
డెహ్రాడూన్: హాకీ క్రీడాకారిణి, హ్యాట్రిక్ గర్ల్ వందన కటారియాకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది. టోక్యో ఒలింపిక్స్‌లో అద్భుత ప్రదర్శనకుగాను ఆమెకు రూ. 25 లక్షల నగదు బహుమతిని ఇవ్వనున్నట్టు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి వెల్లడించారు. అలాగే ఆటలలో ప్రతిభను పెంపొందించేందుకు త్వరలోనే ఒక ఆకర్షణీయమైన కొత్త స్పోర్ట్స్ పాలసీని తీసుకురానున్నామని కూడా ఆయన చెప్పారు.
టోక్యో ఒలింపిక్స్‌లో మహిళల హాకీలో భారత అత్యుత్తమ ప్రదర్శనలో వందన కటారియా పోషించిన అద్భుతమైన పాత్ర తమకు గర్వకారణమని సీఎం ఆమెను ప్రశంసించారు. మరోవైపు టోక్యో ఒలింపిక్స్ లో సెమి ఫైనల్‌లో ఓటమికి వందన కటారియానే కారణమంటూ కులంపేరుతో దూషించిన కేసులో ఇద్దరు వ్యక్తులనుపోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో ఒక నేషనల్ హాకీ ప్లేయర్ అని సమాచారం. తెలుస్తోంది. అతడిపై భారత హాకీ సమాఖ్య తగిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు.భారత మహిళా హాకీ జట్టు అర్జెంటీనాపై 1-2 తేడాతో ఓడిపోయిన నేపథ్యంలో వందన కటారియా వల్లనే ఓడి పోయిందంటూ దారుణమైన ట్రోలింగ్‌కు పాల్పడ్డారు. కొందరు ఆమె నివాసం వద్ద నిరసనకు దిగారు. దీనిపై వందన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కాగా ఉత్తరాఖండ్ హరిద్వార్‌లోని రోష్‌నాబాద్ గ్రామానికి చెందిన హాకీ క్రీడాకారిణి వందనా కటారియా. టోక్యో ఒలింపిక్స్‌లో దక్షిణాఫ్రికాపై హ్యాట్రిక్ గోల్స్ కొట్టి సరికొత్త రికార్డు సాధించింది. భారత మహిళా హాకీ ప్లేయర్ ఇలా హ్యాట్రిక్ గోల్స్ కొట్టడం ఇదే తొలిసారి.ఈ మ్యాచ్‌లో 4-3 తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. శుక్రవారం నాటి హోరా హోరీ కాంస్య ప్లే-ఆఫ్ మ్యాచ్‌లో గ్రేట్ బ్రిటన్ చేతిలో 3-4 తేడాతో ఓటమి పాలైంది. ముఖ్యంగా చివరి క్వార్టర్‌లో ఫలితం తారుమారుకావడంతో తొలి ఒలింపిక్ పతకాన్ని సాధించాలనే భారత మహిళల హాకీ జట్టు ఆశ ఫలించకుండా పోయింది.
Comments
Please login to add a commentAdd a comment