ఇంగ్లండ్‌తో సెమీస్‌లో అర్ధ సెంచరీతో పాటు నాలుగు క్యాచ్‌లు పట్టి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచిన దక్షిణాఫ్రికా ఓపెనర్ తజ్మీన్ బ్రిట్స్ క్రికెట్ ప్రస్థానం అసాధారణం. అడ్డంకులను అధిగమించి ఇక్కడి వరకు రావడం స్ఫూర్తిదాయకం. 2007 వరల్డ్ జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో జావెలిన్ త్రోలో బ్రిట్స్ స్వర్ణం సాధించింది. ఆపై ఇదే ఆటలో మరింత ముందుకు వెళ్లేందుకు పట్టుదలగా సాధన చేసింది. 2012 లండన్ ఒలింపిక్స్ లక్ష్యంగా ఆమె సన్నాహాలు సాగాయి.
ఈ మెగా ఈవెంట్ కోసం ఆమె అప్పటికే అర్హత సాధించింది కూడా. అయితే దురదృష్టం బ్రిట్స్‌ను పలకరించింది. 2011లో జరిగిన కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడింది. మూడు నెలల పాటు మంచానికే పరిమితం కావాల్సి వచ్చింది. శరీరంలో వేర్వేరు భాగాలన్నీ దెబ్బ తినగా, మళ్లీ మళ్లీ శస్త్ర చికిత్సలు చేయాల్సి వచ్చింది. ఎలాంటి మార్గనిర్దేశనం లేని ఆ సమయంలో ఆత్మహత్యకు కూడా ప్రయత్నించింది. అయితే చివరకు కోలుకున్న తర్వాత క్రికెట్ వైపు మళ్లింది. నడవలేని స్థితి నుంచి మళ్లీ మైదానంలోకి దిగింది.
పట్టుదలతో సాధన చేసి దేశవాళీలో మంచి ప్రదర్శనతో సీనియర్ స్థాయి వరకు ఎదిగింది. 2018 టి20 వరల్డ్‌కప్‌లోనే చాన్స్ లభిస్తుందని అనుకున్నా, త్రుటిలో చేజారింది. ఇప్పుడు ఈసారి తానే ముందుండి జట్టును ఫైనల్ వరకు నడిపించింది. సెమీస్‌లో ఒక క్యాచ్ కోసం డైవ్ చేసినప్పుడు ఒక్కసారిగా ఆమెను పాత జ్ఞాపకాలు చుట్టుముట్టాయి. అయితే ఎలాంటి గాయాలు కాలేదని తెలుసుకొని ఊరట పొందింది. సొంత గడ్డపై వరల్డ్‌కప్ ఫైనల్ ఆడబోవడం కలగా ఉందని, మరొక్క మంచి ప్రదర్శనతో ట్రోఫీ అందుకునే క్షణం కోసం ఎదురు చూస్తున్నట్లుగా తజ్మీన్ బ్రిట్స్ భావోద్వేగంతో చెప్పింది.
Comments
Please login to add a commentAdd a comment