Ravindra Jadeja Photos: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా అమెరికాలో ఎంజాయ్ చేస్తున్నాడు. వెస్టిండీస్‌తో వన్డే సిరీస్ అనంతరం జడ్డూ యూఎస్‌ఏలో వాలిపోయాడు. విండీస్ పర్యటన తర్వాత దొరికిన విరామ సమయాన్ని తనకు నచ్చిన చోటల్లా విహరిస్తూ సెలవులను పూర్తిగా ఆస్వాదిస్తున్నాడు.
ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులకు ఎప్పటికపుడు అప్‌డేట్లు అందిస్తున్నాడు. ఈ క్రమంలో తాజాగా న్యూయార్క్ టైమ్స్ స్వ్కేర్ వద్ద ఉన్న ఫొటోలు పంచుకున్న జడ్డూ.. ‘‘ఈ వెలుగులు ఎప్పటికీ ఇలాగే ఉండిపోతాయి’’ అంటూ క్యాప్షన్ జతచేశాడు. నిమిషాల్లోనే ఈ ఫొటోలకు లక్షల్లో లైకులు వచ్చాయి.
అయితే, కొంతమంది నెటిజన్లు మాత్రం.. ‘‘తిరిగింది చాలు.. కాస్త ఆట మీదకు దృష్టి మళ్లించు.. ప్రాక్టీస్ మొదలుపెట్టు’’ అంటూ రవీంద్ర జడేజాను ట్రోల్ చేస్తున్నారు. బౌండరీ బాది చెన్నై సూపర్ కింగ్స్‌ను విజేతగా నిలిపిన మాదిరిగానే.. వరల్డ్‌కప్ టోర్నీలోనూ రాణించాలని ఆకాంక్షిస్తున్నారు.
కాగా ఆసియా కప్-2022 సందర్భంగా గాయపడ్డ జడ్డూ దాదాపు ఐదు నెలల తర్వాత పునరాగమనం చేశాడు. రీ ఎంట్రీలో అద్భుత ఆట తీరుతో ఆకట్టుకుంటూ రోజురోజుకీ అభిమానుల సంఖ్య పెంచుకుంటున్నాడీ స్పిన్ ఆల్‌రౌండర్. ఇక ఇటీవల వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌లో వరుసగా 37(నాటౌట్), 61 పరుగులు సాధించిన రవీంద్ర జడేజా.. మొత్తంగా ఏడు వికెట్లు పడగొట్టాడు.
ఇక మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో మూడు వికెట్లు తన ఖాతాలో వేసుకున్న జడ్డూ.. మొత్తం 34 పరుగులు సాధించాడు. కాగా ఆగష్టు 30న మొదలుకానున్న ఆసియా వన్డే కప్-2023తో జడేజా మళ్లీ మైదానంలో దిగే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే.. ఈ ఏడాది జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ అత్యధికంగా మూడుసార్లు రవీంద్ర జడేజా నుంచి శాంపిల్స్ సేకరించినట్లు వెల్లడించిన విషయం తెలిసిందే. జనవరి- మే మధ్య డోపింగ్ పరీక్షలు నిర్వహించినట్లు నాడా తెలిపింది.
చదవండి: ఆసీస్ యువ పేసర్ సంచలనం.. 20 బంతుల్లో 1 పరుగు.. 3 వికెట్లు! వీడియో
Comments
Please login to add a commentAdd a comment