నేడు సూపర్–8లో భారత్ తొలి మ్యాచ్
అఫ్గానిస్తాన్‌తో కీలక సమరం
జోరు మీదున్న రోహిత్ సేన
రా.గం.8.00 నుంచి స్టార్ స్పోర్ట్స్, హాట్ స్టార్‌లలో ప్రత్యక్ష ప్రసారం
ఎలాంటి విధ్వంసక బ్యాటింగ్ ప్రదర్శనలు లేవు...ఎలాంటి అసాధారణ బౌలింగ్ గణాంకాలు లేవు...ఐర్లాండ్, అమెరికాలపై సులువుగా గెలిస్తే పాక్ పోటీనిచ్చినా ఫలితం మన వైపే నిలిచింది. పెద్దగా ప్రతిఘటన లేకుండా ముందంజ వేసిన భారత జట్టు ఇప్పుడు దానిని కొనసాగించాలని పట్టుదలగా ఉంది. అప్పుడప్పుడు సంచలనాలతో అలరించే అఫ్గానిస్తాన్ ఎదురుగా నిలిచింది.
బ్రిడ్జ్‌టౌన్: టి20 వరల్డ్ కప్‌లో లీగ్ దశతో పోలిస్తే కాస్త బలమైన ప్రత్యర్థులతో తలపడే అవకాశం ఉన్న సూపర్–8లో భారత జట్టు తమ తొలి మ్యాచ్ కోసం సన్నద్ధమైంది. నేడు జరిగే పోరులో అఫ్గానిస్తాన్‌తో టీమిండియా తలపడుతుంది.
లీగ్ దశలో ఓటమి లేకుండా సాగిన భారత జట్టే ఇక్కడా ఫేవరెట్‌గా కనిపిస్తుండగా...అఫ్గాన్ తమ బౌలింగ్ బలాన్నే నమ్ముకుంది. ఇరు జట్ల మధ్య ఇప్పటి వరకు 8 అంతర్జాతీయ టి20 మ్యాచ్‌లు జరగ్గా...భారత్ 7 గెలిచింది. మరో మ్యాచ్‌లో ఫలితం రాలేదు.
అదే జట్టుతో...
సూపర్–8లో పిచ్‌లు స్పిన్‌ను అనుకూలించే పరిస్థితి ఉంది కాబట్టి భారత్ కుల్దీప్‌ను తీసుకోవచ్చనే చర్చ జరిగింది. అయితే అక్షర్ అటు స్పిన్‌తో పాటు ఇటు బ్యాటింగ్‌తో కూడా కీలక పరుగులు సాధిస్తుండటంతో మేనేజ్‌మెంట్ ఆ సాహసం చేయకపోవచ్చు. రోహిత్, కోహ్లి ఓపెనర్లుగా చెలరేగితే జట్టుకు తిరుగుండదు. కోహ్లి అన్ని మ్యాచ్‌లలో విఫలమైనా...ఒక్క సరైన ఇన్నింగ్స్ అతని స్థాయిని చూపించగలదు.
పంత్ మూడో స్థానంలో చక్కగా నిలదొక్కుకున్నాడు. అఫ్గాన్ స్పిన్నర్లపై ఎదురుదాడికి మిడిలార్డర్‌లో సూర్యకుమార్, దూబే సరైనవాళ్లు కాగలరు. ఆ తర్వాత కూడా పాండ్యా, జడేజా, అక్షర్ రూపంలో బ్యాటింగ్ బలగం ఉంది కాబట్టి సమస్య లేదు. బుమ్రా అద్భుత బౌలింగ్‌ను అఫ్గాన్ ఏమాత్రం ఎదుర్కోగలదనేది చూడాలి.
స్పిన్నర్లు రాణిస్తే...
గత మ్యాచ్‌లో వెస్టిండీస్ చేతిలో చిత్తుగా ఓడినా...అఫ్గానిస్తాన్ టీమ్‌లో ఆత్మస్థైర్యానికి లోటు లేదు. జట్టు ప్రధానంగా బౌలింగ్‌పైనే ఆధారపడుతోంది. టోరీ్నలో అత్యధిక వికెట్లు తీసిన ఫజల్ హక్ తన పదునైన పేస్, స్వింగ్‌తో ప్రత్యర్థులను ఇబ్బంది పెడుతున్నాడు. మధ్య ఓవర్లలో కెపె్టన్ రషీద్ ఖాన్ బౌలింగ్‌పైనే జట్టు విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి.
గతంలో 2 సార్లే భారత్‌తో ఆడిన రషీద్ ఒక్క వికెట్ తీయకపోయినా...అతడిని తక్కువగా అంచనా వేయడానికి లేదు. చైనామన్ స్పిన్నర్ నూర్ అతడికి అండగా నిలుస్తాడు. ఐపీఎల్ అనుభవంతో చెలరేగుతున్న గుర్బాజ్, మరో ఓపెనర్ ఇబ్రహీమ్ జట్టుకు మంచి ఆరంభాలు అందించారు. ఈ ఏడాది జనవరిలో భారత్‌తో జరిగిన మ్యాచ్‌ను 212 పరుగుల స్కోరుతో అఫ్గాన్ ‘టై’ చేసిన విషయం మరచిపోవద్దు.
పిచ్, వాతావరణం
న్యూయార్క్‌లో పరుగులే రావడం గగనమైన పిచ్‌తో పోలిస్తే ఇది బ్యాటింగ్‌కు బాగా అనుకూలం. టోర్నీలో ఒక సారి 200కు పైగా స్కోరూ నమోదైంది. వర్షసూచన లేదు.
Comments
Please login to add a commentAdd a comment