Champions Trophy: ఆఫ్ఘనిస్తాన్‌తో మ్యాచ్‌ను బహిష్కరించండి..! | UK Politicians Urge England To Boycott Afghanistan At Champions Trophy | Sakshi
Sakshi News home page

Champions Trophy: ఆఫ్ఘనిస్తాన్‌తో మ్యాచ్‌ను బహిష్కరించండి..!

Published Tue, Jan 7 2025 6:40 PM | Last Updated on Tue, Jan 7 2025 7:39 PM

UK Politicians Urge England To Boycott Afghanistan At Champions Trophy

ఛాంపియన్స్‌ ట్రోఫీ-2025లో ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగబోయే మ్యాచ్‌ను బాయ్‌కాట్‌ చేయాలని ఇంగ్లండ్‌కు చెందిన ప్రజాప్రతినిధులు ఆ దేశ క్రికెట్‌ బోర్డును (ఇంగ్లండ్‌ అండ్‌ వేల్స్‌ క్రికెట్‌ బోర్డు, ఈసీబీ) కోరారు. ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్‌ ప్రభుత్వం మ‌హిళ‌ల హ‌క్కుల‌పై ఆంక్ష‌లు విధిస్తున్న నేపథ్యంలో ఇంగ్లండ్‌ పొలిటీషియన్స్‌ ఈ మేరకు పిలుపునిచ్చారు. ఛాంపియన్స్ ట్రోఫీలో ఇంగ్లండ్ ఫిబ్రవరి 26న ఆఫ్ఘనిస్తాన్‌తో తలపడాల్సి ఉంది. 

ఈ మ్యాచ్‌ను బహిష్కరించాలని 160 మందికి పైగా రాజకీయ నాయకులు ఈసీబీ​కి విజ్ఞప్తి చేశారు. అయితే ఇంగ్లండ్‌ ప్రజాప్రతినిధుల విజ్ఞప్తిని ఈసీబీ తిరస్కరించినట్లు సమాచారం​. తాలిబన్ల పాలనలో మహిళలు, బాలికలపై వివక్షకు తాము వ్యతిరేకమని చెప్పిన ఈసీబీ.. ఆఫ్ఘనిస్తాన్‌తో మ్యాచ్‌ను బహిష్కరించలేమని స్పష్టం చేసినట్లు తెలుస్తుంది.

కాగా, 2021 ఆగస్టులో ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ల ప్రభుత్వం ఏర్పడింది. అప్పటి నుంచి ఆఫ్ఘనిస్తాన్‌లో మహిళలపై అడ్డగోలు అంక్షలు అమల్లో ఉన్నాయి. అమ్మాయిలు ఆరవ తరగతికి మించి చదవకూడదని.. మహిళలు ఉద్యోగాలు చేయకూడదని.. బహిరంగ ‍ప్రదేశాల్లో (జిమ్‌లు, పార్కులు) మహిళలు కనిపించకూడదని.. మగ తోడు లేకుండా మహిళలు ప్రయాణం చేయకూడదని.. మహిళలు క్రీడల్లో పాల్గొనకూడదని తాలిబన్‌ ప్రభుత్వం మహిళలపై అంక్షలు విధించింది. ఈ అంక్షల కారణంగానే ఇంగ్లండ్‌ ప్రజాప్రతినిధులు ఛాంపియన్స్‌ ట్రోఫీలో ఆఫ్ఘనిస్తాన్‌తో మ్యాచ్‌ను బహిష్కరించాలని పిలుపునిచ్చారు.

గతంలో ఆస్ట్రేలియా కూడా ఇలాగే..!
మహిళలపై తాలిబన్ ప్రభుత్వం విధించిన ఆంక్షల కారణంగా గతంలో ఆస్ట్రేలియా ఆఫ్ఘనిస్తాన్‌ పురుషుల జట్టుతో ద్వైపాక్షిక సిరీస్‌ ఆడేందుకు నిరాకరించింది. అయితే ఆతర్వాత ఇరు జట్లు 2023 వన్డే ప్రపంచకప్‌, 2024 టీ20 ప్రపంచకప్‌ టోర్నీల్లో తలపడ్డాయి.

జింబాబ్వేతో మ్యాచ్‌ను బహిష్కరించిన ఇంగ్లండ్‌
ఇంగ్లండ్‌ క్రికెట్‌ టీమ్‌ 2003 వన్డే ప్రపంచకప్‌లో జింబాబ్వేతో జరగాల్సిన మ్యాచ్‌ను బాయ్‌కాట్‌ చేసింది. అప్పట్లో జింబాబ్వేలో రాబర్ట్‌ ముగాబే పాలనకు వ్యతిరేకంగా ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు ఈ మేరకు నిర్ణయిం​చింది.

ఇదిలా ఉంటే, 2025 ఛాంపియన్స్‌ ట్రోఫీ పాకిస్తాన్‌ వేదికగా ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 మధ్యలో జరుగనుంది. ఈ టోర్నీలో భారత్‌ ఆడాల్సిన మ్యాచ్‌లు మాత్రం దుబాయ్‌లో జరుగుతాయి. పాక్‌తో సత్సంబంధాలు లేని కారణంగా టీమిండియా పాక్‌లో అడుగుపెట్టరాదని భారత ప్రభుత్వం నిర్ణయించింది. 

ఛాంపియన్స్‌ ట్రోఫీలో భారత్‌ తమ తొలి మ్యాచ్‌ను ఫిబ్రవరి 20న (బంగ్లాదేశ్‌తో) ఆడుతుంది. మెగా టోర్నీలో​ దాయాదుల సమరం ఫిబ్రవరి 23న దుబాయ్‌ వేదికగా జరుగుతుంది. ఆఫ్ఘనిస్తాన్‌-ఇంగ్లండ్‌ మ్యాచ్‌కు లాహోర్‌లోని గడాఫీ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement