శ్రీలంకపై భారత్‌ ఘన విజయం.. | Womens T20 WC 2024 IND Vs SL: Team India Won By 82 Runs Against Sri Lanka, Check Full Score Details | Sakshi
Sakshi News home page

T20 WC 2024 IND Vs SL: శ్రీలంకపై భారత్‌ ఘన విజయం..

Published Thu, Oct 10 2024 3:51 AM | Last Updated on Thu, Oct 10 2024 10:39 AM

Team India won by 82 runs against Sri Lanka

శ్రీలంకపై 82 పరుగులతో టీమిండియా ఘనవిజయం

హర్మన్‌ప్రీత్, స్మృతి అర్ధ సెంచరీలు

ఆదివారం ఆస్ట్రేలియాతో కీలక పోరు  

దుబాయ్‌: మహిళల టి20 ప్రపంచకప్‌ సెమీఫైనల్‌ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో భారత జట్టు అద్భుత ఆటతీరుతో అదరగొట్టింది. గ్రూప్‌ ‘ఎ’లో భాగంగా బుధవారం ఆసియా చాంపియన్‌ శ్రీలంక జట్టుతో జరిగిన మూడో లీగ్‌ మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ బృందం 82 పరుగుల తేడాతో గెలిచింది. వరల్డ్‌ కప్‌ చరిత్రలో టీమిండియాకు ఇదే అతిపెద్ద విజయం. 

వరుసగా మూడో ఓటమితో శ్రీలంక సెమీఫైనల్‌ రేసు నుంచి నిష్క్రమించింది. టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత మహిళల జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ కెపె్టన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (27 బంతుల్లో 52 నాటౌట్‌; 8 ఫోర్లు, ఒక సిక్స్‌), ఓపెనర్‌ స్మృతి మంధాన (38 బంతుల్లో 50; 4 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధ శతకాలతో ఆకట్టుకున్నారు. 

మరో ఓపెనర్‌ షఫాలీ వర్మ (40 బంతుల్లో 43; 4 ఫోర్లు) కూడా కీలక ఇన్నింగ్స్‌ ఆడింది. అనంతరం ఛేదనలో శ్రీలంక మహిళల జట్టు 19.5 ఓవర్లలో 90 పరుగులకు ఆలౌటైంది. కవిషా దిల్హారి (21), అనుష్క సంజీవని (20), కాంచన (19) తలా కొన్ని పరుగులు చేశారు. భారత బౌలర్లలో హైదరాబాద్‌ అమ్మాయి అరుంధతి రెడ్డి, కేరళ స్పిన్నర్‌ ఆశ శోభన చెరో మూడు వికెట్లు పడగొట్టారు. 

తొలి పోరులో న్యూజిలాండ్‌ చేతిలో ఓడిన భారత్‌... ఆ తర్వాత వరుసగా రెండో మ్యాచ్‌లో నెగ్గి 4 పాయింట్లతో రెండో స్థానానికి చేరింది. లీగ్‌ దశలో ఆదివారం జరిగే తమ తదుపరి మ్యాచ్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ ఆ్రస్టేలియాతో భారత జట్టు తలపడనుంది.  

స్కోరు వివరాలు 
భారత్‌ ఇన్నింగ్స్‌: షఫాలీ (సి) విష్మి గుణరత్నె (బి) చమరి ఆటపట్టు 43; స్మృతి మంధాన (రనౌట్‌) 50; హర్మన్‌ప్రీత్‌ (నాటౌట్‌) 52; జెమీమా (సి) ప్రబోధిని (బి) కాంచన 16; రిచా ఘోష్‌ (నాటౌట్‌) 6; ఎక్స్‌ట్రాలు 5, మొత్తం (20 ఓవర్లలో 3 వికెట్లకు)172. వికెట్ల పతనం: 1–98, 2–98, 3–128, బౌలింగ్‌: ప్రియదర్శిని 2–0–11–0; సుగంధిక 3–0–29–0; ప్రబోధిని 3–0–32–0; కవిషా దిల్హారి 2–0–11–0; ఇనోక 3–0–26–0; చమరి ఆటపట్టు 4–0–34–1; కాంచన 3–0–29–1.  

శ్రీలంక ఇన్నింగ్స్‌: విష్మి గుణరత్నె (సి) (సబ్‌) రాధ (బి) రేణుక 0; చమరి ఆటపట్టు (సి) దీప్తి శర్మ (బి) శ్రేయాంక 1; హర్షిత (సి) రిచా ఘోష్‌ (బి) రేణుక 3; కవిషా దిల్హారి (సి) రేణుక (బి) అరుంధతి 21; అనుష్క (స్టంప్డ్‌) రిచా ఘోష్‌ (బి) శోభన 20; నిలాక్షిక సిల్వా (సి) షఫాలీ (బి) అరుంధతి 8; కాంచన (సి) (సబ్‌) రాధ (బి) అరుంధతి 19; సుగంధిక (సి) రిచా ఘోష్‌ (బి) శోభన 1; ప్రియదర్శిని (సి) (సబ్‌) రాధ (బి) శోభన 1; ప్రబోధిని (సి) స్మృతి (బి) దీప్తి శర్మ 9; ఇనోక (నాటౌట్‌) 2; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (19.5 ఓవర్లలో ఆలౌట్‌) 90. వికెట్ల పతనం: 1–0, 2–4, 3–6, 4–43, 5–57, 6–58, 7–61, 8–65, 9–86, 10–90, బౌలింగ్‌: రేణుక 4–0–16–2; శ్రేయాంక 4–0–15–1; దీప్తి 3.5–0–16–1; అరుంధతి రెడ్డి 4–0–19–3; ఆశ శోభన 4–0–19–3.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement