోయింది.
హార్దిక్ తన కోటా ఓవర్లు పూర్తి చేసే సమయానికి 17 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 90 పరుగులు చేసిన పాక్.. తర్వాత 3 ఓవర్లలో 30 పరుగులు చేయలేక ఓటమిపాలైంది. చివరి మూడు ఓవర్లలో సిరాజ్ (9 పరుగులు), బుమ్రా (3 పరుగులు), అర్ష్‌దీప్ (11 పరుగులు) అద్భుతంగా బౌలింగ్ చేసి పాక్‌కు శృంగభంగం కలిగించారు.
హార్దిక్ తన మ్యాజిక్ స్పెల్‌తో టీమిండియా గెలుపుకు బీజం వేసిన అనంతరం కెప్టెన్ రోహిత్ శర్మ అతన్ని ఆనందంతో కౌగిలించుకుని భుజానికెత్తుకున్నాడు. షాదాబ్ ఖాన్ వికెట్ తీసిన అనంతరం హార్దిక్ చేసుకున్న సెలబ్రేషన్స్ వైరలయ్యాయి. మ్యాచ్ అనంతరం హర్దిక్ "నెవర్ గివ్ అప్" అని తన సోషల్‌మీడియా అకౌంట్లలో స్టేటస్ పెట్టుకున్నాడు.
మొత్తానికి చేజారిందనుకున్న మ్యాచ్‌ను గెలిపించడంలో కీలకపాత్ర పోషించి హార్దిక్ మరోసారి హీరో అనిపించుకున్నాడు. హార్దిక్‌కు పాకిస్తాన్‌పై వరల్డ్‌కప్ మ్యాచ్‌ల్లో రాణించడం కొత్తేమీ కాదు. గతంలోనూ చాలా సందర్భాల్లో హార్దిక్ పాక్‌కు గెలుపును దూరం చేశాడు. ఈ సీజన్ ఐపీఎల్ తాలుకా చేదు అనుభవాలను ఇప్పుడిప్పుడే అధిగమిస్తున్న హార్దిక్.. ఐర్లాండ్‌తో జరిగిన ప్రపంచకప్ తొలి మ్యాచ్‌లోనూ అద్భుతంగా బౌలింగ్ చేసి ఆకట్టుకున్నాడు. ఆ మ్యాచ్‌లో హార్దిక్ 3 ఓవర్లలో 6 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. హార్దిక్ స్పెల్‌లో ఓ మొయిడిన్ ఓవర్ కూడా ఉంది.
కాగా, పాక్‌తో మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. 19 ఓవర్లలో 119 పరుగులకు చాపచుట్టేసింది. పాక్ బౌలర్లలో నసీం షా, హరీస్ రౌఫ్ తలో 3 వికెట్లు, మొహమ్మద్ ఆమిర్ 2, షాహిన్ అఫ్రిది ఓ వికెట్ పడగొట్టారు. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పాక్.. భారత పేసర్ల ధాటికి లక్ష్యానికి 7 పరుగుల దూరంలో నిలిచిపోయింది. బుమ్రా, హార్దిక్‌తో పాటు సిరాజ్ (4-0-19-0), అర్ష్‌దీప్ (4-0-31-1), అక్షర్ (2-0-11-1) రాణించారు. పాక్ ఇన్నింగ్స్‌లో రిజ్వాన్ (31) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. భారత్ చేతిలో ఓటమితో పాక్ సూపర్-8 అవకాశాలు గల్లంతు చేసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment