లాహోర్: ముగ్గురు పాకిస్తాన్ హాకీ ఆటగాళ్లు సహా ఒక ఫిజియోథెరపిస్ట్‌పై ఆ దేశ హాకీ సమాఖ్య (పీహెచ్‌ఎఫ్) జీవితకాల నిషేధం విధించింది. ఈ నలుగురు ఒక యూరోపియన్ దేశంలో రాజకీయ పీడిత శరణార్థిగా ఆశ్రయం కోరారు. దీంతో ఆగ్రహించిన పీహెచ్‌ఎఫ్ ఆ నలుగురుపై కఠిన నిర్ణయం తీసుకుంది. ప్లేయర్లు ముర్తజా యాకుబ్, ఎతేషామ్ అస్లామ్, అబ్దుర్ రహ్మాన్, ఫిజియో వకాస్ గత నెల నెదర్లాండ్స్, పొలాండ్‌లలో జరిగిన నేషన్స్ కప్ ఆడేందుకు జట్టుతో పాటు వెళ్లారు.
తిరిగొచ్చాక ఆసియా చాంపియన్స్ ట్రోఫీ కోసం శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేస్తే ఆ నలుగురు వ్యక్తిగత కారణాలతో గైర్హాజరు అయ్యారు. అనంతరం వారంతా నేషన్స్ కప్ ఆడేందుకు వెళ్లొచ్చిన షెన్‌జెన్ వీసా (ఐరోపాయేతర పౌరులకు 90 లేదా 180 రోజుల వ్యవధి కోసం మంజూరు చేసే తాత్కాలిక వీసా)తో మళ్లీ నెదర్లాండ్స్‌కు వెళ్లి అక్కడ ఆశ్రయం పొందారు. ఇది తమ దేశానికి తలవంపు మాత్రమే కాదు... భవిష్యత్తులో యూరోపియన్ దేశాలకు వీసాలు దరఖాస్తు చేసే వారందరికీ ఇది పెద్ద సమస్యగా పరిణమిస్తుంది. ఆయా దేశాల్లో జరిగే ఈవెంట్ల కోసం ఇకపై తమ దరఖాస్తులు ఆమోదం పొందడం క్లిష్టతరమవుతుందని పీహెచ్‌ఎఫ్ కార్యదర్శి రాణా ముజాహిద్ వాపోయారు.
Comments
Please login to add a commentAdd a comment