31–29తో వారియర్స్‌పై గెలుపు
నోయిడా: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్)లో తెలుగు టైటాన్స్ ‘హ్యాట్రిక్’ విజయాలతో పట్టికలో రెండో స్థానానికి ఎగబాకింది. గురువారం జరిగిన పోరులో టైటాన్స్ 31–29తో బెంగాల్ వారియర్స్ పై నెగ్గింది. కెప్టెన్ విజయ్ మలిక్ (14 పాయింట్లు) అద్భుతంగా రాణించాడు. మ్యాచ్ కీలక దశలో రెయిడింగ్‌కు వెళ్లిన విజయ్ మూడు పాయింట్లు తెచ్చిపెట్టడం టైటాన్స్ విజయానికి కారణమైంది. డిఫెన్స్‌లోనూ తెలుగు జట్టు ప్రత్యర్థిపై పైచేయి సాధించేలా చేసింది.
ఆల్‌రౌండర్ శంకర్ గడాయ్, డిఫెండర్ అంకిత్, రెయిడర్ మన్‌జీత్ తలా 3 పాయింట్లు సాధించారు. వారియర్స్ తరఫున రెయిడర్ ప్రణయ్ రాణే (9) అదరగొట్టాడు. తొలి అర్ధభాగాన్ని 19–9తో టైటాన్స్ ముగించగా... ద్వితీయార్ధంలో ప్రణయ్ క్రమంగా తెచ్చిపెట్టిన పాయింట్లతో రేసులోకి వచ్చింది. మిగతా వారిలో హేమరాజ్, విశ్వాస్ చెరో 4 పాయింట్లు చేశారు. అయితే తెలుగు కెప్టెన్ విజయ్ మలిక్ చేసిన పోరాటంతో విజయం దక్కింది.
అనంతరం జరిగిన రెండో మ్యాచ్‌లో హరియాణా స్టీలర్స్ 32–26తో బెంగళూరు బుల్స్‌పై గెలుపొందింది. స్టీలర్స్ జట్టులో రెయిడర్ వినయ్ (12) ఆకట్టుకున్నాడు. మిగతా వారిలో ఆల్‌రౌండర్ మొహమ్మద్ రెజా 4, రెయిడర్ శివమ్ 5, డిఫెండర్ సంజయ్ 4 పాయింట్లు చేశారు. బుల్స్ జట్టులో ఒక్క అక్షిత్ (7) మాత్రమే నిలకడగా స్కోరు చేశాడు. స్టార్ రెయిడర్, కెప్టెన్ ప్రదీప్ నర్వాల్ (1) ఆకట్టుకోలేకపోయాడు. నితిన్ రావల్ (4), జై భగవాన్ (3) మెరుగ్గా ఆడారు.
ఇప్పటివరకు 12 మ్యాచ్‌లాడిన హరియాణా 9 విజయాలతో టాప్‌లో నిలువగా, 12 మ్యాచ్‌ల్లో ఎనిమిది గెలిచిన టైటాన్స్ రెండో స్థానంలో ఉంది. నేడు జరిగే మ్యాచ్‌ల్లో తమిళ్ తలైవాస్‌తో యూపీ యోధాస్ (రాత్రి 8 గంటలకు), జైపూర్ పింక్ పాంథర్స్‌తో దబంగ్ ఢిల్లీ (రాత్రి 9 గంటలకు) తలపడతాయి.
Comments
Please login to add a commentAdd a comment