కాన్‌బెర్రా: ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టీ20లో టీమిండియా శుభారంభం చేసింది. ఆసీస్‌పై 11 పరుగుల తేడాతో గెలిచి సిరీస్‌లో ఆధిక్యం సాధించింది. 162 పరుగుల టార్గెట్‌ను ఆసీస్ ఛేదించే క్రమంలో వారిని ఒత్తిడికి గురిచేసిన టీమిండియా విజయాన్ని ఖాతాలో వేసుకుంది. గాయపడ్డ జడేజా స్థానంలో కాంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన యజ్వేంద్ర చహల్ తన స్పిన్ మాయాజాలంతో భారత్‌కు విజయాన్ని అందించాడు. మూడు వికెట్లను సాధించి ఆసీస్ వెన్నువిరిచాడు. ఫించ్, స్మిత్,. మాథ్యూ వేడ్‌లను ఔట్ చేశాడు. తన ఆఖరి ఓవర్ చివరి బంతికి వేడ్‌ను ఔట్ చేసి మరీ తనేమిటో నిరూపించుకున్నాడు.(చహల్‌పై ఆసీస్ అభ్యంతరం)
భారత్ నిర్దేశించిన టార్గెట్‌ను ఛేదించడానికి బరిలోకి దిగిన ఆసీస్‌కు డీఆర్సీ షార్ట్(34), ఫించ్(35)లు మంచి ఆరంభాన్ని ఇచ్చారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 56 పరుగులు జోడించిన తర్వాత ఫించ్ ఔటయ్యాడు. ఎనిమిదో ఓవర్ నాల్గో బంతికి ఫించ్ ఔట్ చేసిన చహల్..10వ ఓవర్ ఐదో బంతికి స్టీవ్ స్మిత్(12) పెవిలియన్‌కు పంపి మంచి బ్రేక్ ఇచ్చాడు.. దాంతో ఆసీస్ 72 పరుగుల వద్ద రెండో వికెట్‌ను కోల్పోయింది. ఆపై మ్యాక్స్‌వెల్(2), డీఆర్సీ షార్ట్‌లను తన వేర్వేరు ఓవర్లలో నటరాజన్ ఔట్ చేయడంతో టీమిండియా రేసులోకి వచ్చింది. ఆ తర్వాత హెన్రిక్యూస్(30) ఫర్వాలేదనిపించినా అతన్ని దీపక్ చాహర్ ఔట్ చేశాడు. దాంతో ఆసీస్‌కు తిరిగి తేరుకోలేకపోయింది. ఆసీస్ నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 150 పరుగులే చేసి ఓటమి పాలైంది. చాహల్, నటరాజన్‌లు తలో మూడు వికెట్లు సాధించగా, దీపక్ చాహర్‌కు వికెట్ లభించింది.
ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా జట్టులో కేఎల్ రాహుల్(51;40 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్ సెంచరీ సాధించగా, రవీంద్ర జడేజా(44 నాటౌట్; 23 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. ఇక సంజూ శాంసన్(23; 15 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్) ఫర్వాలేదనిపించాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆసీస్ ఫీల్డింగ్ ఎంచుకోవడంతో టీమిండియా ముందుగా బ్యాటింగ్‌కు దిగింది. టీమిండియా ఇన్నింగ్స్‌ను రాహుల్, ధావన్‌లు ఆరంభించారు. కాగా, స్టార్క్ వేసిన మూడో ఓవర్ ఐదోబంతికి ధావన్ తడబడి బౌల్డ్‌గా నిష్క్రమించాడు. అనంతరం కోహ్లి బ్యాటింగ్‌కు వచ్చిన కోహ్లి కూడా ఎక్కువ సేపు క్రీజ్‌లో నిలబడలేకపోయాడు. కేవలం ఫోర్ కొట్టిన కోహ్లి పెద్దగా మెరుపులేకుండా ఔటయ్యాడు. కాగా, కేఎల్ రాహుల్ మాత్రం మెరిశాడు. 37 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో హాఫ్ సెంచరీ సాధించాడు. (ఇంగ్లండ్ తొండాట.. మోర్గాన్‌కు సీక్రెట్ మెసేజ్‌లు )
కోహ్లి ఔటైన తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన సంజూ శాంసన్ ధాటిగా ఆడే యత్నం చేశాడు. కానీ హెన్రిక్యూస్ వేసిన 12 ఓవర్ తొలి బంతికి స్వీప్సెన్‌కు క్యాచ్ ఇచ్చి శాంసన్ ఔటయ్యాడు. ఆపై కాసేపటికి మనీష్ పాండే(2) నిరాశపరిచాడు. అటు తర్వాత స్వల్ప వ్యవధిలో రాహుల్ కూడా ఔట్ కావడంతో టీమిండియా 92 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. దాంతో హార్దిక్-రవీంద్ర జడేజాలపై భారం పడింది. హార్దిక్(16; 15 బంతుల్లో 1 సిక్స్) స్కోరు పెంచే యత్నంలో ఔటయ్యాడు. హెన్రిక్యూస్ వేసిన 17 ఓవర్ ఐదో బంతికి హార్దిక్ పెవిలియన్ చేరాడు. జడేజా బ్యాట్ ఝుళిపించడంతో స్కోరు 150 పరుగుల మార్కును చేరింది. జడేజా చివరి వరకూ క్రీజ్‌లో ఉండటంతో టీమిండియా ఏడు వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. ఇరుజట్ల మధ్య రెండో టీ20 ఆదివారం సిడ్నీలో జరుగనుంది.
Comments
Please login to add a commentAdd a comment