వెస్టిండీస్‌తో తొలి వన్డేలో విజయం భారత్‌కు ఏదైనా మేలు చేసిందా? ఏదైనా కొత్త ప్రయోగానికి పనికొచ్చిందా? అంటే ‘లేదు’ అనే సమాధానమే వినిపిస్తుంది. వరల్డ్‌కప్ నకు ముందు మిగిలిన మ్యాచ్‌ల్లో అన్ని రకాలుగా కూర్పును పరీక్షించుకోవాల్సిన మన జట్టు గత పోరులో అనవసరపు ప్రయత్నం చేసింది.
ఎంత చిన్న లక్ష్యమైనా... ఆటగాళ్ల స్థానాలు మార్చడం వల్ల గందరగోళమే తప్ప ఉపయోగం లేదని ఆ మ్యాచ్ చూపించింది. ఈ నేపథ్యంలో వెస్టిండీస్‌తో రెండో వన్డేకు టీమిండియా సిద్ధమైంది. సిరీస్ గెలిచే అవకాశంపై సందేహాలు లేకపోయినా టీమ్ మేనేజ్‌మెంట్ ఈ మ్యాచ్‌లో ఎలాంటి వ్యూహం అనుసరిస్తుందనేది ఆసక్తికరం.
బ్రిడ్జ్‌టౌన్ (బార్బడోస్): వరల్డ్‌కప్‌లో ఇషాన్ కిషన్ ఓపెనింగ్ చేసే అవకాశమే లేదు. సూర్యకుమార్ మూడో స్థానంలో ఎలాగూ ఆడడు. అసలు కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ కోలుకుంటే వన్డేల్లో అతనికి చోటు కూడా సందేహమే. ఫినిషర్‌గా హార్దిక్ సరైన వ్యక్తి కాగా, నాలుగో స్థానంలో ఆడే చాన్స్ లేదు.
వన్డేల్లో హార్దిక్ తొలి ఓవర్ బౌలింగ్ చేయడం అసాధ్యం. కానీ వెస్టిండీస్‌తో తొలి వన్డేలో భారత్ ఈ ప్రయోగాలన్నీ చేసింది. కానీ దానివల్ల ఆశించిన ప్రయోజనం మాత్రం నెరవేరలేదు. నిజంగా జట్టులో అందరికీ బ్యాటింగ్ అవకాశం ఇవ్వాలని భావిస్తే టీమిండియా టాస్ గెలిచాక బ్యాటింగ్ తీసుకోవాల్సింది.
ఇప్పుడు భారత్ ముందు అలాంటి అవకాశం ఉంది. తొలి మ్యాచ్ జరిగిన కెన్సింగ్టన్ ఓవల్ వేదికపైనే భారత్, విండీస్ మధ్య నేడు రెండో వన్డేకు రంగం సిద్ధమైంది. ఈ మ్యాచ్ గెలిచి రోహిత్ సేన సిరీస్‌ను తమ ఖాతాలో వేసుకుంటుందా లేక విండీస్ కోలుకొని జవాబిస్తుందా చూడాలి.
సామ్సన్‌ను అవకాశముందా!
సాధారణంగా గెలిచిన జట్టులో మార్పులు ఉండవు. అయితే తొలి వన్డే సమయంలోనే కీపర్‌గా సంజు సామ్సన్‌ను కాకుండా ఇషాన్ కిషన్‌ను ఎంపిక చేయడంపై తీవ్ర చర్చ జరిగింది. రెండేళ్ల వ్యవధిలో అప్పుడప్పుడు మాత్రమే అవకాశాలు దక్కించుకుంటూ సామ్సన్ 11 వన్డేలు మాత్రమే ఆడాడు.
అయితే వరల్డ్‌కప్ టీమ్‌లో ఉంచాలనే ఆలోచన ఉంటే మాత్రం అతనికి తగినన్ని మ్యాచ్‌లు ఇవ్వడం కీలకం. ఇషాన్ అర్ధసెంచరీ సాధించి తన వైపు నుంచి ఎలాంటి సమస్య లేకుండా రుజువు చేసుకున్నాడు. మరోవైపు సామ్సన్‌ను మేనేజ్‌మెంట్ ప్రధానంగా మిడిలార్డర్‌లో చూస్తోంది. కాబట్టి ఇషాన్ రాణించినా సామ్సన్‌కూ ఒక అవకాశం ఇవ్వవచ్చు.
ఆదుకునేదెవరు?
భారత్‌పై మంచి రికార్డు ఉన్న హెట్‌మైర్‌పై విండీస్ తొలి మ్యాచ్‌లో ఆశలు పెట్టుకుంది. స్పిన్‌ను సమర్థంగా ఆడగల అతను ఏమాత్రం ప్రభావం చూపకుండా వెనుదిరిగాడు. దాంతో అసలు ప్రత్య ర్థిపై దూకుడు ప్రదర్శించగల బ్యాటర్లే ఆ జట్టులో కరువయ్యారు. హోప్ ఫర్వాలేదనిపించినా అది జట్టుకు పెద్దగా ఉపయోగపడలేదు. ఈ నేపథ్యంలో విండీస్ పోటీలో నిలవాలంటే బ్యాటింగ్‌లో కనీస ప్రదర్శన అయినా ఇవ్వాల్సి ఉంటుంది.
పిచ్, వాతావరణం
తొలి వన్డేలో పిచ్ ఏమాత్రం బ్యాటింగ్‌కు అనుకూలించలేదు. అదే పిచ్‌పైనే ఈ మ్యాచ్ ఆడితే ఇరు జట్లు అదనపు స్పిన్నర్‌ను తీసుకోవచ్చు. మరో పిచ్ మాత్రం బ్యాటింగ్‌కు అనుకూలంగా మంచి స్కోర్లకు అవకాశం కల్పిస్తుంది. మ్యాచ్‌కు వర్షం గండం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment