పోర్ట్ ఎలిజబెత్: వరుసగా రెండో వన్డే గెలిచి సిరీస్‌నూ కైవసం చేసుకోవాలనుకున్న భారత్ ఆశలు మూకుమ్మడి వైఫల్యంతో ఆవిరయ్యాయి. నిలకడలేని బ్యాటింగ్, పసలేని బౌలింగ్, నిలువెత్తు నిర్లక్ష్యం భారత్ కొంపముంచాయి. ఇదే అదనుగా దక్షిణాఫ్రికా ఆల్‌రౌండ్ ప్రదర్శనతో భారత్‌ను దెబ్బకొట్టింది. దీంతో మంగళవారం జరిగిన రెండో వన్డేలో టీమిండియా 8 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా చేతిలో పరాజయం చవిచూసింది.
ఆతిథ్య జట్టు సిరీస్‌ను 1–1తో సమం చేసింది. చివరిదైన మూడో వన్డే రేపు పార్ల్‌లో జరుగుతుంది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా 46.2 ఓవర్లలో 211 పరుగులకే ఆలౌటైంది. టాపార్డర్‌లో సాయి సుదర్శన్ (83 బంతుల్లో 62; 7 ఫోర్లు, 1 సిక్స్), మిడిలార్డర్‌లో కేఎల్ రాహుల్ (64 బంతుల్లో 56; 7 ఫోర్లు)... ఈ ఇద్దరు తప్ప ఇంకెవరూ కనీసం 20 పరుగులైన చేయలేకపోయారు.
సఫారీ బౌలర్లు బర్జర్ (3/30), బ్యురన్ హెన్‌డ్రిక్స్ (2/34), కేశవ్ మహరాజ్ (2/51) సమష్టిగా దెబ్బతీశారు. క్రమం తప్పకుండా వికెట్లు పడగొట్టడంతో భారత్ నిర్ణీత 50 ఓవర్లను పూర్తిగా ఆడలేకపోయింది. అనంతరం సులువైన లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా 42.3 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 215 పరుగులు చేసి ఛేదించింది.
ఓపెనర్లు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ టోని డి జోర్జి (122 బంతుల్లో 119 నాటౌట్; 9 ఫోర్లు, 6 సిక్స్‌లు) అజేయ సెంచరీతో కదంతొక్కగా, రీజా హెన్‌డ్రిక్స్ (81 బంతుల్లో 52; 7 ఫోర్లు) అర్ధసెంచరీ సాధించాడు. ఇద్దరు తొలి వికెట్‌కు 130 పరుగులు చేయడంతోనే భారత్ పరాజయం ఖాయమైంది. వాన్ డర్ డసెన్ (36; 5 ఫోర్లు) మెరుగ్గా ఆడాడు. ఈ మ్యాచ్‌తో రింకూ సింగ్ వన్డేల్లో అరంగేట్రం చేశాడు.
స్కోరు వివరాలు
భారత్ ఇన్నింగ్స్: రుతురాజ్ (ఎల్బీడబ్ల్యూ) (బి) బర్జర్ 4; సాయి సుదర్శన్ (సి) క్లాసెన్ (బి) విలియమ్స్ 62; తిలక్‌వర్మ (సి) బ్యురన్ హెన్‌డ్రిక్స్ (బి) బర్జర్ 10; రాహుల్ (సి) మిల్లర్ (బి) బర్జర్ 56; సామ్సన్ (బి) బ్యురన్ హెన్‌డ్రిక్స్ 12; రింకూ సింగ్ (స్టంప్డ్) క్లాసెన్ (బి) కేశవ్ 17; అక్షర్ (సి) సబ్–వెరెన్ (బి) మార్క్‌రమ్ 7; కుల్దీప్ (సి) బ్యురన్ హెన్‌డ్రిక్స్ (బి) కేశవ్ 1; అర్ష్ దీప్ (సి) మిల్లర్ (బి) బ్యురన్ హెన్‌డ్రిక్స్ 18; అవేశ్ (రనౌట్) 9; ముకేశ్ (నాటౌట్) 4; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (46.2 ఓవర్లలో ఆలౌట్) 211. వికెట్ల పతనం: 1–4, 2–46, 3–114, 4–136, 5–167, 6–169, 7–172, 8–186, 9–204, 10–211. బౌలింగ్: బర్జర్ 10–0–30–3, విలియమ్స్ 9–1–49–1, బ్యురన్ హెన్‌డ్రిక్స్ 9.2–1–34–2, ముల్డర్ 4–0–19–0, కేశవ్ 10–0–51–2, మార్క్‌రమ్ 4–0–28–1.
దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: రీజా హెన్‌డ్రిక్స్ (సి) ముకేశ్ (బి) అర్ష్దీప్ 52; టోని (నాటౌట్) 119; డసెన్ (సి) సామ్సన్ (బి) రింకూ 36; మార్క్‌రమ్ (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (42.3 ఓవర్లలో 2 వికెట్లకు) 215. వికెట్ల పతనం: 1–130, 2–206. బౌలింగ్: ముకేశ్ 8–2–46–0, అర్ష్దీప్ 8–0–28–1, అవేశ్ 8–0–43–0, అక్షర్ 6–0–22–0, కుల్దీప్ 8–0–48–0, తిలక్ వర్మ 3–0–18–0, రింకూ సింగ్ 1–0–2–1, సాయి సుదర్శన్ 0.3–0–8–0.
Comments
Please login to add a commentAdd a comment