‘అసలు’కు ముందు ఆఖరి సమరం.. నేడు భారత్, ఆసీస్‌ తొలి వన్డే! | Ind Vs AUS 1st ODI 2023 Today: Know Details Of Date, Time, When And Where To Watch India Vs Australia Match - Sakshi
Sakshi News home page

Ind Vs Aus 1st ODI 2023: ‘అసలు’కు ముందు ఆఖరి సమరం.. నేడు భారత్, ఆసీస్‌ తొలి వన్డే!

Published Fri, Sep 22 2023 2:06 AM | Last Updated on Fri, Sep 22 2023 8:59 AM

Today is the first ODI between India and Australia - Sakshi

మొహాలి: ప్రపంచకప్‌లో భారత్,  ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్‌కు మరో 16 రోజుల సమయం ఉంది. కానీ దానికి ముందు తమ బలం తేల్చుకునేందుకు ఇరు జట్లు ద్వైపాక్షిక సిరీస్‌తో సన్నద్ధమయ్యాయి. భారత్, ఆ్రస్టేలియా మధ్య మూడు వన్డేల పోరులో భాగంగా నేడు తొలి మ్యాచ్‌ జరగనుంది.

ఆసియా కప్‌ గెలిచిన ఉత్సాహంలో టీమిండియా బరిలోకి దిగుతుండగా, ఇటీవల దక్షిణాఫ్రికా గడ్డపై ఆసీస్‌ సిరీస్‌ ఓడింది. భారత టాప్‌ ప్లేయర్లు ఈ సిరీస్‌ తొలి రెండు వన్డేల నుంచి విశ్రాంతి తీసుకోగా... మరోవైపు విశ్రాంతి తర్వాత కంగారూ జట్టు ప్రధాన ఆటగాళ్లు ఇప్పుడు బరిలోకి దిగుతుండటం విశేషం. ఈ నేపథ్యంలో సిరీస్‌ ఆసక్తకరంగా సాగే అవకాశం ఉంది.  

ఆ ముగ్గురే కీలకం... 
భారత జట్టుకు సంబంధించి ఈ సిరీస్‌లో ముగ్గురి ఆటపై అందరి దృష్టీ కేంద్రీకృతమైంది. అక్షర్‌ పటేల్‌ గాయం నేపథ్యంలో వరల్డ్‌కప్‌ జట్టులో చోటు ఆశిస్తున్న అశి్వన్‌ ఎలా ఆడతాడనేది ఆసక్తికరం. ఏడాదిన్నర తర్వాత అతను వన్డే టీమ్‌లోకి వచ్చాడు. పేరుకే గాయం నుంచి కోలుకున్నా శ్రేయస్‌ అయ్యర్‌ ఆసియా కప్‌లో పూర్తి ఫిట్‌గా లేక మళ్లీ మ్యాచ్‌లకు దూరమయ్యాడు. అతను వరల్డ్‌కప్‌ టీమ్‌లో కొనసాగగలడా అనేందుకు ఈ సిరీసే సమాధానమిస్తుంది.

ఆటతో పాటు ఫిట్‌నెస్‌ను కూడా శ్రేయస్‌ నిరూపించుకోవాల్సి ఉంది. మరోవైపు మిడిలార్డర్‌లో సూర్యకుమార్‌ యాదవ్‌ ఇంకా చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్‌ ఆడలేదు. ఆసీస్‌ జట్టు కొన్నాళ్ల క్రితం భారత్‌లో పర్యటించినప్పుడు మూడు వన్డేల్లోనూ సూర్య మొదటి బంతికే అవుటయ్యాడు. ఇలాంటి స్థితిలో ఈ ముగ్గురు తమదైన రీతిలో సత్తా చాటాల్సి ఉంది.

ఇతర ఆటగాళ్లలో గిల్, రాహుల్, ఇషాన్‌ కిషన్‌ ఫామ్‌లో ఉండగా, జడేజా బ్యాటింగ్‌ ఇంకా బలహీనంగానే ఉంది. ఆసియా ఫైనల్లో చెలరేగిన సిరాజ్‌ అదే జోరు కొనసాగించాలని భావిస్తున్నాడు. అశ్విన్‌తో పోటీ పడుతున్న వాషింగ్టన్‌ సుందర్‌ బలమైన ప్రత్యర్థిపై ఎలాంటి ప్రభావం చూపిస్తాడనేది ఆసక్తికరం.  

కమిన్స్, స్మిత్‌ సిద్ధం... 
ఆ్రస్టేలియా జట్టు వన్డే కెపె్టన్‌గా ఎంపికై దాదాపు ఏడాది అవుతున్నా వేర్వేరు కారణాలతో కమిన్స్‌ రెండు మ్యాచ్‌లలోనే నాయకత్వం వహించాడు. గాయంతో ఇటీవలి దక్షిణాఫ్రికా టూర్‌కూ అతను దూరమయ్యాడు. ఇప్పుడు భారత్‌తో సిరీస్‌లో మళ్లీ ఫామ్‌ను అందుకునేందుకు కమిన్స్‌ బరిలోకి దిగుతున్నాడు. అతనిలాగే స్టీవ్‌ స్మిత్‌ కూడా కొంత విరామం తర్వాత వచ్చాడు. భారత గడ్డపై చక్కటి రికార్డు ఉన్న స్మిత్‌ కెప్టెన్సీ  లోనే ఆ జట్టు ఇక్కడ సిరీస్‌ కూడా గెలుచుకుంది.

వార్నర్, మిచెల్‌ మార్ష్, లబుషేన్‌లతో జట్టు బ్యాటింగ్‌ పటిష్టంగా ఉంది. మిడిలార్డర్‌లో క్యారీ, గ్రీన్, స్టొయినిస్‌లాంటి ఆటగాళ్లు జట్టుకు పెద్ద బలం. మ్యాక్స్‌వెల్, స్టార్క్‌ ఈ మ్యాచ్‌ బరిలోకి దిగడం లేదు. భారత సంతతికి చెందిన స్పిన్నర్‌ తన్వీర్‌ సంఘాకు తుది జట్టులో అవకాశం దక్కవచ్చు. అనూహ్యంగా హెడ్‌ గాయపడటంతో టీమ్‌ ప్రణాళికల్లో కొంత మార్పు జరిగినా ఆ లోటు కనిపించకుండా ఆడగల సమర్థులు టీమ్‌లో ఉండటం ఆసీస్‌కు సానుకూలాంశం.  

 4 భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య మొహాలీలో ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్‌లు జరిగాయి. నాలుగు మ్యాచ్‌ల్లోనూ భారత జట్టు ఓడిపోయింది.  

67 స్వదేశంలో ఆ్రస్టేలియా జట్టుతో ఇప్పటి వరకు భారత్‌ 67 మ్యాచ్‌లు ఆడింది. 30 మ్యాచ్‌ల్లో భారత్‌ గెలిచింది. 32 మ్యాచ్‌ల్లో ఆ్రస్టేలియా విజయం సాధించింది. మరో ఐదు మ్యాచ్‌ల్లో ఫలితం తేలలేదు.  

పిచ్, వాతావరణం 
సాధారణంగా బ్యాటింగ్‌కు అనుకూలమైన పిచ్‌. అయితే ఇక్కడ నాలుగేళ్లుగా వన్డే జరగలేదు. కానీ ఐపీఎల్‌లో భారీ స్కోర్లు నమోదయ్యాయి. మ్యాచ్‌ రోజు వర్షసూచన లేదు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement