Indian cricket team players
-
‘రోజ్ బౌల్’ చెంత...
సౌతాంప్టన్: భారత క్రికెట్ పురుషుల, మహిళల జట్లు గురువారం ఇంగ్లండ్ గడ్డపై అడుగు పెట్టాయి. లండన్‌లోని హీత్రూ విమానాశ్రయంనుంచి ప్రత్యేక వాహనాల్లో ఆటగాళ్లంతా సౌతాంప్టన్‌కు చేరుకున్నారు. ప్రస్తుతం ఇంగ్లండ్‌లో ఉన్న కరోనా ఆంక్షలను పరిగణలోకి తీసుకుంటూ వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ వేదిక అయిన రోజ్ బౌల్ మైదానం పరిధిలోనే ఉన్న ‘హిల్టన్’ హోటల్లోనే టీమిండియా సభ్యులకు వసతి ఏర్పాటు చేశారు. ప్రస్తుతానికి నిబంధనల ప్రకారం ప్రతీ ఆటగాడు హోటల్‌కే పరిమితం కావాల్సి ఉంది. ఇక్కడికి చేరుకున్న తర్వాత సహచరుడు రిషభ్ పంత్‌తో కలిసి రోహిత్ శర్మ ‘వి ఆర్ ఇన్ సౌతాంప్టన్’ అని హోటల్ బాల్కనీలో ఉన్న ఫొటోతో ట్వీట్ చేశాడు. క్వారంటైన్ ముగిసిన తర్వాత ఇదే మైదానంలో పురుషుల జట్టు ప్రాక్టీస్ చేస్తుంది. -
అటు యూసుఫ్... ఇటు వినయ్...
భారత క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించి ఆపై దేశవాళీ క్రికెట్లోనూ తమదైన ముద్ర వేసిన ఇద్దరు క్రికెటర్లు ఒకే రోజు ఆటకు గుడ్‌బై చెప్పారు. 38 ఏళ్ల బరోడా ఆల్‌రౌండర్ యూసుఫ్ పఠాన్ తన రిటైర్మెంట్ను ప్రకటించగా... 37 ఏళ్ల కర్ణాటక పేస్ బౌలర్ వినయ్ కుమార్ కూడా వీడ్కోలు పలికాడు. టీమిండియా తరఫున ఆడి చాలా కాలమే అయినా... గత సీజన్ వరకు కూడా వీరిద్దరు రంజీ ట్రోఫీలో బరిలోకి దిగారు. యూసుఫ్ పఠాన్ భారీ హిట్టర్‌గా గుర్తింపు పొందిన యూసుఫ్ పఠాన్ అంతర్జాతీయ కెరీర్ ఘనంగా ఆరంభమైంది. భారత జట్టు గెలిచిన 2007 టి20 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ (పాకిస్తాన్‌పై)తోనే అతని కెరీర్ అరంగేట్రం జరిగింది. మొత్తం 22 టి20 మ్యాచ్‌లు ఆడిన యూసుఫ్ 146.58 స్ట్రయిక్‌రేట్‌తో 236 పరుగులు చేయడంతో పాటు తన ఆఫ్ స్పిన్‌తో 13 వికెట్లు పడగొట్టాడు. టి20లకంటే అతని వన్డే కెరీర్ మెరుగ్గా సాగింది. 57 వన్డేల్లో పఠాన్ 113.60 స్ట్రయిక్‌రేట్‌తో 810 పరుగులు సాధించాడు. ఇందులో 2 సెంచరీలు, 3 అర్ధ సెంచరీలు ఉన్నాయి. 2011లో ధోని సారథ్యంలో వన్డే వరల్డ్‌కప్‌లో చాంపియన్‌గా నిలిచిన భారత జట్టులోనూ సభ్యుడైన అతను ఈ టోర్నీలో 6 మ్యాచ్‌లు ఆడాడు. ఐపీఎల్ ద్వారా యూసుఫ్ క్రికెట్ అభిమానులకు మరింత చేరువయ్యాడు. తన దూకుడైన బ్యాటింగ్‌తో అతను పలు అద్భుత ప్రదర్శనలు నమోదు చేశాడు. 2008 తొలి ఐపీఎల్ ఫైనల్లో రాజస్తాన్ రాయల్స్ ట్రోఫీ గెలవడంలో కీలక పాత్ర పోషించి ‘ప్లేయర్ ఆఫ్ ద ఫైనల్’గా నిలిచిన యూసుఫ్ కోల్‌కతా నైట్‌రైడర్స్ తరఫున 2012, 2014 టైటిల్స్ విజయాల్లో కూడా భాగస్వామి. 2010లో 37 బంతుల్లోనే అప్పటి ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేసిన యూసుఫ్... 2014లో 15 బంతుల్లో హాఫ్ సెంచరీతో అప్పటి ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీని కూడా తన పేరిటే లిఖించాడు. మొత్తంగా 174 ఐపీఎల్ మ్యాచ్‌లలో 142.97 స్ట్రయిక్‌రేట్‌తో 3,204 పరుగులు చేసిన యూసుఫ్ 2018, 2019 సీజన్లలో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. గత రెండు ఐపీఎల్ వేలంలో అతడిని ఎవరూ జట్టులోకి తీసుకోలేదు. 100 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు కూడా ఆడిన ఈ బరోడా స్టార్... 2010లో హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో జరిగిన దులీప్ ట్రోఫీ ఫైనల్లో (సౌత్‌జోన్‌పై) ఆడిన ఇన్నింగ్స్ ఎప్పటికీ మరచిపోలేనిది. వెస్ట్‌జోన్ తరఫున ఆడిన యూసుఫ్ 190 బంతుల్లోనే 19 ఫోర్లు, 10 సిక్సర్లతో చెలరేగి అజేయంగా 210 పరుగులు చేయడంతో వెస్ట్ జోన్ జట్టు 536 పరుగుల రికార్డు లక్ష్యాన్ని ఛేదించడం విశేషం. కెరీర్లో ఒక్క టెస్టు కూడా ఆడే అవకాశం రాని యూసుఫ్ 2012లో చివరిసారి భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు. వినయ్ కుమార్ రంజీ ట్రోఫీలో సూపర్ స్టార్‌గా గుర్తింపు పొందిన ఆటగాళ్లలో వినయ్ కుమార్ కూడా ఒకడు. దావణగెరెకు చెందిన ఈ పేస్ బౌలర్ 139 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లలో ఏకంగా 504 వికెట్లు పడగొట్టాడు. ఇందులో రంజీ ట్రోఫీలో సాధించినవే 442 (115 మ్యాచ్‌లు) ఉన్నాయి. అత్యధిక రంజీ వికెట్లు సాధించిన జాబితాలో రాజీందర్ గోయల్ (637), వెంకట్రాఘవన్ (530), సునీల్ జోషి (479) తర్వాత నాలుగో స్థానంలో వినయ్ ఉండగా... పేస్ బౌలర్లలో అతనిదే అగ్రస్థానం. సుదీర్ఘ కాలం సొంత జట్టుకు ప్రాతినిధ్యం వహించిన తర్వాత కెరీర్ చివరి ఏడాది అతను పుదుచ్చేరి తరఫున ఆడాడు. కర్ణాటక కెప్టెన్‌గా వినయ్ రికార్డు ఘనంగా ఉంది. 2013–14 సీజన్లో వినయ్ నాయకత్వంలో కర్ణాటక రంజీ ట్రోఫీ, ఇరానీ కప్, విజయ్ హజారే ట్రోఫీ గెలవగా... 2014–15 సీజన్లో కూడా ఇదే ‘ట్రిపుల్’ పునరావృతం కావడం విశేషం. తొలి సీజన్ ఐపీఎల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ప్రాతినిధ్యం వహించిన వినయ్ ఐపీఎల్ కెరీర్లో 105 మ్యాచ్‌లలో 105 వికెట్లు తీశాడు. 2014 (కోల్‌కతా), ముంబై (2015, 2017) ఐపీఎల్ టైటిల్స్ విజయాల్లో అతనూ సభ్యుడు. 2018 తర్వాత మళ్లీ అతనికి లీగ్‌లో అవకాశం రాలేదు. భారత్ తరఫున మాత్రం వినయ్ కుమార్ కెరీర్ గొప్పగా సాగలేదు. ఒకే ఒక టెస్టు ఆడి 1 వికెట్ తీసిన అతను... 31 వన్డేల్లో 38 వికెట్లు, 9 టి20ల్లో 10 వికెట్లు పడగొట్టాడు. దేశవాళీ క్రికెట్లో కొన్ని గొప్ప ప్రదర్శనలు చేసినా... 2013 తర్వాత అతనికి మళ్లీ టీమిండియాకు ఆడే అవకాశం రాలేదు. ఐపీఎల్ ట్రోఫీతో... -
ఎయిర్‌పోర్ట్‌లో టీమిండియాకు ఘన స్వాగతం
ముంబై: ఆస్ట్రేలియా టూర్‌ను విజయవంతంగా ముగించి.. ట్రోఫీతో భారత క్రికెట్ జట్టు సభ్యులు సగర్వంగా స్వదేశం చేరారు. విమానాశ్రయాల్లో వారికి ఘన స్వాగతం లభించింది. ఆస్ట్రేలియా నుంచి జట్టు సభ్యులు గురువారం భారత్‌కు చేరుకున్నారు. ముంబైలో కెప్టెన్ అజింక్య రహానే, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ రవిశాస్త్రి, ఓపెనర్ పృథ్వీ షా దిగగా.. బ్రిస్బెన్ టెస్ట్‌లో హీరోగా నిలిచిన రిషబ్ పంత్ ఢిల్లీలో అడుగుపెట్టాడు. ఇక టెస్ట్‌లో సత్తా చాటిన మహ్మద్ సిరాజ్ హైదరాబాద్ చేరుకున్నాడు. ఆటగాళ్లకు విమానాశ్రయ సిబ్బందితో పాటు అభిమానులు, ప్రయాణికులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఢిల్లీలో దిగిన అనంతరం రిషబ్ పంత్ మీడియాతో మాట్లాడారు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ నిలబెట్టుకున్నందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపాడు. సిరీస్ మొత్తం ఆడిన తీరుపై జట్టు అంతా సంతోషంగా ఉందని పేర్కొన్నాడు. -
హలో ఆస్ట్రేలియా
సిడ్నీ: భారత క్రికెట్ బృందం ఆస్ట్రేలియా గడ్డపై అడుగు పెట్టింది. ప్రత్యేక విమానంలో దుబాయ్నుంచి వెళ్లిన జట్టు సభ్యులు నేరుగా సిడ్నీకి చేరుకున్నారు. టీమిండియా సభ్యులతో పాటు ఐపీఎల్లో ఆడిన ఆసీస్ ఆటగాళ్లు స్మిత్, వార్నర్, కమిన్స్ తదితరులు కూడా గురువారమే స్వదేశం చేరారు. వీరందరిని స్థానిక అధికారులు సిడ్నీ ఒలింపిక్ పార్క్ ప్రాంతానికి పంపించారు. ఆస్ట్రేలియా ప్రభుత్వ నిబంధనల ప్రకారం 14 రోజుల క్వారంటీన్ కోసం వీరంతా అక్కడి పూర్తి బయో సెక్యూర్ వాతావరణంలో ఉన్న ‘పుల్‌మ్యాన్’ హోటల్లో బస చేశారు. క్రికెటర్ల కోసమే ఇప్పటి వరకు ఇక్కడ ఉన్న స్థానిక రగ్బీ టీమ్ న్యూసౌత్‌వేల్స్ బ్లూస్ జట్టును అక్కడినుంచి తరలించారు. హోటల్లో