టీమిండియా క్రికెటర్, ఆంధ్ర ఆటగాడు గాదె హనుమ విహారి తండ్రి అయ్యాడు. అతని భార్య ప్రీతి రాజ్ మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని విహారి దంపతులు సోషల్ మీడియా వేదికగా నిన్న (జులై 17) రివీల్ చేశారు. మా కుటుంబంలో సరికొత్త ఆనందాన్ని ప్రకటిస్తున్నందుకు సంతోషిస్తున్నాము అంటూ బిడ్డ పేరు (Ivaan Kiesh), డేట్ ఆఫ్ బర్త్ (07-07-2023) రివీల్ చేస్తూ విహారి దంపతులు ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన వార్త తెలిసి సన్నిహితులు, అభిమానులు, సహచర క్రికెటర్లు విహారి దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
కాగా, హనుమ విహారి నేతృత్వంలో సౌత్ జోన్ జట్టు ఇటీవలే ముగిసిన దులీప్ ట్రోఫీ-2023ని గెలుచుకుంది. వెస్ట్ జోన్‌తో హోరాహోరీగా సాగిన ఫైనల్లో సౌత్ జోన్ 75 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో విహారి కెప్టెన్స్ ఇన్నింగ్స్ (63, 42) ఆడగా.. విధ్వత్ కావేరప్ప 8 వికెట్లు (7/53, 1/51) పడగొట్టి సౌత్ జోన్ గెలుపులో కీలకపాత్ర పోషించాడు.
ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడకు చెందిన 29 ఏళ్ల హనుమ విహారి భారత్ తరఫున 16 టెస్ట్ మ్యాచ్‌లు ఆడి 34 సగటున, సెంచరీ, 5 అర్ధసెంచరీల సాయంతో 839 పరుగులు చేశాడు. సీనియర్లతో టీమిండియా టెస్ట్ స్క్వాడ్ బలంగా ఉండటంతో విహారికి సరైన అవకాశాలు దక్కడం లేదు. అతను చివరిసారిగా గతేడాది (2022) టీమిండియాకు ఆడాడు.
2021 ఇంగ్లండ్ పర్యటనకు కంటిన్యుటిగా జరిగిన ఐదో టెస్ట్‌లో విహారి టీమిండియాకు చివరిసారిగా ప్రాతినిధ్యం వహించాడు. ఆ మ్యాచ్‌లో అతను రెండు ఇన్నింగ్స్‌ల్లో వరుసగా 20, 11 పరుగులు మాత్రమే చేసి విఫలమయ్యాడు. ఆ తర్వాత అతనికి భారత సెలెక్టర్ల నుంచి పిలుపు అందలేదు.
దేశవాలీ టోర్నీల్లో ఆంధ్రప్రదేశ్‌కు ప్రాతినిధ్యం వహించే విహారి.. రాబోయే సీజన్‌లో ఆంధ్రకు కాకుండా మధ్యప్రదేశ్‌కు ప్రాతినిధ్యం వహించాలని నిర్ణయించకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై అతని నుంచి ఎటువంటి స్పష్టమైన ప్రకటన లేదు.
Comments
Please login to add a commentAdd a comment