ఇండోర్: వన్డే ప్రపంచకప్‌కు ముందు జరుగుతున్న చివరి సిరీస్‌ను సొంతం చేసుకొని మెగా ఈవెంట్‌లో పూర్తి విశ్వాసంతో బరిలోకి దిగాలనే లక్ష్యంతో భారత్... తొలి మ్యాచ్‌లో జరిగిన లోపాలను సరిదిద్దుకోవాలనే పట్టుదలతో ఆ్రస్టేలియా... నేడు ఇక్కడి హోల్కర్ స్టేడియంలో జరిగే రెండో వన్డేలో తలపడనున్నాయి. రెండు జట్లలోని బ్యాటర్లు మెరిస్తే భారీ స్కోర్లకు పెట్టింది పేరైన హోల్కర్ స్టేడియంలో అభిమానులకు మరో పరుగుల విందు లభించడం ఖాయం. శనివారం ఇండోర్‌లో వర్షం కురిసినా ఆదివారం మ్యాచ్ సమయంలో ఒకట్రెండుసార్లు చిరుజల్లులు పడే అవకాశముందని స్థానిక వాతావరణ శాఖ తెలిపింది.
తొలి వన్డేలో రుతురాజ్ గైక్వాడ్, శుబ్‌మన్ గిల్, తాత్కాలిక కెప్టెన్ కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్ అర్ధ సెంచరీలు సాధించడం శుభపరిణామం. అయితే శ్రేయస్ అయ్యర్ తక్కువ స్కోరుకే వెనుదిరిగాడు. రెండో వన్డేలో అయ్యర్ భారీ స్కోరు సాధిస్తే అతను ప్రపంచకప్ మ్యాచ్‌ల్లో ఆడే అవకాశాలు మెరుగవుతాయి. మరోవైపు భారత సీనియర్ పేస్ బౌలర్ మొహమ్మద్ షమీ బంతితో చెలరేగాడు. తొలి వన్డే నుంచి విశ్రాంతి తీసుకున్న సిరాజ్‌ను ఆడిస్తే బుమ్రా ఈ మ్యాచ్‌లో ఆడకపోవచ్చు.
ఆఫ్ స్పిన్నర్ అశ్విన్ ఆకట్టుకున్నా ఈ ఒక్క ప్రదర్శన అతనికి సరిపోదు. రెండో మ్యాచ్‌లోనూ ఈ తమిళనాడు స్పిన్నర్ రాణించాల్సి అవసరం ఉంది. ఎడంచేతి వాటం స్పిన్నర్ అక్షర్ పటేల్ చేతి వేలి గాయం నుంచి కోలుకోకపోతే అతని స్థానంలో అశ్విన్ ప్రపంచకప్ జట్టులోకి చివరి నిమిషంలో వచ్చే అవకాశముంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1–0తో ఆధిక్యంలో ఉన్న భారత్ రెండో మ్యాచ్‌లోనూ గెలిస్తే సిరీస్‌ను 2–0తో సొంతం చేసుకుంటుంది. ఈ ఏడాది ఆరంభంలో ఆసీస్ చేతిలో ఎదురైన సిరీస్ ఓటమికి బదులు తీర్చుకుంటుంది.
మరోవైపు ఆస్ట్రేలియా జట్టు సిరీస్‌లో నిలవాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన పరిస్థితిలో నిలిచింది. తొలి మ్యాచ్‌లో డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్, కామెరూన్ గ్రీన్, లబుషేన్ రాణించినా క్రీజులో నిలదొక్కుకున్న తరుణంలో అవుటవ్వడం ఆసీస్‌ను దెబ్బ కొట్టింది. ఓపెనర్‌గా వచ్చిన ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ బ్యాట్ నుంచి కూడా పరుగులు వస్తే ఆసీస్ స్కోరు 300 పరుగులు దాటే అవకాశముంటుంది.
ఈ మైదానంలో ఈ ఏడాది జనవరి 24న భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య చివరిసారి వన్డే జరిగింది. రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్ సెంచరీలతో కదంతొక్కడంతో భారత్ 9 వికెట్లకు 385 పరుగులు చేసింది. న్యూజిలాండ్ 295 పరుగులకు ఆలౌటైంది. బౌండరీల దూరం తక్కువగా ఉండటంతో ఈసారీ భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశముంది.
జట్ల వివరాలు (అంచనా)
భారత్: రుతురాజ్ గైక్వాడ్/ఇషాన్ కిషన్, శుబ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్, కేఎల్ రాహుల్ (కెప్టెన్), జడేజా, వాషింగ్టన్ సుందర్, అశ్విన్, శార్దుల్ ఠాకూర్, షమీ, సిరాజ్/బుమ్రా.
ఆ్రస్టేలియా: వార్నర్, మిచెల్ మార్ష్, స్మిత్, లబుషేన్, కామెరూన్ గ్రీన్, అలెక్స్ క్యారీ, జోస్ ఇన్‌గ్లిస్/ఆరోన్ హార్డీ, కమిన్స్ (కెప్టెన్), సీన్ అబాట్, ఆడమ్ జంపా, హాజల్‌వుడ్.
Comments
Please login to add a commentAdd a comment