ఆసీస్‌తో సెమీఫైనల్‌.. భారత్‌కు మరోసారి 'హెడ్' ఏక్ తప్పదా? | Travis Heads performance against India in international cricket listed | Sakshi
Sakshi News home page

Champions Trophy: ఆసీస్‌తో సెమీఫైనల్‌.. భారత్‌కు మరోసారి 'హెడ్' ఏక్ తప్పదా?

Mar 3 2025 11:34 AM | Updated on Mar 3 2025 12:30 PM

Travis Heads performance against India in international cricket listed

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 గ్రూపు స్టేజిలో ఆజేయంగా నిలిచిన భార‌త జ‌ట్టు.. ఇప్పుడు కీల‌క స‌మ‌రానికి సిద్ద‌మైంది. ఈ మెగా టోర్నీ తొలి సెమీఫైన‌ల్లో మంగ‌ళ‌వారం దుబాయ్ వేదిక‌గా ఆస్ట్రేలియాతో భార‌త్ అమీతుమీ తెల్చుకోనుంది. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌-2023 ఓట‌మికి బదులు తీర్చుకోవాల‌ని రోహిత్ సేన క‌సితో ఉంది. 

అందుకు త‌గ్గ‌ట్టు త‌మ ఆస్త‌శాస్త్రాల‌ను భార‌త జ‌ట్టు సిద్దం చేసుకుంటుంది. మరోవైపు ఆస్ట్రేలియా కూడా టీమిండియాను మరోసారి మట్టికర్పించాలని పట్టుదలతో ఉంది. ఈ టోర్నీకి సీనియర్ ప్లేయర్లు దూరమైనప్పటికి స్టీవ్ స్మిత్ సారథ్యంలోని ఆసీస్ జట్టు అదరగొడుతోంది. దీంతో మరోసారి ఆసీస్‌-భారత్ పోరు రసవత్తరంగా సాగడం ఖాయమన్పిస్తోంది.

మరోసారి 'హెడ్' ఏక్ తప్పదా?
అయితే తొలి సెమీఫైనల్ నేపథ్యంలో అందరి కళ్లు ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాటర్‌​ ట్రావిస్ హెడ్‌పైనే ఉన్నాయి. ప్రత్యర్ధి భారత్ అయితే చెలరేగిపోయే హెడ్‌.. ఈ మ్యాచ్‌లో ఎలా ఆడుతాడో అని అభిమానులు తెగ టెన్షన్ పడుతున్నారు. వన్డే ప్రపంచకప్‌-2023లో​ ఫైనల్లో అతడి చేసిన విధ్వంసం సగటు క్రికెట్ అభిమాని ఎప్పటికి మర్చిపోరు.

ఈ డేంజరస్ బ్యాటర్ ఒంటి చేత్తో మ్యాచ్‌ను భారత్ నుంచి లాగేసుకున్నాడు. గ‌తేడాది జ‌రిగిన టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో భార‌త్ ఆస్ట్రేలియా ఓట‌మి పాలైన‌ప్ప‌టికి.. హెడ్ మాత్రం అద్బుత‌మైన ఇన్నింగ్స్ ఆడాడు. కేవ‌లం 43 బంతుల్లో 76 ప‌రుగులు చేసి త‌న జ‌ట్టును గెలిపించే అంత ప‌నిచేశాడు. 

అంత‌కుముందు వ‌ర‌ల్డ్ టెస్టు ఛాంపియ‌న్‌షిప్ ఫైన‌ల్లోనూ భార‌త్‌పై సెంచ‌రీతో మెరిశాడు. ఇటీవ‌ల జ‌రిగిన బోర్డ‌ర్‌-గ‌వాస్క‌ర్ ట్రోఫీలో హెడ్ ప‌రుగుల వ‌ర‌ద పారించాడు. అందుకే ఆస్ట్రేలియాతో మ్యాచ్ అంటే భార‌త అభిమానులు భ‌య‌ప‌డుతున్నారు. మ‌రి హెడ్‌ను అడ్డుకునేందుకు భార‌త్ ఎటువంటి వ్యూహాలు రచిస్తుందో మ‌రో 24 గంట‌లు వేచి చూడాలి.

భార‌త్‌పై హెడ్ రికార్డు..
టీమిండియాపై వ‌న్డేల్లో ట్రావిస్ హెడ్‌కు మంచి రికార్డు ఉంది. ఇప్ప‌టివ‌ర‌కు భార‌త్‌పై 9 వ‌న్డేలు ఆడిన హెడ్‌.. 43.12 స‌గ‌టుతో 345 పరుగులు చేశాడు. అందులో ఒక సెంచ‌రీతో పాటు హాఫ్ సెంచ‌రీ కూడా ఉన్నాయి. హైయెస్ట్ స్కోర్ 137 ప‌రుగులుగా ఉంది. టెస్టుల్లో భార‌త్‌పై 27 మ్యాచ్‌లు ఆడి 46.52 స‌గ‌టుతో 1163 ప‌రుగులు సాధించాడు.

భారత్‌దే పైచేయి..

కాగా ఛాంపియ‌న్స్ ట్రోఫీలో ఆసీస్‌పై భార‌త్‌దే పై చేయిగా ఉంది. ఇరు జ‌ట్లు నాలుగు మ్యాచ్‌ల్లో ముఖాముఖి త‌ల‌ప‌డ‌గా.. భార‌త్ రెండింట‌, ఆసీస్ కేవ‌లం ఒక మ్యాచ్‌లో విజ‌యం సాధించింది. మ‌రో మ్యాచ్ ఫలితం లేకుండా ముగిసింది. 
చదవండి: Champions Trophy: అక్షర్ పటేల్ కాళ్లు మొక్క‌బోయిన కోహ్లి.. వీడియో వైర‌ల్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement