కోల్‌కతా: టాటా స్టీల్ ఇండియా చెస్ మహిళల ర్యాపిడ్ టోర్నమెంట్‌లో ఫేవరెట్స్‌ను బోల్తా కొట్టిస్తూ భారత యువతార దివ్య దేశ్‌ముఖ్ చాంపియన్‌గా అవతరించింది. మహారాష్ట్రకు చెందిన 17 ఏళ్ల దివ్య నిర్ణీత తొమ్మిది రౌండ్ల తర్వాత ఏడు పాయింట్లతో అగ్రస్థానాన్ని సొంతం చేసుకుంది. శనివారం జరిగిన చివరి మూడు గేముల్లో దివ్యకు మిశ్రమ ఫలితాలు లభించాయి. అనా ఉషెనినా (ఉక్రెయిన్)తో జరిగిన ఏడో గేమ్‌ను దివ్య 30 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకుంది.
పొలీనా షువలోవా (రష్యా)తో జరిగిన ఎనిమిదో గేమ్‌లో దివ్య 41 ఎత్తుల్లో ఓడిపోయింది. చివరిదైన తొమ్మిదో గేమ్‌లో దివ్య 51 ఎత్తుల్లో భారత స్టార్ కోనేరు హంపిపై సంచలన విజయం సాధించి టైటిల్‌ను ఖరారు చేసుకుంది. జు వెన్‌జున్ (చైనా; 6.5 పాయింట్లు) రన్నరప్‌గా, షువలోవా 5.5 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచారు.
భారత్‌కే చెందిన ద్రోణవల్లి హారిక 4.5 పాయింట్లతో నాలుగో స్థానాన్ని దక్కించుకోగా, వంతిక అగర్వాల్ ఐదో స్థానంలో, కోనేరు హంపి ఆరో స్థానంలో, సవితాశ్రీ ఎనిమిదో స్థానంలో నిలిచారు. ఇదే వేదికపై నేడు, రేపు బ్లిట్జ్ ఫార్మాట్‌లో టోర్నీ జరుగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment