T20 World Cup 2024: భారత్‌-పాకిస్తాన్‌ మ్యాచ్‌.. అసలైన హీరో అతడే..! | T20 World Cup 2024: Rishabh Pant Stellar Performance Against Pakistan On Tough Pitch, See Details | Sakshi
Sakshi News home page

T20 World Cup 2024: భారత్‌-పాకిస్తాన్‌ మ్యాచ్‌.. అసలైన హీరో అతడే..!

Published Mon, Jun 10 2024 9:32 AM | Last Updated on Mon, Jun 10 2024 11:19 AM

T20 World Cup 2024: Rishabh Pant Stellar Performance Against Pakistan On Tough Pitch

టీ20 వరల్డ్‌కప్‌ 2024లో భాగంగా దాయాది పాకిస్తాన్‌తో నిన్న (జూన్‌ 9) జరిగిన హై ఓల్టేజీ మ్యాచ్‌లో భారత్‌ 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో భారత బౌలర్లు 120 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని విజయవంతంగా కాపాడుకుని తమ జట్టుకు చిరస్మరణీయ విజయాన్నందించారు. బుమ్రా (4-0-13-3), హార్దిక్‌ (4-0-24-2),  సిరాజ్‌ (4-0-19-0), అర్ష్‌దీప్‌ (4-0-31-1), అక్షర్‌ (2-0-11-1) అద్భుతంగా బౌలింగ్‌ చేసి టీమిండియా గెలుపులో ప్రధానపాత్ర పోషించారు.

పాక్‌పై టీమిండియా గెలుపులో బౌలర్లదే ప్రధానపాత్ర అయినప్పటికీ.. తెర వెనుక అసలుసిసలైన హీరో వేరే ఉన్నాడు. ఆ హీరో పేరు రిషబ్‌ పంత్‌. ఈ మ్యాచ్‌లో పంత్‌ పేరు ఎక్కువగా వినపడనప్పటికీ అతనే రియల్‌ హీరో. బ్యాటర్లకు ఏమాత్రం అనుకూలించని పిచ్‌పై పంత్‌ చేసిన 42 పరుగులే టీమిండియా గెలుపు వెనక నిశ్శబ్ద పాత్ర పోషించాయి. క్లిష్టమైన పిచ్‌పై పంత్‌ ఆడిన మెరుపు ఇన్నింగ్స్‌ (31 బంతుల్లో 6 ఫోర్లు, సిక్సర్‌) టీమిండియా గెలుపుకు బీజం వేసిందనేది కాదనలేని సత్యం.

ఓ పక్క సహచరులంతా పెవిలియన్‌కు క్యూ కడుతున్నా పంత్‌ ఒక్కడే మొక్కవోని ధైర్యంతో క్రీజ్‌లో నిలబడి బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌ ఆడాడు. ఈ మ్యాచ్‌లో పంత్‌ ఆడిన ఇన్నింగ్స్‌ గురించి ఎంత చెప్పినా తక్కువే. పాక్‌తో కలుపుకుని ఆటగాళ్లంతా ఒక్కో పరుగు చేసేందుకు నానా కష్టాలు పడగా.. పంత్‌ మాత్రం సునాయాసంగా 42 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌ మొత్తానికి పంత్‌ చేసిన పరుగులే అత్యధికం.

ఈ మ్యాచ్‌లో పంత్‌ మెరుపులు కేవలం బ్యాటింగ్‌కు మాత్రమే పరిమితం కాలేదు. స్వల్ప లక్ష్యాన్ని నిలదొక్కుకునే క్రమంలో పంత్‌ వికెట్ల వెనుక కూడా హీరో పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో పంత్‌ మూడు అద్భుతమైన క్యాచ్‌లు పట్టి భారత్‌ గెలుపులో కీ రోల్‌ ప్లే చేశాడు. పంత్‌ పట్టిన ఇమాద్‌ వసీం క్యాచ్‌ మ్యాచ్‌ మొత్తానికే హైలైట్‌గా నిలిచింది. వికెట్ల వెనుక అద్భుత ప్రదర్శనకు గానూ పంత్‌ బెస్ట్‌ ఫీల్డర్‌ అవార్డు కూడా అందుకున్నాడు. మొత్తంగా చూస్తే పాక్‌పై టీమిండియా గెలుపులో రిషబ్‌ పంత్‌ అన్‌ సంగ్‌ హీరోగా మిగిలిపోయాడు.

2022లో ఘోర రోడ్డు ‍ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన పంత్‌.. 17 నెలల సుదీర్ఘ విరామం తర్వాత టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చి వచ్చీ రాగనే అద్భుతాలు చేస్తున్నాడు. మెగా టోర్నీలో భాగంగా ఐర్లాండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో అజేయమైన 36 పరుగులు చేసిన పంత్‌ తాజాగా పాక్‌పై మ్యాచ్‌ విన్నింగ్‌ ఇన్నింగ్స్‌ ఆడి తనదైన మార్కు చూపిస్తున్నాడు.

మ్యాచ్‌ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌.. 19 ఓవర్లలో 119 పరుగులకు చాపచుట్టేసింది. పాక్‌ బౌలర్లలో నసీం షా, హరీస్‌ రౌఫ్‌ తలో 3 వికెట్లు, మొహమ్మద్‌ ఆమిర్‌ 2, షాహిన్‌ అఫ్రిది ఓ వికెట్‌ పడగొట్టారు. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పాక్‌.. భారత పేసర్ల ధాటికి లక్ష్యానికి 7 పరుగుల దూరంలో నిలిచిపోయింది. పాక్‌ ఇన్నింగ్స్‌లో రిజ్వాన్‌ (31) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. భారత్‌ చేతిలో ఓటమితో పాక్‌ సూపర్‌-8 అవకాశాలు గల్లంతు చేసుకుంది.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement