బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (బీపీఎల్)– 2024 సీజన్ ఛాంపియన్‌గా ఫార్ట్యూన్ బరిషల్ నిలిచింది. శుక్రవారం ఢాకా వేదికగా జరిగిన ఫైనల్లో కొమిలియా విక్టోరియన్స్‌ను 6 వికెట్ల తేడాతో చిత్తు చేసిన బరిషల్ జట్టు.. తొలిసారి బీపీఎల్ ట్రోఫిని ముద్దాడింది. కొమిలియా నిర్దేశించిన 155 పరుగుల లక్ష్యాన్ని బరిషల్.. 19 ఓవర్లలో 4 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది.
బరిషల్ బ్యాటర్లలో కైల్ మేయర్స్ (30 బంతుల్లో 46, 5 ఫోర్లు, 2 సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలవగా.. తమీమ్ ఇక్బాల్ (26 బంతుల్లో 39, 3 ఫోర్లు, 3 సిక్సర్లు), మెహిది హసన్ మిరాజ్ (26 బంతుల్లో 29, 1 ఫోర్, 2 సిక్సర్లు) రాణించారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన కొమిలియా విక్టోరియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. కొమిలియా ఇన్నింగ్స్‌లో వికెట్ కీపర్ బ్యాటర్ మహిదుల్ ఇస్లామ్ (38) టాప్ స్కోరర్‌గా నిలవగా.. ఆండ్రూ రసెల్ (14 బంతుల్లో 27, 4 సిక్సర్లు) ఆఖరిలో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.
బరిషల్ బౌలర్లలో జేమ్స్ ఫుల్లర్ 2 వికెట్లు పడగొట్టగా.. మైర్స్,సైఫుద్దీన్, మెకాయ్ తలా వికెట్ సాధించారు. 2012 నుంచి జరుగుతున్న బీపీఎల్‌లో కొమిలియా విక్టోరియన్స్ నాలుగు సార్లు (2015, 2019, 2022, 2023)టైటిల్ విజేతగా నిలవగా.. ఢాకా గ్లాడియేటర్స్ మూడు సార్లు( 2012, 2013, 2016) ఛాంపియన్స్‌గా నిలిచింది.
అదే విధంగా రంగాపూర్ రైడర్స్ (2017), రాజ్‌షాహి రాయల్స్ (2020)లు తలా ఒకసారి టైటిల్‌ను ముద్దాడాయి. ఇప్పుడు పదో సీజన్‌లో తమీమ్ ఇక్భాల్ సారథ్యంలోని ఫార్ట్యున్ బరిషల్ సరి కొత్త ఛాంపియన్స్‌గా అవతరిచింది.
Comments
Please login to add a commentAdd a comment