శార్దూల్‌ ఠాకూర్‌ ఊచకోత.. 28 బంతుల్లో 8 సిక్సర్ల సాయంతో..! | Vijay Hazare Trophy: Shardul Thakur Explosive 73 Runs Off 28 Balls | Sakshi
Sakshi News home page

శార్దూల్‌ ఠాకూర్‌ ఊచకోత.. 28 బంతుల్లో 8 సిక్సర్ల సాయంతో..!

Published Tue, Dec 31 2024 4:38 PM | Last Updated on Tue, Dec 31 2024 5:02 PM

Vijay Hazare Trophy: Shardul Thakur Explosive 73 Runs Off 28 Balls

విజయ్‌ హజారే ట్రోఫీ 2024-25లో ముంబై ఆటగాడు శార్దూల్‌ ఠాకూర్‌ (Shardul Thakur) విశ్వరూపం​ ప్రదర్శించాడు. నాగాలాండ్‌తో ఇవాళ (డిసెంబర్‌ 31) జరుగుతున్న మ్యాచ్‌లో శార్దూల్‌ బ్యాట్‌తో చెలరేగిపోయాడు. 28 బంతుల్లో రెండు ఫోర్లు, ఎనిమిది సిక్సర్ల సాయంతో 73 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.

సిక్సర్ల సునామీ సృష్టించిన శార్దూల్‌ 260.71 స్ట్రయిక్‌రేట్‌తో పరుగులు సాధించాడు. శార్దూల్‌ సుడిగాలి ఇన్నింగ్స్‌ కారణంగా నాగాలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై అతి భారీ స్కోర్‌ చేసింది. ఆ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 403 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడిన ముంబై ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌ చేసింది.

ఆయుశ్‌ మాత్రే రికార్డు శతకం
ఈ మ్యాచ్‌లో ముంబై యువ సంచలనం ఆయుశ్‌ మాత్రే సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఈ మ్యాచ్‌లో మాత్రే (181) భారీ సెంచరీతో మెరిశాడు. 17 ఏళ్ల 168 రోజుల వయసులో మాత్రే ఈ సెంచరీ చేశాడు. లిస్ట్‌-ఏ క్రికెట్‌లో (50 ఓవర్ల ఫార్మాట్‌) ఇంత చిన్న వయసులో 150 ప్లస్‌ స్కోర్‌ ఎవరూ చేయలేదు. ఇదో వరల్డ్‌ రికార్డు. 

గతంలో ఈ రికార్డు టీమిండియా స్టార్‌ ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ పేరిట ఉండేది. యశస్వి కూడా ముంబై తరఫున ఆడుతూ 17 ఏళ్ల 291 రోజుల వయసులో 150 ప్లస్‌ స్కోర్‌ చేశాడు. ఈ మ్యాచ్‌లో మాత్రే 117 బంతుల్లో 15 ఫోర్లు, 11 సిక్సర్ల సాయంతో 181 పరుగులు చేశాడు. విజయ్‌ హజారే ట్రోఫీలో ముంబై తరఫున ఇది ఐదో అత్యధిక స్కోర్‌.

భారీ భాగస్వామ్యం
ఈ మ్యాచ్‌లో మాత్రే.. అంగ్‌క్రిశ్‌ రఘువంశీతో (56) కలిసి తొలి వికెట్‌కు 156 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. అనంతరం మాత్రే.. సిద్దేశ్‌ లాడ్‌తో కలిసి మూడో వికెట్‌కు 96 పరుగులు జోడించాడు. డబుల్‌ సెంచరీకి చేరువైన మాత్రే మూడో వికెట్‌గా వెనుదిరిగాడు.

మాత్రే, శార్దూల్‌ మినహా చెప్పుకోదగ్గ స్కోర్లేమీ లేవు
ముంబై ఇన్నింగ్స్‌లో మాత్రే, శార్దూల్‌ ఠాకూర్‌ మినహా చెప్పుకోదగ్గ స్కోర్లేమీ లేవు. బిస్త 2, సిద్దేశ్‌ లాడ్‌ 39, సుయాంశ్‌ షేడ్గే 5, ప్రసాద్‌ పవార్‌ 38, అంకోలేకర్‌ 0, హిమాన్షు సింగ్‌ (5) పరుగులు చేశారు. నాగాలాండ్‌ బౌలర్లలో దిప్‌ బోరా మూడు వికెట్లు పడగొట్టగా.. నగాహో చిషి 2, ఇమ్లివాటి లెమ్టూర్‌, జే సుచిత్‌ తలో వికెట్‌ దక్కించుకున్నారు.

23 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన నాగాలాండ్‌
404 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన నాగాలాండ్‌ 23 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి ఓటమిని ఖరారు చేసుకుంది. ఏదో అద్భుతం జరిగేతే తప్ప ఈ మ్యాచ్‌లో నాగాలాండ్‌ గెలవలేదు. 36.4 ఓవర్ల అనంతరం నాగాలాండ్‌ స్కోర్‌ 115/6గా ఉంది. జగదీష సుచిత (46), లెమ్టూర్‌ (2) క్రీజ్‌లో ఉన్నారు. ఓపెనర్‌ రుపేరో (53) అర్ద సెంచరీతో రాణించాడు. ఈ మ్యాచ్‌లో నాగలాండ్‌ గెలవాలంటే 80 బంతుల్లో 289 పరుగులు చేయాలి. చేతిలో నాలుగు వికెట్లు ఉన్నాయి.

బంతితోనూ రాణించిన శార్దూల్‌
బ్యాట్‌తో మెరుపు ఇన్నింగ్స్‌ ఆడిన శార్దూల్‌ ఈ మ్యాచ్‌లో బంతితోనూ రాణించాడు. బౌలింగ్‌ అటాక్‌ను మొదలుపెట్టిన శార్దూల్‌ నాలుగు ఓవర్లలో 12 పరుగులిచ్చి రెండు వికెట్లు తీశాడు. ఇందులో ఓ మొయిడిన్‌ ఓవర్‌ ఉంది.

స్టార్లకు విశ్రాంతి
ఈ మ్యాచ్‌లో ముంబై యాజమాన్యం స్టార్‌ ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చింది. ప్రత్యర్ధి చిన్న జట్టు కావడంతో ఈ మ్యాచ్‌లో శ్రేయస్‌ అయ్యర్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, శివమ్‌ దూబే ఆడటం లేదు. శ్రేయస్‌ అయ్యర్‌ స్థానంలో శార్దూల్‌ ఠాకూర్‌ ముంబై కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement