పురుషుల అథ్లెటిక్స్ హైజంప్‌లో 21 ఏళ్ల నిశాద్ కుమార్ భారత్‌కు రజత పతకాన్ని అందించాడు. టి–47 విభాగంలో నిశాద్ 2.06 మీటర్ల ఎత్తుకు ఎగిరి రెండో స్థానంలో నిలిచాడు. అంతేకాకుండా ఆసియా రికార్డు కూడా నెలకొల్పాడు. డాలస్ వైజ్ (అమెరికా) కూడా 2.06 మీటర్ల ఎత్తుకు ఎగరడంతో అతనికి కూడా రజతం లభించింది. రోడెరిక్ టౌన్‌సెండ్ (అమెరికా) 2.15 మీటర్లతో కొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పడంతోపాటు స్వర్ణ పతకాన్ని దక్కించుకున్నాడు.
చేయి లేకపోతేనేం...
మన దైనందిన పనులు చక్కబెట్టేదే కుడి చేయి. అలాంటి చేతినే కోల్పోతే ఎంతో ఇబ్బందిగా ఉంటుంది. ఎంత కష్టమైనా, ఓ చేయి లేకపోయినా పతకం గెలవడం నిజంగా విశేషమే కదా! హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన 21 ఏళ్ల నిశాద్ కుమార్ అదేపని చేశాడు. నిశాద్‌ది రైతు కుటుంబం. తల్లిదండ్రులు వ్యవసాయదారులు. ఉనా జిల్లాలోని అంబ్ గ్రామంలో సాగుబడే వారి జీవనాధారం. 8 ఏళ్ల వయసులో వ్యవసాయ క్షేత్రానికి వెళ్లిన నిశాద్ గడ్డికోసే యంత్రంలో గడ్డిని కత్తిరిస్తుండగా కుడి చేయి తెగిపడింది. అప్పుడు విలవిల్లాడిన ఆ బాలుడు రెండేళ్లకే క్రీడాశిక్షణపై దృష్టిపెట్టాడు. స్కూల్ గ్రౌండ్‌లో హైజంప్‌లో ప్రాక్టీస్ చేసేవాడు. జాతీయ స్కూల్ గేమ్స్‌లో ఏకంగా సాధారణ అథ్లెట్లతో పోటీపడి పదో స్థానంలో నిలిచాడు.
పాఠశాల విద్య అనంతరం ఏమాత్రం ఆలస్యం చేయకుండా పంచ్‌కులాలోని దేవిలాల్ స్టేడియంలో హైజంప్‌లో శిక్షణ తీసుకున్నాడు. అక్కడే నిశాద్ పారాథ్లెట్‌గా ఎదిగాడు. 2019లో తొలి సారి దుబాయ్‌లో పోటీపడ్డాడు. అక్కడ జరిగిన ఫజార్ పారాథ్లెటిక్స్ గ్రాండ్‌ప్రిలో అతను టి47 కేటగిరీ హైజంప్‌లో 1.92 మీటర్లు జంప్ చేసి విజేతగా నిలిచాడు. అనంతరం అక్కడే జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో 1.94 మీటర్ల జంప్‌తో కాంస్యం సాధించాడు. దీంతోనే టోక్యో పారాలింపిక్స్ కోటా దక్కింది. గత ఏడాది కాలంగా రెండుసార్లు కోవిడ్ బారిన పడినా కూడా ప్రాక్టీస్‌ను అలక్ష్యం చేయలేదు. నాలుగు అంతర్జాతీయ క్రీడల్లో పాల్గొన్న అనుభవంతో తాజాగా దివ్యాంగుల విశ్వక్రీడల్లో రజత పతకం గెలిచాడు.
Comments
Please login to add a commentAdd a comment