విజయ్ హజారే ట్రోఫీ 2024-25లో రాజస్థాన్, హర్యానా జట్లు క్వార్టర్ ఫైనల్స్‌కు చేరాయి. ఇవాళ (జనవరి 9) జరిగిన ప్రిలిమినరీ క్వార్టర్ ఫైనల్స్‌లో రాజస్థాన్, హర్యానా జట్లు విజయం సాధించాయి. తమిళనాడుతో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ 19 పరుగుల తేడాతో గెలుపొందగా.. బెంగాల్‌పై హర్యానా 72 పరుగుల తేడాతో విజయం సాధించింది.
వరుణ్ ఐదు వికెట్ల ప్రదర్శన వృధా
ప్రిలిమినరీ క్వార్టర్ ఫైనల్-2లో రాజస్థాన్, హర్యానా జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 47.3 ఓవర్లలో 267 పరుగులకు ఆలౌటైంది. మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవరి ఐదు వికెట్లు (9-0-52-5) తీసి రాజస్థాన్‌ను దెబ్బకొట్టాడు. సందీప్ వారియర్ (8.3-1-38-2), సాయి కిషోర్ (10-0-49-2), త్రిలోక్ నాగ్ (6-1-31-1) రాణించారు.
రాజస్థాన్ ఇన్నింగ్స్‌లో ఓపెనర్ అభిజీత్ తోమర్ (125 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 111 పరుగులు) సెంచరీతో, కెప్టెన్ మహిపాల్ లోమ్రార్ (49 బంతుల్లో 60;3 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్ద సెంచరీతో కదం తొక్కారు. తోమర్, లోమ్రార్‌తో పాటు కార్తీక్ శర్మ (35), సమర్పిత్ జోషి (15) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు.
అనంతరం 268 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన తమిళనాడు 47.1 ఓవర్లలో 248 పరుగులకు ఆలౌటైంది. రాజస్థాన్ బౌలర్లు తలో చేయి వేసి తమిళనాడు ఇంటికి పంపించారు. అమన్ సింగ్ షెకావత్ మూడు వికెట్లు పడగొట్టగా.. అనికేత్ చౌదరీ, అజయ్ సింగ్ తలో రెండు, ఖలీల్ అహ్మద్ ఓ వికెట్ దక్కించుకున్నారు. తమిళనాడు ఇన్నింగ్స్‌లో ఎన్ జగదీశన్ (65) టాప్ స్కోరర్‌గా నిలువగా.. బాబా ఇంద్రజిత్ (37), విజయ్ శంకర్ (49), మహ్మద్ అలీ (34) ఓ మోస్తరు స్కోర్లు చేశారు.
బెంగాల్ భరతం పట్టిన హర్యానా
బెంగాల్‌తో జరిగిన మ్యాచ్‌లో (ప్రిలిమినరీ క్వార్టర్ ఫైనల్-1) హర్యానా ఆటగాళ్లు కలిసికట్టుగా పోరాడారు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో క్రమశిక్షణతో వ్యవహరించారు. ఫలితంగా సునాయాస విజయం సాధించారు. తొలుత బ్యాటింగ్ చేసిన హర్యానా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసింది.
హర్యానా ఇన్నింగ్స్‌లో పార్థ్ వట్స్ (62), నిషాంత్ సంధు (64) హాఫ్ సెంచరీలతో రాణించగా.. ఆఖర్లో సుమిత్ కుమార్ (41 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. బెంగాల్ బౌలర్లలో మొహమ్మద్ షమీ మూడు వికెట్లు పడగొట్టగా.. ముకేశ్ కుమార్ రెండు, సుయాన్ ఘోష్, ప్రదిప్త ప్రమాణిక్, కౌశిక్ మైటీ, కరణ్ లాల్ తలో వికెట్ దక్కించుకున్నారు.
299 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బెంగాల్ 43.1 ఓవర్లలో 226 పరుగులకు ఆలౌటైంది. బెంగాల్ ఇన్నింగ్స్‌లో అభిషేక్ పోరెల్ (57) ఒక్కడే అర్ద సెంచరీతో రాణించాడు. కెప్టెన్ సుదిప్ కుమార్ ఘరామీ (36), మజుందార్ (36), కరణ్ లాల్‌కు (28) ఓ మోస్తరు ఆరంభాలు లభించినప్పటికీ పెద్ద స్కోర్లు చేయలేకపోయారు. పార్థ్ వట్స్ 3, నిషాంత్ సంధు, అన్షుల్ కంబోజ్ చెరో 2, అమన్ కుమార్, సుమిత్ కుమార్, అమిత్ రాణా తలో వికెట్ పడగొట్టి బెంగాల్ ఇన్నింగ్స్‌ను మట్టుబెట్టారు.
Comments
Please login to add a commentAdd a comment