Chappell Rejected Deepak Chahar: Ex-Pacer Venkatesh Prasad Comments Goes Viral - Sakshi
Sakshi News home page

నాడు క్రికెట్‌కు పనికిరాడన్నారు.. రాత్రికిరాత్రి హీరో అయిపోయాడు

Published Thu, Jul 22 2021 4:19 PM | Last Updated on Fri, Jul 23 2021 10:29 AM

Teamindia Ex Pacer Venkatesh Prasad Reveals That Chahar Was Rejected By Greg Chappell For His Height - Sakshi

న్యూఢిల్లీ: శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో సెన్సేషనల్‌ బ్యాటింగ్‌తో (69 నాటౌట్‌) టీమిండియాకు అద్భుత విజయాన్నందించిన దీపక్‌ చాహర్‌పై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్న వేళ భారత మాజీ పేసర్‌ వెంకటేశ్‌ ప్రసాద్‌ ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు. చాహర్‌.. తన 16వ ఏట (2008) రాజస్థాన్ క్రికెట్ అకాడమీలో చోటు దక్కించుకున్న సమయంలో అకాడమీ డైరెక్టర్‌గా ఉన్న గ్రెగ్ చాపెల్.. అతని బౌలింగ్ సామర్థ్యాన్ని శంకిస్తూ, క్రికెట్‌కు పనికిరాడని రిజెక్ట్‌ చేశాడని పేర్కొన్నాడు. గ్రెగ్ చాపెల్ స్థాయి వ్యక్తి బౌలింగ్‌లో పసలేదని, క్రికెట్‌లో భవిష్యత్తు లేదని చెప్పడంతో చాహర్‌ నైరాశ్యంలోకి కూరుకుపోయాడని, అయితే తండ్రి లోకేంద్ర సింగ్ చాహర్ సహకారంతో తిరిగి గాడిలో పడ్డాడని వివరించాడు.

కాగా, నాడు చాపెల్‌.. దీపక్‌ చాహర్‌పై చేసిన వ్యాఖ్యలపై వెంకటేశ్‌ ప్రసాద్‌ స్పందిస్తూ.. విదేశీ కోచ్‌లు చెప్పినవన్నీ గుడ్డిగా నమ్మకూడదని, వాళ్లు చెప్పిన విషయాలన్నీ సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదని అన్నాడు. ఎత్తు కారణంగా నాడు క్రికెట్‌కు పనికిరాడన్న వ్యక్తి.. రాత్రికి రాత్రి హీరో అయిపోయాడని, అదే చాపెల్‌ మాటలు నమ్మి సెలెక్టర్లు చాహర్‌కు అవకాశం ఇచ్చుండకపోయుంటే టీమిండియా ఓ గొప్ప ఆల్‌రౌండర్‌ సేవలను కోల్పోయేదని తెలిపాడు.

ఇకనైనా బీసీసీఐ.. విదేశీ కోచ్‌లపై మోజును తగ్గించుకోవాలని, వాళ్ల మాటలపైనే పూర్తిగా ఆధారపడకుండా ప్రతిభావంతులైన యువ ఆటగాళ్లను పోత్సహించాలని సూచించాడు. విదేశీ కోచ్‌లతో పోలిస్తే, స్వదేశీ కోచ్‌లకు భారత యువ క్రికెటర్లపై  మంచి అవగాహన ఉంటుందని, అందుకే బీసీసీఐతో పాటు ఐపీఎల్‌ ఫ్రాంఛైజీలు స్వదేశీ కోచ్‌లకు తగినన్ని అవకాశాలు కల్పించాలని విజ్ఞప్తి చేశాడు. ఇదిలా ఉంటే, లంకతో జరిగిన రెండో వన్డేలో చాహర్‌ తన ఆల్‌రౌండ్‌ ప్రతిభతో భారత్‌ను ఒంటిచేత్తో గెలిపించిన విషయం తెలిసిందే.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement