జైపూర్ పింక్ పాంథర్స్ చేతిలో పరాజయం
నోయిడా: స్టార్ రెయిడర్ విజయ్ 17 పాయింట్లతో పోరాడినా... ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 11వ సీజన్‌లో తెలుగు టైటాన్స్‌కు పరాజయం తప్పలేదు. లీగ్‌లో భాగంగా శనివారం జరిగిన పోరులో తెలుగు టైటాన్స్ 28–41 పాయింట్ల తేడాతో జైపూర్ పింక్ పాంథర్స్ చేతిలో ఓడింది. విజయ్ ఒంటరి పోరాటం చేయగా... అతడికి సహచరుల నుంచి తోడ్పాటు లభించలేదు. పింక్ పాంథర్స్ తరఫున నీరజ్ నర్వాల్ (12 పాయింట్లు), అర్జున్ దేశ్వాల్ (11 పాయింట్లు) సత్తా చాటారు.
ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ 19 రెయిడ్ పాయింట్లు సాధించగా... జైపూర్ పింక్ పాంథర్స్ 22 రెయిడ్ పాయింట్లు సాధించింది. ట్యాక్లింగ్‌లో పింక్ పాంథర్స్ 12 పాయింట్లు సాధించగా... టైటాన్స్ 7 ట్యాక్లింగ్ పాయింట్లకే పరిమితమైంది. టైటాన్స్ మూడు సార్లు ఆలౌట్ కావడంతో ప్రత్యర్థి జట్టుకు అదనంగా 6 పాయింట్లు దక్కాయి.
తాజా సీజన్‌లో 15 మ్యాచ్‌లాడి 9 విజయాలు, 6 పరాజయాలతో 48 పాయింట్లు ఖాతాలో వేసుకున్న టైటాన్స్ పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతుండగా... జైపూర్ పింక్ పాంథర్స్ (46 పాయింట్లు) పట్టికలో ఐదో స్థానంలో ఉంది. మరో మ్యాచ్‌లో పట్నా పైరెట్స్ 54–29 పాయింట్ల తేడాతో బెంగళూరు బుల్స్‌పై గెలుపొందింది.
పట్నా పైరెట్స్ తరఫున దేవాంక్ 17 పాయింట్లు, అయాన్ 13 పాయింట్లతో విజృంభించగా... బుల్స్ తరఫున జై భగవాన్ 9 పాయింట్లు, ప్రదీప్ నర్వాల్ 8 పాయింట్లు సాధించారు. 25 పాయింట్ల తేడాతో నెగ్గిన పట్నా జట్టు పట్టికలో మూడో స్థానానికి ఎగబాకింది.
Comments
Please login to add a commentAdd a comment