టీ20 వరల్డ్‌కప్ 2024 ప్రైజ్‌మనీ వివరాలను ఐసీసీ ఇవాళ (జూన్ 3) వెల్లడించింది. మెగా టోర్నీలో పాల్గొనే 20 జట్లకు ఈసారి రికార్డు స్థాయిలో భారీ పారితోషికం లభించనుంది. టోర్నీ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఈసారి బడ్జెట్ కేటాయింపు జరిగింది. ఓవరాల్‌గా రూ. 93.52 కోట్లను ఐసీసీ పారితోషికంగా పంచనుంది.
టోర్నీ విజేతకు ప్రపంచకప్ ట్రోఫీతో పాటు రూ. 20.36 కోట్లు.. రన్నరప్‌కు రూ. 10.64 కోట్లు లభించనున్నాయి. టోర్నీలో పాల్గొనే ప్రతి జట్టుకు కనీసం రూ. 1.87 కోట్లు లభించనున్నాయి. సెమీస్‌లో ఓడే రెండు జట్లకు చెరి రూ. 6.54 కోట్లు.. సూపర్-8లో ఇంటిముఖం పట్టే నాలుగు జట్లకు రూ. 3.17 కోట్లు.. 9, 10, 11, 12 స్థానల్లో నిలిచే జట్లకు రూ. 2.5 కోట్లు.. 13 నుంచి 20 స్థానాల్లో నిలిచే జట్లకు తలో రూ. 1.87 కోట్లు లభించనున్నాయి.
ఇదే కాకుండా టోర్నీలో గెలిచే ప్రతి మ్యాచ్‌కు ఆయా జట్టుకు రూ. 25.8 లక్షల రూపాయలు లభించనున్నాయి. పొట్టి ప్రపంచకప్ చరిత్రలోనే ఈస్థాయిలో పారితోషికం గతంలో ఎన్నడూ ఇవ్వలేదు.
ఇదిలా ఉంటే, టీ20 ప్రపంచకప్ 2024 జూన్ 1 నుంచి ప్రారంభమైన విషయం తెలిసిందే. 28 రోజుల పాటు సాగే ఈ టోర్నీలో మొత్తం 55 మ్యాచ్‌లు జరుగనున్నాయి. వెస్టిండీస్, యూఎస్‌ఏ దేశాల్లో మొత్తం తొమ్మిది వేదికల్లో ఈ మెగా టోర్నీ జరుగనుంది. పొట్టి క్రికెట్ చరిత్రలోనే ఇదో భారీ టోర్నీ.
Comments
Please login to add a commentAdd a comment