ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు ముంబై యువ ఆటగాడు ఆయుశ్ మాత్రే పేరు క్రికెట్ సర్కిల్స్‌లో బాగా నానింది. మాత్రే టాలెంట్‌కు చెన్నై సూపర్ కింగ్స్ మాజీ సారధి మహేంద్ర సింగ్ ధోని ముగ్దుడయ్యాడని బాగా ప్రచారం జరిగింది. మెగా వేలానికి ముందు సీఎస్‌కే మాత్రేను ట్రయిల్స్‌కు కూడా పిలిచిందని సోషల్‌మీడియా కోడై కూసింది. అయితే చివరకు మాత్రేను మెగా వేలంలో సీఎస్‌కే కాని మరే ఇతర ఫ్రాంచైజీ కాని పట్టించుకోలేదు. ఈ 17 ఏళ్ల రైట్ హ్యాండ్ బ్యాటింగ్ ఆల్‌రౌండర్ వేలంలో అన్ సోల్డ్‌గా మిగిలిపోయాడు.
ఇదంతా సరే, ఇప్పుడు మాత్రే ప్రస్తావన ఎందుకనుకుంటున్నారా..? సీఎస్‌కే ఆశ చూపించి పట్టించుకోకుండా వదిలిపెట్టిన మాత్రే, ప్రస్తుతం జరుగుతున్న అండర్-19 ఆసియా కప్‌లో చెలరేగిపోతున్నాడు. ఈ టోర్నీలో మాత్రే ఇప్పటికే రెండు హాఫ్ సెంచరీలు చేసి 3 వికెట్లు తీశాడు. తాజాగా యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో మాత్రే ఆల్‌రౌండ్ ప్రదర్శనతో (67 నాటౌట్; 1/19) ఇరగదీశాడు. ఫలితంగా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.
మాత్రే తాజా ప్రదర్శనల నేపథ్యంలో ఇతన్ని ఎందుకు వదులుకున్నామా అని చెన్నై సూపర్ కింగ్స్ భావిస్తుండవచ్చు. మాత్రే వద్ద బంతిని బలంగా బాదే సామర్థ్యం ఉండటంతో పాటు మాంచి బ్యాటింగ్ టెక్నిక్ కూడా ఉంది. ఇతను సీఎస్‌కేలో ఉంటే ఓపెనర్‌గా అద్భుతాలు చేసే ఆస్కారం ఉండేది. ఏది ఏమైనా సీఎస్‌కే మాత్రేను దక్కించుకోలేకపోవడం అన్ లక్కీనే అని చెప్పాలి.
మరోవైపు మాత్రే సహచరుడు, ఓపెనింగ్ పార్ట్‌నర్ వైభవ్ సూర్యవంశీని ఐపీఎల్ మెగా వేలంలో రాజస్తాన్ రాయల్స్ కొనుగోలు చేసింది. సూర్యవంశీని ఆర్‌ఆర్ 1.1 కోట్లకు సొంతం చేసుకుంది.
ఐపీఎల్ 2025 మెగా వేలంలో పాల్గొన్న అతి పిన్న వయస్కుడిగా (13) సూర్యవంశీ రికార్డు నెలకొల్పాడు. మాత్రేలానే సూర్యవంశీ కూడా మంచి హిట్టర్. ఇంకా చెప్పాలంటే మాత్రే కంటే బలమైన హిట్టర్. తాజాగా యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో సూర్యవంశీ మాత్రేతో కలిసి ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మ్యాచ్‌లో సూర్యవంశీ 46 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో అజేయమైన 76 పరుగులు చేశాడు. సూర్యవంశీ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటింగ్‌తో పాటు స్లో లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ బౌలింగ్ వేస్తాడు.
Comments
Please login to add a commentAdd a comment