న్యూఢిల్లీ: దేశ రాజధానిలో జరుగుతున్న ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ (ఐఎస్‌ఎస్‌ఎఫ్) ప్రపంచకప్ టోర్నీలో కరోనా కలకలం రేపింది. ముగ్గురు షూటర్లకు కోవిడ్-19 పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో మిగతా షూటర్లంతా హోటల్ గదుల్లో ఐసోలేషన్‌లో ఉన్నట్టు నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌ఆర్ఏఐ) వర్గాలు శనివారం వెల్లడించాయి. వైరస్ బారినపడ్డ షూటర్లతో సన్నిహితంగా ఉన్న మరో ముగ్గురు క్రీడాకారులు సైతం పరీక్షలు చేయించుకున్నట్టు అధికారులు తెలిపారు. వారి ఫలితాలు రావాల్సి ఉండగా.. ముందస్తుగా సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉన్నట్లు టోర్నీ నిర్వహకులు పేర్కొన్నారు. కోవిడ్ బారిన పడ్డ ముగ్గురు షూటర్లలో ఇద్దరు భారతీయ క్రీడాకారులేనని సంబంధిత వర్గాల సమాచారం. ఈ టోర్నీలో పాల్గొనేందుకు వచ్చిన క్రీడాకారుల్లో ఇప్పటికే నలుగురు వైరస్ బారినపడగా.. గురువారం మరో విదేశీ ఆటగాడికి కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.
కాగా, ఈ ప్రపంచకప్‌లో భారత షూటర్లు దివ్యాంశ్ సింగ్ పన్వర్, అర్జున్ బబుతా సత్తాచాటారు. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో ఈ ఇద్దరూ ఫైనల్లో చోటు సంపాదించారు. శుక్రవారం జరిగిన 60 షాట్ల క్వాలిఫికేషన్ రౌండ్లో అర్జున్ (631.8 పాయింట్లు) మూడో స్థానం, పన్వర్ (629.1 పాయింట్లు) ఆరో స్థానంలో నిలిచి తుది పోరుకు అర్హత సాధించారు. వీరిలో పన్వర్ టోక్యో ఒలింపిక్స్ బెర్తును కూడా సాధించాడు. మరోవైపు మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో అంజుం మౌద్గిల్ ఫైనల్ చేరింది. అర్హత పోటీలో అంజుమ్ 629.6 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది.
Comments
Please login to add a commentAdd a comment