ఆటగాళ్లను మినహా ఎలాంటి అతిథులను అనుమతించడం లేదు. ‘పుల్‌మ్యాన్’ హోటల్లో విరాట్ కోహ్లి కోసం ప్రత్యేక పెంట్ హౌస్ సూట్‌ను కేటాయించారు. క్వారంటీన్ సమయంలోనే జట్టు ప్రాక్టీస్ చేసుకునేందుకు మాత్రం అధికారులు అనుమతినిచ్చారు. ఆటగాళ్లు సాధన చేయాల్సిన బ్లాక్‌టౌన్ ఇంటర్నేషనల్ స్పోర్ట్ పార్క్‌ను కూడా బయో బబుల్ సెక్యూరిటీలో సిద్ధం చేశారు. ప్రాక్టీస్ కోసం మాత్రమే క్రికెటర్లు తమ హోటల్ గదులు వీడి బయటకు రావాల్సి ఉంటుంది. టీమిండియా సభ్యులలో కొందరి కోసం పరిమిత సంఖ్యలో కుటుంబసభ్యులు వచ్చేందుకు ఆస్ట్రేలియా అంగీకరించింది. రహానే, అశ్విన్ తమ కుటుంబాలతో అక్కడికి వెళ్లారు. కొత్త జెర్సీలతో... ఆస్ట్రేలియాతో వన్డే, టి20 సిరీస్‌ల కోసం భారత జట్టు పాత రోజులను గుర్తుకు తెచ్చే (రెట్రో) రంగు జెర్సీలతో బరిలోకి దిగనుందని సమాచారం. ఇది 1992 వన్డే ప్రపంచ కప్‌లో భారత జట్టు ధరించిన కిట్‌ను పోలి ఉంది. -
పింక్ బాల్‌తో మనోళ్ల ప్రాక్టీస్
ఇండోర్: భారత క్రికెటర్ల ప్రాక్టీస్ ‘రంగు’ మారింది. ఎప్పుడూ ఎరుపు బంతితో నెట్స్‌లో ప్రాక్టీస్ చేసే ఆటగాళ్లు మంగళవారం గులాబీ బంతితో ఆడుకున్నారు. భారత సారథి కోహ్లి తొలిసారిగా పింక్ బాల్‌తో ప్రాక్టీస్ చేశాడని జట్టు వర్గాలు తెలిపాయి. పింక్ బాల్‌తో అతను డిఫెన్స్ ఆడాడు. కోల్‌కతాలో ఈనెల 22 నుంచి జరిగే డేనైట్ టెస్టు కోసం అలవాటు పడేందుకే ఆటగాళ్లు సంప్రదాయ ఎర్ర బంతితో కాకుండా ఈసారి పింక్ బాల్‌తో ప్రాక్టీస్ చేశారు. పేసర్లు, స్పిన్నర్ల కోసం మూడు నెట్స్‌లను ఏర్పాటు చేయగా, టీమిండియా విజ్ఞప్తి మేరకు త్రోడౌన్ ప్రాక్టీస్ కోసం మరో చోట టర్ఫ్, బ్లాక్ సైట్‌స్క్రీన్‌ను ఏర్పాటు చేశారు. ఇక్కడే అందరికంటే ముందుగా కోహ్లి ప్రాక్టీస్ చేశాక... తర్వాత పుజారా, శుబ్‌మన్ గిల్ కూడా పింక్ బాల్‌తో ప్రాక్టీస్ చేశారు. డేనైట్ టెస్టుకు రోజుల వ్యవధే ఉండటంతో బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో డైరెక్టర్ రాహుల్ ద్రవిడ్ మార్గదర్శనంలో ఇటీవల రహానే, మయాంక్ అగర్వాల్, పుజారా, షమీలకు ప్రత్యేకంగా పింక్‌బాల్ ప్రాక్టీస్‌ను బీసీసీఐ ఏర్పాటు చేసింది. గురువారం నుంచి ఇండోర్‌లో తొలి టెస్టు జరుగుతుంది. పిల్లలతో కోహ్లి గల్లీ క్రికెట్... భారత కెప్టెన్ విరాట్ కోహ్లి పిల్లలతో గల్లీ క్రికెట్ ఆడాడు. ఇక్కడి బిచోలి మర్దానా ప్రాంతంలో సరదాగా పిల్లలతో క్రికెట్ ఆడాడు. ఈ వీడియా, ఫొటో షూట్ నెట్టింట బాగా వైరల్ అయింది. చెక్ షర్ట్, జీన్స్ వేసుకొని కోహ్లి పిల్లలతో చేసిన అల్లరిని నెటిజన్లు తెగ ‘లైక్’ చేశారు. చీకట్లో కాస్త క్లిష్టం కావొచ్చు; పింక్ బాల్‌పై పుజారా వ్యాఖ్య బెంగళూరు: డేనైట్ టెస్టు కోసం ఉపయోగించే గులాబీ బంతితో రాత్రయితే దాన్ని చూడటంలో సమస్య ఎదురవుతుందని భారత మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ చతేశ్వర్ పుజారా అన్నాడు. ‘నేను ఇదివరకే దులీప్ ట్రోఫీలో పింక్‌బాల్‌తో ఆడాను. అది మంచి అనుభవం. దేశవాళీ క్రికెట్లో అలా ఆడిన అనుభవం ఇప్పుడు అక్కరకొస్తుంది. అయితే పగటి సమయంలో పింక్‌బాల్‌తో ఏ సమస్యా ఉండదు. కానీ చీకటి పడినపుడు ఫ్లడ్‌లైట్ల వెలుతురులో బంతిని చూడటం కష్టమవుతుందేమో! అదే జరిగితే మ్యాచ్‌లో ఆ రాత్రి సెషనే కీలకంగా మారొచ్చు’ అని పుజారా అన్నాడు. టీమిండియాలో కెప్టెన్ కోహ్లి సహా చాలా మందికి పింక్‌బాల్‌తో ఆడటం కొత్త. పుజారా, మయాంక్ అగర్వాల్, హనుమ విహారి, కుల్దీప్ యాదవ్‌లకు మాత్రం కూకబుర్రా గులాబీ బంతులతో దులీప్ ట్రోఫీ ఆడిన అనుభవం ఉంది. రెడ్‌బాల్ కంటే ఎక్కువ కష్టపడాలి... రెడ్‌బాల్‌తో పోలిస్తే పింక్‌బాల్‌తో ఆడేందుకు కాస్త ఎక్కువ కష్టపడాల్సి ఉంటుందని భారత వైస్ కెప్టెన్ అజింక్య రహానే అన్నాడు. ‘నా వరకైతే గులాబీ బంతి ఆటకు నేను కొత్త. ఇది కాస్త భిన్నంగా అనిపించింది. మా దృష్టంతా బంతి స్వింగ్, సీమ్‌పైనే ఉంటుంది. నా అంచనా ప్రకారం బంతిని శరీరానికి దగ్గరగా ఆడాల్సి ఉంటుంది’ అని అన్నాడు. -
ఒక్కొక్కరికి అర కోటి
న్యూఢిల్లీ: ఆస్ట్రేలియాను కంగుతినిపించిన భారత జట్టును ప్రశంసలతో ముంచెత్తిన భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రోత్సాహకాలు ప్రకటించింది. కోహ్లి సేన సభ్యులకు రూ. 50 లక్షల చొప్పున నజరానా ఇవ్వనుంది. కోచ్ కుంబ్లేకు రూ. 25 లక్షలు, ఇతర సహాయ సిబ్బందికి రూ. 15 లక్షల చొప్పున పారితోషికాల్ని అందజేయనుంది. ‘టెస్టుల్లో అగ్రస్థానం నిలబెట్టుకున్న టీమిండియాకు బీసీసీఐ అభినందనలు. ఈ సీజన్లో సొంతగడ్డపై అజేయంగా కొనసాగుతోంది. ఇందుకు ప్రోత్సాహకంగా నజరానా అందజేస్తాం’ అని బోర్డు ఒక ప్రకటన విడుదల చేసింది. నజరానాను ప్రొ రాటా పద్ధతిలో ఇస్తామని అందులో పేర్కొన్నారు. అంటే ఆడిన మ్యాచ్‌లను బట్టి ఈ పారితోషికాన్ని అందజేయనున్నారు. పూర్తిగా నాలుగు మ్యాచ్‌లు ఆడిన ఆటగాడికి రూ. 50 లక్షలు, రెండే మ్యాచ్‌లు ఆడితే రూ. 25 లక్షలు ఇస్తారు.