
బెల్‌గ్రేడ్: కొత్త ఏడాదిలో మరో గ్రాండ్‌స్లామ్ టైటిల్ వేటకు టెన్నిస్ స్టార్ నొవాక్ జొకోవిచ్ సిద్ధమయ్యాడు. జనవరి 12 నుంచి జరిగే సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆ్రస్టేలియన్ ఓపెన్ లక్ష్యంగా బరిలోకి దిగనున్న జొకోవిచ్... దానికి ముందు మరో టోర్నీతో తన సీజన్ మొదలు పెడుతున్నాడు.
డిసెంబర్ 29 నుంచి జనవరి 5 వరకు జరిగే బ్రిస్బేన్ ఇంటర్నేషనల్ టోర్నీలో ఈ సెర్బియా దిగ్గజం ఆడతాడు. 2009 తర్వాత అతను ఈ టోర్నీలో బరిలోకి దిగడం ఇదే మొదటిసారి కావడం విశేషం. జొకోవిచ్‌తో పాటు దిమిత్రోవ్, రూన్, టియాఫో, కిరియోస్ తదితర అగ్రశ్రేణి ఆటగాళ్లు బ్రిస్బేన్ టోర్నీలో పాల్గొంటున్నారు.
ఆ్రస్టేలియన్ ఓపెన్‌ను 10 సార్లు గెలిచిన జొకోవిచ్ మరోసారి టైటిల్ సాధిస్తే రికార్డుస్థాయిలో 25వ గ్రాండ్‌స్లామ్ ట్రోఫీ అతని ఖాతాలో చేరుతుంది.