టోక్యో: సుహాస్ యతిరాజ్ ఓ ఐఏఎస్ ఆఫీసర్. కలెక్టర్ అవడం కంటే గొప్ప కల ఏముంటుంది. కానీ ఇతను కల సాకారంతోనే ఆగిపోలేదు. కలని మించి ఆలోచించాడు. చక్కగా ఆచరణలో పెట్టాడు. అందుకే ఇపుడు టోక్యో పారాలింపిక్స్‌లో రజత పతక విజేత అయ్యాడు. కర్ణాటకలోని హసన్ ప్రాంతానికి చెందిన కంప్యూటర్ ఇంజినీర్ సుహాస్ 2007 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. ఉత్తరప్రదేశ్‌లోని గౌతమ్ బుద్ధనగర్ (నోయిడా) జిల్లా మెజిస్ట్రేట్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. అతనికి కాలి పాదాల వైకల్యమున్నా... బ్యాడ్మింటన్ అంటే ఎనలేని ఆసక్తి. అందుకేనేమో అందులో ప్రొఫెషనల్ పారా బ్యాడ్మింటన్ ప్లేయర్‌గా ఎదిగాడు.
ప్రపంచ ర్యాంకింగ్స్‌లో అతను మూడో స్థానంలో ఉన్నాడు. అంతర్జాతీయ పారా క్రీడల్లో మనసుపెట్టి పోటీపడే ఈ ప్రొఫెషనల్ ఖాతాలో చాలా పతకాలే ఉన్నాయి. 2016లో బీజింగ్‌లో జరిగిన చాంపియన్‌షిప్‌లో విజేతగా నిలువడం ద్వారా ఈ ఘనత సాధించిన తొలి భారత బ్యూరోక్రాట్‌గానూ రికార్డుల్లోకెక్కాడు. దీంతో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ‘యశ్ భారతి’ పురస్కారంతో సుహాస్‌ను సత్కరించింది. జకార్తాలో జరిగిన ఆసియా పారా గేమ్స్‌లో టీమ్ విభాగంలో కాంస్య పతకం గెలిచాడు. ఇలా అంతర్జాతీయ కెరీర్‌లో ఈ పారా షట్లర్ 5 స్వర్ణాలు, 4 రజతాలు, 7 కాంస్యాలు గెలిచాడు.
చాలా ఉద్విగ్నంగా ఉంది. ఇంత సంతోషంగా ఎప్పుడూ లేను. ఇదే సమయంలో ఇంత బాధ కూడా ఎప్పుడూ పడలేదు. పారాలింపిక్స్‌లో రజతం ఆనందమైతే... స్వర్ణం చేజార్చుకోవడం, జాతీయ గీతాన్ని ఆలపించే అవకాశాన్ని కోల్పోవడం చాలా నిరాశ పరిచింది. ఓవరాల్‌గా పారాలింపిక్ పతకం సాధించినందుకు గర్వపడుతున్నాను.
–సుహాస్
Comments
Please login to add a commentAdd a comment