యూసుఫ్ పఠాన్, రంజీ ట్రోఫీతో వినయ్
భారత క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించి ఆపై దేశవాళీ క్రికెట్‌లోనూ తమదైన ముద్ర వేసిన ఇద్దరు క్రికెటర్లు ఒకే రోజు ఆటకు గుడ్‌బై చెప్పారు. 38 ఏళ్ల బరోడా ఆల్‌రౌండర్ యూసుఫ్ పఠాన్ తన రిటైర్మెంట్‌ను ప్రకటించగా... 37 ఏళ్ల కర్ణాటక పేస్ బౌలర్ వినయ్ కుమార్ కూడా వీడ్కోలు పలికాడు. టీమిండియా తరఫున ఆడి చాలా కాలమే అయినా... గత సీజన్ వరకు కూడా వీరిద్దరు రంజీ ట్రోఫీలో బరిలోకి దిగారు.
యూసుఫ్ పఠాన్
భారీ హిట్టర్‌గా గుర్తింపు పొందిన యూసుఫ్ పఠాన్ అంతర్జాతీయ కెరీర్ ఘనంగా ఆరంభమైంది. భారత జట్టు గెలిచిన 2007 టి20 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ (పాకిస్తాన్‌పై)తోనే అతని కెరీర్ అరంగేట్రం జరిగింది. మొత్తం 22 టి20 మ్యాచ్‌లు ఆడిన యూసుఫ్ 146.58 స్ట్రయిక్‌రేట్‌తో 236 పరుగులు చేయడంతో పాటు తన ఆఫ్ స్పిన్‌తో 13 వికెట్లు పడగొట్టాడు. టి20లకంటే అతని వన్డే కెరీర్ మెరుగ్గా సాగింది. 57 వన్డేల్లో పఠాన్ 113.60 స్ట్రయిక్‌రేట్‌తో 810 పరుగులు సాధించాడు. ఇందులో 2 సెంచరీలు, 3 అర్ధ సెంచరీలు ఉన్నాయి. 2011లో ధోని సారథ్యంలో వన్డే వరల్డ్‌కప్‌లో చాంపియన్‌గా నిలిచిన భారత జట్టులోనూ సభ్యుడైన అతను ఈ టోర్నీలో 6 మ్యాచ్‌లు ఆడాడు.
ఐపీఎల్ ద్వారా యూసుఫ్ క్రికెట్ అభిమానులకు మరింత చేరువయ్యాడు. తన దూకుడైన బ్యాటింగ్‌తో అతను పలు అద్భుత ప్రదర్శనలు నమోదు చేశాడు. 2008 తొలి ఐపీఎల్ ఫైనల్లో రాజస్తాన్ రాయల్స్ ట్రోఫీ గెలవడంలో కీలక పాత్ర పోషించి ‘ప్లేయర్ ఆఫ్ ద ఫైనల్’గా నిలిచిన యూసుఫ్ కోల్‌కతా నైట్‌రైడర్స్ తరఫున 2012, 2014 టైటిల్స్ విజయాల్లో కూడా భాగస్వామి. 2010లో 37 బంతుల్లోనే అప్పటి ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేసిన యూసుఫ్... 2014లో 15 బంతుల్లో హాఫ్ సెంచరీతో అప్పటి ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీని కూడా తన పేరిటే లిఖించాడు. మొత్తంగా 174 ఐపీఎల్ మ్యాచ్‌లలో 142.97 స్ట్రయిక్‌రేట్‌తో 3,204 పరుగులు చేసిన యూసుఫ్ 2018, 2019 సీజన్లలో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. గత రెండు ఐపీఎల్ వేలంలో అతడిని ఎవరూ జట్టులోకి తీసుకోలేదు.
100 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు కూడా ఆడిన ఈ బరోడా స్టార్... 2010లో హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో జరిగిన దులీప్ ట్రోఫీ ఫైనల్లో (సౌత్‌జోన్‌పై) ఆడిన ఇన్నింగ్స్ ఎప్పటికీ మరచిపోలేనిది. వెస్ట్‌జోన్ తరఫున ఆడిన యూసుఫ్ 190 బంతుల్లోనే 19 ఫోర్లు, 10 సిక్సర్లతో చెలరేగి అజేయంగా 210 పరుగులు చేయడంతో వెస్ట్ జోన్ జట్టు 536 పరుగుల రికార్డు లక్ష్యాన్ని ఛేదించడం విశేషం. కెరీర్‌లో ఒక్క టెస్టు కూడా ఆడే అవకాశం రాని యూసుఫ్ 2012లో చివరిసారి భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు.
వినయ్ కుమార్
రంజీ ట్రోఫీలో సూపర్ స్టార్‌గా గుర్తింపు పొందిన ఆటగాళ్లలో వినయ్ కుమార్ కూడా ఒకడు. దావణగెరెకు చెందిన ఈ పేస్ బౌలర్ 139 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లలో ఏకంగా 504 వికెట్లు పడగొట్టాడు. ఇందులో రంజీ ట్రోఫీలో సాధించినవే 442 (115 మ్యాచ్‌లు) ఉన్నాయి. అత్యధిక రంజీ వికెట్లు సాధించిన జాబితాలో రాజీందర్ గోయల్ (637), వెంకట్రాఘవన్ (530), సునీల్ జోషి (479) తర్వాత నాలుగో స్థానంలో వినయ్ ఉండగా... పేస్ బౌలర్లలో అతనిదే అగ్రస్థానం. సుదీర్ఘ కాలం సొంత జట్టుకు ప్రాతినిధ్యం వహించిన తర్వాత కెరీర్ చివరి ఏడాది అతను పుదుచ్చేరి తరఫున ఆడాడు.
కర్ణాటక కెప్టెన్‌గా వినయ్ రికార్డు ఘనంగా ఉంది. 2013–14 సీజన్‌లో వినయ్ నాయకత్వంలో కర్ణాటక రంజీ ట్రోఫీ, ఇరానీ కప్, విజయ్ హజారే ట్రోఫీ గెలవగా... 2014–15 సీజన్‌లో కూడా ఇదే ‘ట్రిపుల్’ పునరావృతం కావడం విశేషం. తొలి సీజన్ ఐపీఎల్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ప్రాతినిధ్యం వహించిన వినయ్ ఐపీఎల్ కెరీర్‌లో 105 మ్యాచ్‌లలో 105 వికెట్లు తీశాడు. 2014 (కోల్‌కతా), ముంబై (2015, 2017) ఐపీఎల్ టైటిల్స్ విజయాల్లో అతనూ సభ్యుడు. 2018 తర్వాత మళ్లీ అతనికి లీగ్‌లో అవకాశం రాలేదు.
భారత్ తరఫున మాత్రం వినయ్ కుమార్ కెరీర్ గొప్పగా సాగలేదు. ఒకే ఒక టెస్టు ఆడి 1 వికెట్ తీసిన అతను... 31 వన్డేల్లో 38 వికెట్లు, 9 టి20ల్లో 10 వికెట్లు పడగొట్టాడు. దేశవాళీ క్రికెట్‌లో కొన్ని గొప్ప ప్రదర్శనలు చేసినా... 2013 తర్వాత అతనికి మళ్లీ టీమిండియాకు ఆడే అవకాశం రాలేదు.
ఐపీఎల్ ట్రోఫీతో...
Comments
Please login to add a commentAdd a comment