వెస్టిండీస్‌ను భయపెట్టిన పసికూన.. చెమటోడ్చి నెగ్గిన కరేబియన్లు WI defeated Papua New Guinea by five wickets in their T20 World Cup 2024. Sakshi

వెస్టిండీస్‌ను భయపెట్టిన పసికూన.. చెమటోడ్చి నెగ్గిన కరేబియన్లు

Published Mon, Jun 3 2024 2:24 AM | Last Updated on Mon, Jun 3 2024 12:13 PM

T20 World Cup results: West Indies beat Papua New Guinea by five wickets

ఐదు వికెట్లతో పపువా న్యూగినీ జట్టుపై గెలిచింది

ఆకట్టుకున్న పపువా బౌలర్లు

విండీస్‌ను గెలిపించిన చేజ్‌

గయానా: టి20 ప్రపంచకప్‌కు ఆతిథ్యమిస్తున్న రెండో దేశం వెస్టిండీస్‌ కూడా టోర్నిలో శుభారంభం చేసింది. ఆదివారం జరిగిన రెండో మ్యాచ్‌లో రెండుసార్లు చాంపియన్‌ విండీస్‌ ఓటమి అంచుల్లోంచి బయటపడి 5 వికెట్ల తేడాతో పపువా న్యూగినీ జట్టుపై గెలిచి ఊపిరి పీల్చుకుంది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పపువా న్యూగినీ నిరీ్ణత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది. టాపార్డర్‌ బ్యాటర్లు టోని వుర (2), అసద్‌ వాలా (21), లెగా సియాక (1) నిరాశ పరచడంతో 34 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

ఈ దశలో సెసె బావు (43 బంతుల్లో 50; 6 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధసెంచరీతో ఆదుకున్నాడు. చార్లెస్‌ అమిని (12)తో ఐదో వికెట్‌కు 44 పరుగులు జోడించాడు. జట్టు స్కోరు 98 వద్ద ఆరో వికెట్‌గా సెసె బావు నిష్క్రమించగా, కిప్లిన్‌ డొరిగా (18 బంతుల్లో 27 నాటౌట్‌; 3 ఫోర్లు) మెరుగ్గా ఆడటంతో పపువా ఆ మాత్రం స్కోరు చేయగలిగింది. విండీస్‌ బౌలర్లలో రసెల్,  జోసెఫ్‌ చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం వెస్టిండీస్‌ 19 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 137 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ రోస్టన్‌ చేజ్‌ (27 బంతుల్లో 42 నాటౌట్‌; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) విండీస్‌ను ఒడ్డున పడేసే ఆట ఆడాడు.

సులువైన ప్రత్యర్థే అయినా... ఏమంత కష్టం కానీ లక్ష్యమే ఎదురైనా... వెస్టిండీస్‌ గెలిచేందుకు ఆపసోపాలు పడింది. ఓపెనర్‌ బ్రాండన్‌ కింగ్, పూరన్‌ ఉన్నంత వరకు 8 ఓవర్లలో విండీస్‌ 61/1 స్కోరు చేసింది. గెలిచేందుకు 72 బంతుల్లో 76 పరుగులు చేస్తే సరిపోతుంది. కానీ తర్వాతి వరుస ఓవర్లలో పూరన్‌ (27 బంతుల్లో 27; 1 ఫోర్, 2 సిక్స్‌లు), కింగ్‌ (29 బంతుల్లో 34; 7 ఫోర్లు) అవుటయ్యాక పరిస్థితి మారింది. 

కెప్టెన్‌ రొవ్‌మన్‌ పావెల్‌ (15), రూథర్‌ఫోర్డ్‌ (2) వికెట్లు పారేసుకోవడంతో సమీకరణం 24 బంతుల్లో 40 పరుగుల వద్ద కష్టంగా కనిపించింది. ఈ దశలో రసెల్‌ (9 బంతుల్లో 15 నాటౌట్‌; 1 సిక్స్‌) వచ్చాక చేజ్‌ ధాటిగా ఆడాడు. 18వ ఓవర్లో 2 బౌండరీలు, ఓ సిక్స్‌ బాది 18 పరుగులు పిండుకున్నాడు. మరుసటి ఓవర్లోనూ చేజ్‌ 2 ఫోర్లు కొట్టడంతో 19వ ఓవర్‌ ఆఖరి బంతికి లక్ష్యాన్ని చేరుకుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement