ఆట కూడా అసూయ పడే ప్రతిభ.. అదొక్కటే తప్పటడుగు! | Tiger Woods One Of Greatest Golf Shots: Intresitng Facts Of His Life | Sakshi
Sakshi News home page

Tiger Woods: ఆట కూడా అసూయ పడే ప్రతిభ.. అదొక్కటే తప్పటడుగు!

Mar 21 2024 7:18 PM | Updated on Mar 21 2024 7:38 PM

Tiger Woods One Of Greatest Golf Shots: Intresitng Facts Of His Life - Sakshi

ఆట కూడా అసూయ పడే ప్రతిభ (PC: Tiger Woods Insta)

‘ఇంత అద్భుతంగా కూడా ఆడొచ్చా’ అని ఆటే అతడిని చూసి అసూయ పడేంత ప్రతిభ. అతడు బరిలో ఉన్నాడంటే టైటిల్‌ సంగతి దేవుడెరుగు.. కనీసం రన్నరప్‌గానైనా నిలిస్తే చాలని సహచర ఆటగాళ్లు రెండో స్థానం కోసం పోటీపడే వైనం.

నిబంధనలు మారిస్తేనైనా అతడి జోరుకు బ్రేక్‌ పడుతుందేమోనని ఆటరాని ‘ప్రత్యర్థుల’ ఆశ. ఎవరెంత ఈర్ష్య పడినా తన నైపుణ్యంతో శిఖరాగ్రాన నిలిచాడతడు. తొంభైవ దశకం మలినాళ్ల నుంచి దాదాపు దశాబ్ద కాలానికి పైగా గోల్ఫ్‌ సామ్రాజ్యాన్ని ఏలిన మకుటం లేని మహారాజు. అతడి పేరు ‘టైగర్‌ వుడ్స్‌’.

ఆఫ్రికన్‌ అమెరికన్‌- థాయ్‌లాండ్‌ సంతతికి చెందిన ఎర్ల్‌ డెన్నిసన్‌- కుల్తిడా దంపతులకు 1975, డిసెంబరు 30న కాలిఫోర్నియాలో ‘ఎల్‌డ్రిక్‌ టాంట్‌ వుడ్స్‌’గా జన్మించాడు. బాల మేధావి అయిన అతడు చిన్ననాటి నుంచే ఆటపై మక్కువ పెంచుకున్నాడు. రెండేళ్లకే గోల్ఫ్‌ స్టిక్‌ చేతబట్టాడు.

పాల్గొన్న ప్రతి పోటీలోనూ గెలుపొంది.. 19 ఏళ్ల వయసులో ప్రొఫెషనల్‌ గోల్ఫర్‌గా మారాడు. ఎనలేని ‍క్రేజ్‌ సంపాదించి మేటి సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుని కీర్తితో పాటు సంపదనూ పెంచుకుంటూ పోయాడు. ముఖ్యంగా 2000 ఏడాదిలో 15 స్ట్రోక్స్‌ తేడాతో వుడ్స్‌ యూఎస్‌ ఓపెన్‌ గెలవడం అతడి కెరీర్‌తో పాటు గోల్ఫ్‌ చరిత్రలోనే హైలైట్‌గా నిలిచిపోయిందని చెప్పవచ్చు.

‘టైగర్‌ స్లామ్‌’
అదే విధంగా 2001లో మాస్టర్స్‌ టైటిల్‌ గెలిచిన వుడ్స్‌.. తద్వారా వరుసగా నాలుగు గోల్ఫ్‌ మేజర్‌ టోర్నీలు గెలిచిన తొలి ఆటగాడిగా చరిత్రకెక్కాడు. మాస్టర్స్‌, యూఎస్‌ ఓపెన్‌, బ్రిటిష్‌ ఓపెన్‌, పీజీఏ చాంపియన్‌షిప్‌ ట్రోఫీలు కైవసం చేసుకుని.. ఇది ‘టైగర్‌ స్లామ్‌’ అనేలా గోల్ఫ్‌ ప్రపంచం ప్రశంసలు అందుకున్నాడు.

ఇలా గోల్ఫ్‌ రారాజుగా పేరొందినా వ్యక్తిగత జీవితంలోని పొరపాట్ల వల్ల వుడ్స్‌ అపఖ్యాతిని కూడా మూటగట్టుకున్నాడు. అయినా పడిలేచిన కెరటంలా ఆటకు మెరుగులు దిద్దుకుని ప్లేయర్‌గా తన ప్రతిష్టను ఇనుమడింపజేసుకున్నాడు. 15 సార్లు మేజర్‌ చాంపియన్స్‌ గెలవడం సహా ఏకంగా 683 వారాల పాటు వరల్డ్‌ నంబర్‌ వన్‌గా నిలిచిన ఘనత సొంతం చేసుకున్నాడు.

ఇంతకీ వుడ్స్‌ పేరులో టైగర్‌ ఎలా చేరిందో తెలుసా?.. వుడ్స్‌ తండ్రి ఓ ఆర్మీ అధికారి. ఆయన వియత్నాం యుద్ధంలో పాల్గొన్నట్లు ఆధారాలు ఉన్నాయి. తండ్రి స్నేహితుడు, వియత్నాం యుద్ధవీరుడు అయిన టైగర్‌కు గౌరవ సూచకంగా తన పేరులో ఆ పదాన్ని జోడించుకుని.. టైగర్‌ వుడ్స్‌గా చరిత్రలో ఆ పేరును అజరామరం చేశాడు.

భార్యకు క్షమాపణ.. విడాకులు
2001లో స్వీడిష్‌ గోల్ఫర్‌ జెస్పెర్‌ పార్ణెవిక్‌ ద్వారా పరిచయమైన నోర్డెగ్రెన్‌ను ప్రేమించిన టైగర్‌ వుడ్స్‌.. 2003లో ఆమెతో నిశ్చితార్థం చేసుకున్నాడు. ఆ మరుసటి ఏడాది నోర్డెగ్రెన్‌తో కలిసి పెళ్లి బంధంలో అడుగుపెట్టాడు.

ఈ జంటకు కూతురు సామ​ అలెక్సిస్‌ వుడ్స్‌, చార్లీ అక్సెల్‌ వుడ్స్‌ సంతానం. అయితే, వుడ్స్‌ వివాహేతర సంబంధాల కారణంగా విసిగెత్తిపోయిన నోర్డెగ్రెన్‌ అతడికి విడాకులు ఇచ్చింది. అనంతరం మరో వ్యక్తిని పెళ్లాడింది. నోర్డెగ్రెన్‌ విషయంలో తప్పుచేశానని ఒప్పుకొన్న టైగర్‌ వుడ్స్‌.. ఇప్పటికీ స్నేహితుడిగా కొనసాగుతున్నాడు.

చదవండి: #MSDhoni: స్వర్ణ యుగం ముగిసింది.. గుండె ముక్కలైంది!.. ఆ ఊహే కష్టంగా ఉంది..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement