న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్‌లో పతకావకాశం ఉన్న రెజ్లర్‌గా బరిలోకి దిగి విఫలం కావడంతో పాటు క్రమశిక్షణ తప్పిందని ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత మహిళా స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ మౌనం వీడింది. తనపై వస్తున్న ఆరోపణలకు స్పందించడంతోపాటు ఒలింపిక్స్ ముందు, పోటీలు జరిగే సమయంలో తాను మానసికంగా ఎంత వేదన అనుభవించిందో వెల్లడించింది. ఒలింపిక్స్ ముగిసిన తర్వాత వినేశ్‌పై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటూ భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) తాత్కాలిక నిషేధం విధించింది. ‘మన దేశంలో ఎంత వేగంగా పైకి ఎదుగుతామో అంతే వేగంగా కింద పడిపోతాం. ఒక్క పతకం రాలేదంటే ఇక అంతా అయిపోయినట్లే. ఇప్పుడూ అదే జరుగుతోంది. అంతా నాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు.
ఓటమికి కారణాలేమిటో నాకు బాగా తెలుసు. ఒలింపిక్స్ కోసం అన్ని రకాలుగా సిద్ధమై వచ్చాను. కానీ నన్ను దురదృష్టం వెంటాడింది’ అని వినేశ్ పేర్కొంది. రెజ్లింగ్‌పై అవగాహనలేని, షూటింగ్‌తో సంబంధం ఉన్న ఫిజియోను తనకు కేటాయించారని, బౌట్‌కు ముందు తన బరువు తగ్గించుకునే విషయంలో తానే ఆమెకు వివరించాల్సి వచ్చిందని వినేశ్ ఆరోపించింది. రెండుసార్లు కరోనా సోకడంతో తన శరీరంలో అసలు ప్రొటీన్ లేకుండా పోయిందని ఆమె చెప్పింది. తన వల్ల భారత రెజ్లర్లు కోవిడ్ బారిన పడకూడదనే విడిగా ఉన్నానని, ఇందులో తప్పేముందని ప్రశ్నించిన వినేశ్... గత రెండేళ్లుగా చాలాసార్లు డిప్రెషన్‌కు గురయ్యానని వెల్లడించింది.
‘నేను మానసికంగా సన్నద్ధంగా లేను కాబట్టి పోటీ పడలేను అని అమెరికా జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్ చెబితే నిజమే కదా అంటూ మనోళ్లూ సానుభూతి పలుకుతారు. బరిలోకి దిగకపోవడం సంగతి తర్వాత, నేను మానసికంగా సన్నద్ధంగా లేనని ఒక్కసారి చెప్పి చూడండి. ఏం జరుగుతుందో’ అని వినేశ్ గుర్తు చేసింది. తన ఓటమి గురించి కనీసం తాను కూడా బాధపడే అవకాశం ఇవ్వకుండా అంతా కత్తులతో సిద్ధమయ్యారని వినేశ్ ఆవేదన వ్యక్తం చేసింది. ‘స్వర్ణం గెలిచే అవకాశం ఉన్నవారిలో నన్నూ చేర్చండి అని నేను అడిగానా? ఓడితే అందరికంటే ఎక్కువగా బాధ పడేది నేనే కదా. నేను మళ్లీ రెజ్లింగ్‌లోకి ఎప్పుడు అడుగు పెడతానో, అసలు ఆడతానో కూడా తెలీదు. 2016 ‘రియో’లో కాలు విరిగినప్పుడే బాగుంది. కనీసం దేనికి చికిత్స చేయాలో తెలిసింది. కానీ ఇప్పుడు నా మనసు విరిగి పోయింది’ అని ఆమె బాధను ప్రదర్శించింది.
నోటీసుకు స్పందించాల్సిందే!
వినేశ్‌పై చర్య తీసుకునే విషయంలో ఆమెకు పంపిన నోటీసు విషయంలో స్పందన కోసం ఎదురు చూస్తున్నామని డబ్ల్యూఎఫ్‌ఐ వెల్లడించింది. ‘వినేశ్ నుంచి మాకు ఇంకా సమాధానం రాలేదు. ఆమె తన సమస్య గురించి ఏం రాసుకుందనేది మాకు అనవసరం. నోటీసు ఇచ్చిన మరో రెజ్లర్ సోనమ్ స్పందించింది. క్షమాపణ కోరిన ఆమె ఇకపై తప్పు చేయనని హామీ ఇచ్చింది’ అని డబ్ల్యూఎఫ్‌ఐ అధికారి ఒకరు వెల్లడించారు.
చదవండి: మేయర్ అత్యుత్సాహం.. పంటి గాట్లతో గోల్డ్ మెడల్ రీప్లేస్
Comments
Please login to add a commentAdd a comment