ఎడిన్‌బర్గ్ వేదికగా స్కాట్లాండ్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో ఆస్ట్రేలియా బ్యాటర్లు ట్రవిస్ హెడ్, మిచెల్ మార్ష్ శివాలెత్తిపోయారు. పవర్ ప్లేలో (తొలి ఆరు ఓవర్లలో) రికార్డు స్థాయిలో వికెట్ నష్టానికి 113 పరుగులు చేశారు. అంతర్జాతీయ టీ20 చరిత్రలో (పవర్ ప్లేల్లో) ఇదే అత్యధిక స్కోర్.
పవర్ ప్లే ముగిసే సమయానికి ట్రవిస్ హెడ్ 22 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 73 పరుగులు చేయగా.. మిచెల్ మార్ష్ 11 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 39 పరుగులు చేశాడు. పవర్ ప్లే మొత్తంలో కేవలం రెండు సింగల్స్ మాత్రమే రాగా.. 17 ఫోర్లు, 7 సిక్సర్లు వచ్చాయి. ట్రవిస్ హెడ్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయి కేవలం 17 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. ఆసీస్ బౌలర్లు తలో చేయి వేసి స్కాట్లాండ్ బ్యాటర్లను కట్టడి చేశారు. సీన్ అబాట్ 3 వికెట్లతో రాణించగా.. జేవియర్ బార్ట్‌లెట్, ఆడమ్ జంపా తలో 2, రిలే మెరిడిత్, కెమరూన్ గ్రీన్ చెరో వికెట్ పడగొట్టారు. స్కాట్లాండ్ ఇన్నింగ్స్‌లో మున్సే 28, క్రాస్ 27, బెర్రింగ్టన్ 23 పరుగులు చేశారు. మిగతావారంతా తక్కువ స్కోర్లకే ఔటయ్యాడు.
అరంగేట్రంలోనే డకౌట్
ఈ మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్.. తొలి మ్యాచ్‌లోనే డకౌటయ్యాడు. మెక్‌గుర్క్ మూడు బంతులు ఆడి బ్రెండన్ మెక్‌ముల్లెన్ బౌలింగ్‌లో చార్లీ కాసెల్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాట పట్టాడు.
కేవలం 9.4 ఓవర్లలోనే ఛేదన
155 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆస్ట్రేలియా.. ట్రవిస్ హెడ్ (25 బంతుల్లో 80; 12 ఫోర్లు, 5 సిక్సర్లు), మిచెల్ మార్ష్ (12 బంతుల్లో 39; 5 ఫోర్లు, 3 సిక్సర్లు), జోస్ ఇంగ్లిస్ (13 బంతుల్లో 27 నాటౌట్; 3 ఫోర్లు, సిక్స్) ఆకాశమే హద్దుగా చెలరేగడంతో కేవలం 9.4 ఓవర్లలోనే (3 వికెట్ల నష్టానికి) విజయతీరాలకు చేరింది. ఈ గెలుపుతో ఆస్ట్రేలియా మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.
Comments
Please login to add a commentAdd a comment