Venkatesh Prasad Said Fans Rip Into Team India After T20 Series Loss - Sakshi
Sakshi News home page

Ind Vs WI: హార్దిక్‌ సేనపై మాజీ పేసర్‌ ఘాటు వ్యాఖ్యలు.. కెప్టెన్‌ వెర్రిమొహం వేస్తున్నాడు! వాళ్లేమో అలా!

Published Mon, Aug 14 2023 3:43 PM | Last Updated on Mon, Aug 14 2023 4:27 PM

Venkatesh Prasad Rips Into Indian Team No Hunger Captain Looked Clueless - Sakshi

West Indies vs India, 5th T20I: టీమిండియా మాజీ క్రికెటర్‌ వెంకటేశ్‌ ప్రసాద్‌ హార్దిక్‌ సేనపై విమర్శలు సంధించాడు. వెస్టిండీస్‌తో ఐదో టీ20లో గెలవాలన్న కసి భారత జట్టులో ఏమాత్రం కనిపించలేదని ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ఆటగాళ్లలో ఏకాగ్రత లోపించిందని.. గుడ్డిగా ముందుకు వెళ్తే ఇలాంటి పరాభవాలే ఎదురవుతాయని అభిప్రాయపడ్డాడు.

కాగా విండీస్‌ పర్యటనలో 1-0తో టెస్టు సిరీస్‌ గెలిచిన టీమిండియా.. వన్డే సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది. అయితే, టీ20 సిరీస్‌లో మాత్రం అనూహ్య రీతిలో ఘోర ఓటమిపాలైంది. 3-2తో ఆతిథ్య జట్టుకు సిరీస్‌ సమర్పించుకుంది. అమెరికాలో ఫ్లోరిడాలో ఐదో టీ20లో సమిష్టి వైఫల్యంతో విమర్శలు మూటగట్టుకోంది.

వాళ్లు మినహా.. మిగతా వాళ్లంతా
భారత బ్యాటర్లలో సూర్యకుమార్‌ యాదవ్‌(61) అర్ధ శతకంతో రాణించగా.. తిలక్‌ వర్మ 27 పరుగులు చేయగలిగాడు. మిగతా బ్యాటర్లలో ఒక్కరు కూడా కనీసం 20 పరుగులు మార్కు అందుకోలేదు. దీంతో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ ఎంచుకున్న టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది.

దంచికొట్టారు
లక్ష్య ఛేదనలో విండీస్‌ ఓపెనర్‌ బ్రాండన్‌ కింగ్‌(85- నాటౌట్‌), వన్‌డౌన్‌ బ్యాటర్‌ నికోలస్‌ పూరన్‌(47)కు తోడు షాయీ హోప్‌(22- నాటౌట్‌) దంచికొట్టారు. దీంతో 18 ఓవర్లలోనే టార్గెట్‌ను ఊదేసిన వెస్టిండీస్‌ 8 వికెట్ల తేడాతో గెలుపొంది టీమిండియాపై చేయి సాధించింది. 

పాండ్యా పూర్తిగా విఫలం
ఇక ఆదివారం నాటి ఈ మ్యాచ్‌లో హార్దిక్‌ పాండ్యా బ్యాట్‌, బంతితోనూ విఫలమయ్యాడు. 18 బంతుల్లో 14 పరుగులు మాత్రమే చేసిన ఈ పేస్‌ ఆల్‌రౌండర్‌.. మూడు ఓవర్లలో ఏకంగా 32 పరుగులు సమర్పించుకున్నాడు. అదే విధంగా కెప్టెన్‌గానూ సరైన నిర్ణయాలు తీసుకోలేకపోయాడు.

ఎనిమిది మందితో బౌలింగ్‌
బ్రాండన్‌- పూరన్‌ జోడీని విడగొట్టడానికి పదే పదే బౌలర్లను మార్చాడు. యువ బ్యాటర్లు తిలక్‌ వర్మ, యశస్వి జైశ్వాల్‌తో కలిపి మొత్తంగా ఎనిమిది మంది ఈ మ్యాచ్‌లో బౌలింగ్‌ చేశారు. అర్ష్‌దీప్‌తో పాటు తిలక్‌ ఒక వికెట్‌ తీయగలిగాడు.

ఈ నేపథ్యంలో భారత మాజీ పేసర్‌ వెంకటేశ్‌ ప్రసాద్‌ ట్విటర్‌ వేదికగా హార్దిక్‌ పాండ్యా, జట్టుపై విమర్శలు గుప్పించాడు. ‘‘టీమిండియా కచ్చితగా తన నైపుణ్యాలను మరింత మెరుగుపరచుకోవాలి. అసలు గెలవాలన్న తపన వారిలో కనబడలేదు.

గుడ్డిగా వెళ్లొద్దు
కెప్టెన్‌ అయితే ఎప్పుడూ వెర్రిమొహం వేస్తున్నాడు. నిజానికి బౌలర్లు బ్యాటింగ్‌ చేయలేరు. బ్యాటర్లు బౌలింగ్‌ చేయలేరు కదా! కానీ.. మనకు ఓ ప్లేయర్‌ ఇష్టమైనంత మాత్రాన గుడ్డిగా వాళ్లతో ప్రయోగాలు చేస్తే ఎలా? జట్టు దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఆటగాళ్ల సేవలను వినియోగించుకోవాలి’’ అంటూ తనదైన శైలిలో చురకలు అంటించాడు.

ప్రస్తుతం పరిమిత ఓవర్ల క్రికెట్‌లో టీమిండియా అత్యంత సాధారణ జట్టులా కనిపిస్తోందని అభిప్రాయపడ్డాడు. గత టీ20 వరల్డ్‌కప్‌ టోర్నీకి అర్హత సాధించని జట్టు చేతిలో కూడా ఓటమి పాలయ్యారని విమర్శించాడు. గతంలో బంగ్లాదేశ్‌కు వన్డే సిరీస్‌ను కోల్పోయారు కూడా! కాబట్టి.. సిల్లీ కామెంట్లు చేసే బదులు ఆటపై దృష్టిపెడితే బాగుంటుందని హార్దిక్‌ పాండ్యాకు చురకలు వేశాడు. ఇప్పటికైనా భ్రమల్లోంచి బయటకు రావాలని సెటైర్లు వేశాడు.

చదవండి: IND VS WI 5th T20: విండీస్‌ గెలిచినా.. పూరన్‌కు కమిలిపోయింది..!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement