Today Is The Second T20 Between India And Ireland - Sakshi
Sakshi News home page

సిరీస్‌పై భారత్‌ కన్ను 

Published Sun, Aug 20 2023 5:39 AM | Last Updated on Mon, Aug 21 2023 8:08 PM

Today is the second T20 between india and Ireland - Sakshi

డబ్లిన్‌: ఐర్లాండ్‌ పర్యటనలో శుభారంభం చేసిన భారత జట్టు మరో విజయంతో సిరీస్‌ను కైవసం చేసుకోవాలనే పట్టుదలతో ఉంది. నేడు జరిగే రెండో టి20లో ఐర్లాండ్‌పై గెలుపే లక్ష్యంగా బుమ్రా సేన బరిలోకి దిగుతోంది. వాన అడ్డుకున్న గత మ్యాచ్‌లో మన బౌలర్లు తమను తాము నిరూపించుకున్నారు. ముఖ్యంగా చాన్నాళ్ల తర్వాత మైదానంలోకి దిగిన సీనియర్‌ సీమర్‌ బుమ్రా మునుపటి వాడితో అదరగొట్టాడు. ప్రసిధ్‌ కృష్ణ, స్పిన్నర్‌ రవి బిష్ణోయ్‌ కూడా సత్తా చాటారు.

ఇప్పుడు బ్యాటర్ల వంతు వచ్చింది. ఈ మ్యాచ్‌లో కుర్రాళ్లకు చక్కని బ్యాటింగ్‌ అవకాశమివ్వాలనుకుంటే మాత్రం భారత్‌ టాస్‌ గెలిస్తే బ్యాటింగ్‌ ఎంచుకోవచ్చు. ఓపెనింగ్‌లో యశస్వి జైస్వాల్‌ ఉన్నంత సేపు బాగానే ఆడాడు. రుతురాజ్‌ మెరుగనిపించాడు. కానీ కరీబియన్‌ పర్యటనలో అందరికంటే బాగా ఆడిన తెలుగుతేజం తిలక్‌వర్మ డకౌట్‌ కావడం కాస్త నిరాశపరిచింది.

ఈ మ్యాచ్‌లో హైదరాబాదీ బ్యాటర్‌ చెలరేగితే స్కోరు బోర్డు ఉరకలెత్తడం ఖాయం. అనుభవజు్ఞల్లేకపోయినా... భారత జట్టులోని ఆటగాళ్లందరికి ఐపీఎల్‌లో మెరిపించిన అనుభవం ఎంతో ఉంది. కాబట్టి వరుస విజయం, సిరీస్‌ కైవసం ఏమంత కష్టం కాకపోవచ్చు. 

గెలిపించేదెవరు..?
మరోవైపు ఒత్తిడిలో ఉన్న ఆతిథ్య జట్టు సిరీస్‌లో నిలవాలంటే ఈ మ్యాచ్‌లో గెలవక తప్పదు. టాపార్డర్‌లో బల్బిర్నీ  , కెప్టెన్ స్టిర్లింగ్, టకర్‌ బాధ్యత కనబరిస్తేనే ప్రత్యర్థికి దీటైన స్కోరు చేయొచ్చు. లేదంటే తొలి టి20లాగే ఓ మోస్తరు స్కోరుకే పరిమితమయ్యే ప్రమాదముంది. బౌలింగ్‌లో యంగ్‌ వైవిధ్యమైన బంతులతో భారత్‌ను కంగారు పెట్టించాడు. జోష్‌ లిటిల్, మార్క్‌ అడైర్‌లు కూడా నిలకడగా బౌలింగ్‌ చేస్తే భారత కుర్రాళ్ల జట్టును ఇబ్బంది పెట్టవచ్చు. ఆదివారం వాన ముప్పు లేదు. పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలం. 

జట్లు (అంచనా) 
భారత్‌.. 
బుమ్రా (కెప్టెన్ ), యశస్వి, రుతురాజ్, తిలక్‌ వర్మ, సామ్సన్,  రింకూసింగ్, దూబే,  సుందర్, అర్ష్‌దీప్, బిష్ణోయ్, ప్రసిధ్‌ కృష్ణ. 
ఐర్లాండ్‌.. 
స్టిర్లింగ్‌ (కెప్టెన్ ), బల్బిర్నీ, టక్కర్, టెక్టర్, క్యాంపర్, డాక్‌రెల్, మార్క్‌ అడైర్, మెకార్తీ, యంగ్, జోష్‌ లిటిల్, బెన్‌వైట్‌. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement