
టీ20 వరల్డ్‌కప్ 2024లో భాగంగా ఇవాళ (జూన్ 11) మూడు మ్యాచ్‌లు జరుగనున్నాయి. మొదటి మ్యాచ్ పాకిస్తాన్, కెనడా (న్యూయార్క్) మధ్య భారతకాలమానం ప్రకారం ఇవాళ రాత్రి 8 గంటలకు ప్రారంభంకానుండగా.. రెండో మ్యాచ్ శ్రీలంక-నేపాల్ (ఫ్లోరిడా) మధ్య రేపు తెల్లవారు జామున 5 గంటలకు (భారతకాలమానం ప్రకారం).. మూడో మ్యాచ్ ఆస్ట్రేలియా-నమీబియా (ఆంటిగ్వా) జట్ల మధ్య రేపు ఉదయం 6 గంటలకు (భారతకాలమానం ప్రకారం) ప్రారంభం కానున్నాయి.
పాక్ భవితవ్యం తేలేది నేడే..!
గ్రూప్-ఏలో మొదటి రెండు మ్యాచ్‌ల్లో ఓడి సూపర్-8 అవకాశాలను సంక్లిష్టం చేసుకున్న పాకిస్తాన్ ఇవాళ పసికూన కెనడాతో తలపడనుంది. సూపర్-8కు చేరాలంటే పాక్ ఈ మ్యాచ్‌లో తప్పనిసరిగా భారీ తేడాతో గెలవాల్సి ఉంది. ఈ మ్యాచ్‌తో పాటు జూన్ 16న ఐర్లాండ్‌తో జరుగబోయే మ్యాచ్‌లోనూ పాక్ భారీ తేడాతో గెలవాల్సి ఉంటుంది. ఇలా జరిగితేనే పాక్ గ్రూప్-ఏ నుంచి సూపర్-8 బెర్త్ రేసులో ఉంటుంది. పాక్ తదుపరి ఆడబోయే రెండు మ్యాచ్‌ల్లో భారీ తేడాతో గెలిచినా సెమీస్‌కు చేరుకుంటుందన్న గ్యారెంటీ లేదు.
ఎందుకంటే.. ఇదివరకే రెండు మ్యాచ్‌ల్లో (కెనడా, పాక్) గెలిచిన యూఎస్‌ఏ తదుపరి ఆడబోయే రెండు మ్యాచ్‌ల్లో (భారత్, ఐర్లాండ్) ఏదో ఒక మ్యాచ్‌లో గెలిచినా ఆ జట్టే సూపర్-8కు చేరుకుంటుంది. ప్రస్తుతం ఆడిన రెండు మ్యాచ్‌ల్లో గెలిచిన భారత్ (1.455), యూఎస్‌ఏ (0.626) గ్రూప్-ఏ నుంచి తొలి రెండు స్థానాల్లో ఉండగా.. రెండిట ఒక మ్యాచ్ గెలిచిన కెనడా (-0.274) మూడో స్థానంలో.. ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఓడిన పాకిస్తాన్ (-0.150), ఐర్లాండ్ (-1.712) నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నాయి.
ఏదైన అద్భుతం జరిగి యూఎస్‌ఏ తదుపరి రెండు మ్యాచ్‌ల్లో ఓడి.. పాక్ తదుపరి ఆడే రెండు మ్యాచ్‌ల్లో భారీ తేడాతో గెలిస్తే తప్ప పాక్ సూపర్-8కు చేరలేదు. పాక్ సూపర్-8కు చేరకుండా ప్రపంచకప్ నుంచి నిష్క్రమిస్తే ఆ జట్టుకు మరో పరాభవం కూడా ఎదురవుతుంది. ఇలా జరిగితే పాక్ తదుపరి టీ20 ప్రపంచకప్‌కు (2026) క్వాలిఫయర్స్ ద్వారా అర్హత సాధించాల్సి ఉంటుంది. ఐసీసీ కొత్త నిబంధనల ప్రకారం ఈ సారి ప్రపంచకప్‌లో సూపర్-8కు అర్హత సాధించే దేశాలే నేరుగా తదుపరి వరల్డ్‌కప్‌కు అర్హత సాధిస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment