
డబ్ల్యూటీసీ-2025 ఫైనల్‌కు ముందు ఆసీస్ వెటరన్ ఓపెనర్ ఉస్మాన్ ఖ్వాజా అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. షెఫీల్డ్ షీల్డ్ టోర్నీలో భాగంగా టస్మానియాతో జరిగిన మ్యాచ్‌లో (క్లీన్స్‌ల్యాండ్) సూపర్ సెంచరీతో సత్తా చాటాడు. ఈ మ్యాచ్‌లో ఖ్వాజా 221 బంతుల్లో 12 బౌండరీలు, సిక్సర్ సాయంతో 127 పరుగులు చేశాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ఖ్వాజాకు ఇది 43వ శతకం. ఖ్వాజా సెంచరీతో కదంతొక్కడంతో తొలుత బ్యాటింగ్ చేసిన క్వీన్స్‌ల్యాండ్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 309 పరుగులు చేసింది.
ఖ్వాజాకు జతగా లాచ్లాన్ హెర్నీ (74) అర్ద సెంచరీతో రాణించాడు. ఆట ముగిసే సమయానికి మైఖేల్ నెసర్ (10), జాక్ విల్డర్‌ముత్ (4) క్రీజ్‌లో ఉన్నారు. క్లీన్స్‌ల్యాండ్ ఇన్నింగ్స్‌లో మ్యాట్ రెన్‌షా 20, జాక్ క్లేటన్ 19, బెన్ మెక్‌డెర్మాట్ 24, జిమ్మీ పియర్సన్ 14 పరుగులు చేసి ఔటయ్యారు. టస్మానియా బౌలర్లలో బ్యూ వెబ్‌స్టర్ 3 వికెట్లు పడగొట్టగా.. గేబ్ బెల్, మిచెల్ ఓవెన్ తలో వికెట్ దక్కించుకున్నారు. ఫైనల్స్‌కు చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఖ్వాజా సూపర్ సెంచరీ సాధించడంతో టస్మానియాపై క్లీన్స్‌ల్యాండ్ పైచేయి సాధించింది.
కాగా, ఈ మ్యాచ్‌లో సెంచరీ సాధించకముందు ఖ్వాజా శ్రీలంక పర్యటనలో డబుల్ సెంచరీతో సత్తా చాటాడు. శ్రీలంకతో జరిగిన రెండో టెస్ట్‌లో ఖ్వాజా 352 బంతుల్లో 232 పరుగులు చేశాడు. ఈ ప్రదర్శనతో ఖ్వాజా లేటు వయసులో ఆస్ట్రేలియా తరఫున డబుల్ సెంచరీ సాధించిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు.
శ్రీలంక పర్యటనకు ముందు స్వదేశంలో భారత్‌తో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఖ్వాజా దారుణంగా విఫలమయ్యాడు. 5 మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో ఖ్వాజా కేవలం ఒకే ఒక హాఫ్ సెంచరీ చేశాడు. మిగతా 9 ఇన్నింగ్స్‌ల్లో పూర్తిగా నిరాశపరిచాడు. సౌతాఫ్రికాతో జరుగబోయే డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ముందు ఖ్వాజా ఫామ్‌లో కొనసాగడం ఆసీస్‌కు శుభసూచకం. డబ్ల్యూటీసీ ఫైనల్ జూన్ 11-15 మధ్యలో లార్డ్స్ వేదికగా జరుగనుంది.
ఇదిలా ఉంటే, ఆస్ట్రేలియా వన్డే జట్టు ప్రస్తుతం జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీలో సెమీస్‌లో నిష్క్రమించింది. తొలి సెమీఫైనల్లో స్టీవ్ స్మిత్ సేన టీమిండియా చేతిలో భంగపడింది. దుబాయ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ 49.3 ఓవర్లలో 264 పరుగులకు ఆలౌటైంది. స్టీవ్ స్మిత్ (73), అలెక్స్ క్యారీ (61) అర్ద సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో షమీ 3, వరుణ్ చక్రవర్తి, రవీంద్ర జడేజా తలో 2, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ చెరో వికెట్ దక్కించుకున్నారు.
అనంతరం భారత్ 48.1 ఓవర్లలోనే ఆసీస్ నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించి ఫైనల్‌కు చేరింది. విరాట్ కోహ్లి (84) అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి టీమిండియా గెలుపుతో కీలకపాత్ర పోషించాడు. శ్రేయస్ అయ్యర్ (45), కేఎల్ రాహుల్ (42 నాటౌట్), హార్దిక్ పాండ్యా (28) భారత్ గెలుపులో తలో చేయి వేశారు. మార్చి 9న జరుగబోయే ఫైనల్లో టీమిండియా న్యూజిలాండ్‌తో అమీతుమీ తేల్చుకోనుంది.
Comments
Please login to add a commentAdd a comment