బరిలో గిల్, పంత్, రాహుల్, జడేజా, సిరాజ్
రోహిత్, కోహ్లి, బుమ్రా దూరం
న్యూఢిల్లీ: బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌కు ముందు భారత దేశవాళీ క్రికెట్ సీజన్ దులీప్ ట్రోఫీతో మొదలుకానుంది. వచ్చేనెల 5 నుంచి బెంగళూరు, అనంతపురంలో ఈ టోర్నీ జరగనుంది. దీనికోసం జాతీయ సెలెక్షన్ కమిటీ బుధవారం నాలుగు జట్లను ప్రకటించింది. శుబ్‌మన్ గిల్, అభిమన్యు ఈశ్వరన్, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయస్ అయ్యర్ వరుసగా ‘ఎ’ ‘బి’ ‘సి’ ‘డి’ జట్లకు కెప్టెన్‌లుగా వ్యవహరిస్తారు.
పనిభారాన్ని దృష్టిలో పెట్టుకొని స్టార్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, బుమ్రా, అశి్వన్‌లకు ఈ టోర్నీ నుంచి విశ్రాంతి ఇచ్చారు. శస్త్రచికిత్స తర్వాత పూర్తిగా కోలుకోని సీనియర్ పేసర్ షమీని కూడా ఎంపిక చేయలేదు. ఇక కారు ప్రమాదం నుంచి కోలుకున్న రిషబ్ పంత్ చాలా రోజులకు ఎర్రబంతితో ఆడనున్నాడు.
గత సీజన్‌లో రంజీ ట్రోఫీ ఆడకుండా.. ఐపీఎల్‌పై దృష్టి పెట్టి సెంట్రల్ కాంట్రాక్టు కోల్పోయిన ఇషాన్ కిషన్ టీమ్ ‘డి’లో చోటు దక్కించుకున్నాడు. సెపె్టంబర్ 19 నుంచి భారత్, బంగ్లాదేశ్ మధ్య రెండు టెస్టుల సిరీస్ ప్రారంభమవుతుంది. టీమిండియా ఆటగాళ్లు దులీప్ ట్రోఫీ తొలి రౌండ్ మ్యాచ్‌లో మాత్రమే ఆడే అవకాశాలున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యువ ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డిని ‘బి’ జట్టుకు ఎంపిక చేశారు. హైదరాబాద్ ఆటగాళ్లు సిరాజ్ ‘బి’ జట్టులో చోటు పొందగా.. తిలక్ వర్మ ‘ఎ’ జట్టులో ఉన్నాడు. ఆంధ్ర ఆటగాళ్లు శ్రీకర్ భరత్, రికీ భుయ్ టీమ్ ‘డి’లో చోటు దక్కించుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment