
భారత పురుషుల హాకీ టీం ఆశలు తప్పాయి. టోక్యో ఒలింపిక్స్ మొదటి సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ప్రపంచ ఛాంపియన్ బెల్జియం చేతిలో ఓడింది. 5-2 ఓటమితో ఫైనల్ ఆశల్ని దూరం చేసుకుంది భారత్. మన్‌ప్రీత్ సింగ్ నాయకత్వంలోని హాకీ జట్టు మొదట్లో రెండు గోల్స్‌తో మెరిపించినా.. ఆపై బెల్జియం డిఫెండింగ్ ముందు తలవంచక తప్పలేదు. ఈ ఓటమితో కాంస్యం కోసం రెండో సెమీస్‌లో ఓడిన జట్టుతో ఎల్లుండి భారత పురుషుల హాకీ జట్టు తలపడాల్సి ఉంటుంది.
ఓయి హాకీ స్టేడియం నార్త్ పిచ్‌లో మంగళవారం ఉదయం తొలి సెమీస్ మ్యాచ్ జరిగింది. మొదటి నుంచి దూకుడు ప్రదర్శించిన భారత హాకీ టీం. తొలి క్వార్టర్ ఏడో నిమిషంలోనే గోల్ కొట్టింది. ఆపై ఫస్టాఫ్ ముగిసేసరికి 2-1తో లీడ్‌లో ఆశలు చిగురింపజేసింది. అయితే ఆ తర్వాత బెల్జియం దూకుడు ప్రదర్శించింది. మరో గోల్‌తో 2-2తో స్కోర్ సమం చేయడంతో పాటు డిఫెండింగ్ గేమ్ ఆడింది ప్రత్యర్థి టీం.
ఇక మూడో క్వార్టర్ నుంచి ఆట ఉత్కంఠభరితంగా కొనసాగింది. పెనాల్టీలను సద్వినియోగం చేసుకోవడంలో భారత్ విఫలమైంది. ఒకానొక దశలో బెల్జియం అదిరిపోయే డిఫెన్స్ ప్రదర్శించింది. నాలుగో క్వార్టర్‌లో మరో గోల్‌తో స్కోర్ 3-2 అయ్యింది. ఆపై కాసేపటికే పెనాల్టీ కార్నర్‌తో మరో గోల్ సాధించి 4-2తో ఆధిక్యం కనబరిచింది. ఇక మిగిలిన టైంలో డిఫెండింగ్ ప్రదర్శించిన బెల్జియం.. అదను చూసి మరో గోల్ చేయడంతో స్కోర్ 5-2గా మారింది. దీంతో టాప్ ర్యాంకర్ బెల్జియం భారత్ ఓటమిని శాసించింది.
బెల్జియం తరపున అలెగ్జాండర్ హెన్‌డ్రిక్స్ రెండు, బలూయిపరట్, డోహ్‌మెన్ చెరో గోల్ సాధించారు. భారత్ తరపున మన్‌దీప్, హర్మన్‌ప్రీత్ సింగ్‌లు చెరో గోల్ కొట్టారు. ఇక టోక్యో ఒలింపిక్స్ సెమీస్‌లో ఓడిన భారత హాకీ జట్టు.. కాంస్య పతకం కోసం మరో మ్యాచ్ ఆడి అందులో గెలవాల్సి ఉంటుంది. రెండో సెమీఫైనల్లో జర్మనీ-ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment