నేడు దక్షిణాఫ్రికాతో మూడో టి20
బ్యాటర్లపై భారం
వరుణ్ స్పిన్‌పై సఫారీ కసరత్తు
రా. గం. 8:30 నుంచి స్పోర్ట్స్18, జియో సినిమాలో ప్రత్యక్షప్రసారం
సెంచూరియన్: సిరీస్‌లో పైచేయి సాధించడమే లక్ష్యంగా భారత జట్టు మూడో టి20 బరిలోకి దిగుతోంది. సూర్యకుమార్ సేన గత మ్యాచ్‌లో ఓడినా కూడా తక్కువ లక్ష్యాన్ని ఛేదించేందుకు దిగిన ఆతిథ్య దక్షిణాఫ్రికా జట్టును వణికించింది. తొలి మ్యాచ్‌లో బ్యాటర్లు, రెండో మ్యాచ్‌లో బౌలర్లు సత్తా చాటుకున్నారు. ఇప్పుడు ఈ రెండు విభాగాలు పట్టు బిగిస్తే మూడో మ్యాచ్ గెలవడం ఏమంత కష్టమే కాదు.
మరోవైపు సొంతగడ్డపై రెండు మ్యాచ్‌ల్లోనూ సఫారీల ప్రభావం అంతంతే! గత మ్యాచ్ గెలిచినా... అది గట్టెక్కడమే కానీ సాధికారిక విజయం కానేకాదు. ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికా మూడో టి20 కోసం పెద్ద కసరత్తే చేసింది. మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిని ఎదుర్కొనేందుకు ప్రత్యర్థి బ్యాటర్లు నెట్స్‌లో చెమటోడ్చారు. ఇది నాలుగు మ్యాచ్‌ల సిరీస్ కావడంతో బుధవారం జరిగే పోరులో ఎవరు గెలిచినా ఆ జట్టు సిరీస్‌ను చేజార్చుకోదు.
నిలకడే అసలు సమస్య
ఓపెనర్లలో సంజూ సామ్సన్ తొలి మ్యాచ్‌లో చెలరేగాడు. గత మ్యాచ్‌లో అతను విఫలమైనా ఫామ్‌పై ఏ బెంగా లేదు. కానీ అభిషేక్ శర్మ వరుస వైఫల్యాలు జట్టు శుభారంభానికి ప్రతికూలంగా మారుతోంది. డర్బన్‌లో (7), పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లో (4) సింగిల్ డిజిట్‌లకే పరిమితమయ్యాడు. ఇప్పుడు సెంచూరియన్‌లో అయినా అభిషేక్ బ్యాట్ ఝళిపిస్తే బ్యాటింగ్ బలగం పెరుగుతుంది.
రెండో మ్యాచ్‌లో టాపార్డర్ వైఫల్యం, నిలకడలేని మిడిలార్డర్‌తో భారత్ పరుగులు చేసేందుకు ఆపసోపాలు పడింది. ముఖ్యంగా డెత్ ఓవర్లలో 20, 30 పరుగులు వచ్చే చోట 11 పరుగులే చేయడం బ్యాటింగ్ లోపాల్ని ఎత్తిచూపుతోంది. సూర్యకుమార్ నుంచి కూడా అలరించే ఇన్నింగ్స్ ఇంకా రాలేదు. ఈ మ్యాచ్‌లో అతని 360 డిగ్రీ బ్యాటింగ్ చూపిస్తే ఇన్నింగ్స్ దూసుకెళుతుంది.
ఈ సిరీస్‌లో స్పిన్నర్లు వరుణ్, రవి బిష్ణోయ్‌లు సత్తా చాటుకుంటున్నారు. ఈ బౌలింగ్ ద్వయంకు ఊతమిచ్చేలా బ్యాటింగ్ దళం కూడా బాధ్యత పంచుకుంటే భారత్ ఈ మ్యాచ్‌లో గెలుస్తుంది. లేదంటే గత మ్యాచ్‌లో ఎదురైన ఫలితం వచి్చనా ఆశ్చర్యపోనక్కర్లేదు. టాపార్డర్‌లో లోపించిన నిలకడ గత మ్యాచ్‌కు సమస్యగా మారింది. వీటిని వెంటనే అధిగమిస్తేనే అనుకున్న ఫలితాలు సాధించవచ్చు.
పైచేయి కోసం ప్రయత్నం
మరోవైపు ఆతిథ్య దక్షిణాఫ్రికా కూడా సిరీస్‌లో పైచేయి సాధించాలని పట్టుదలగా ఉంది. నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో రెండు మ్యాచ్‌లు పూర్తయినా... సఫారీ ఆటతీరు అంతంతమాత్రంగానే ఉంది. డర్బన్‌లో రెండొందల పైచిలుకు లక్ష్యానికి చేతులెత్తేసిన బ్యాటర్లు... రెండో టి20లో 125 పరుగులు చేసేందుకు కూడా తెగ కష్టపడ్డారు.
చివరకు ఏదోలా గెలిచినా ఇదే తీరు కొనసాగితే మాత్రం సిరీస్ కోల్పోక తప్పదు. రికెల్టన్, హెండ్రిక్స్, మార్క్‌రమ్‌లతో కూడిన టాపార్డర్, క్లాసెన్, మిల్లర్‌లాంటి హిట్టర్లతో కూడిన మిడిలార్డర్ భారత స్పిన్నర్లకు ఏమాత్రం నిలబడలేకపోతోంది. గత రెండు మ్యాచ్‌ల్లో కలిపి వరుణ్ (3/25, 5/17) 8 వికెట్లు తీశాడు. దీంతో సఫారీ జట్టు మేనేజ్‌మెంట్ అతన్ని ఎదుర్కోనేందుకు పెద్ద కసరత్తే చేసింది.
సెంచూరియన్‌లో అది ఏ మేరకు ప్రభావం చూపుతుందో చూడాలి. బౌలర్లలో కొయెట్జీ, మార్కొ జాన్సెన్ భారత బ్యాటర్లను ఇబ్బంది పెడుతున్నారు. పేస్‌కు అనుకూలించే సెంచూరియన్‌లో పోరు ఆసక్తికరంగా జరగడం ఖాయం.
Comments
Please login to add a commentAdd a comment