ఇండోర్: భారత క్రికెటర్ల ప్రాక్టీస్ ‘రంగు’ మారింది. ఎప్పుడూ ఎరుపు బంతితో నెట్స్‌లో ప్రాక్టీస్ చేసే ఆటగాళ్లు మంగళవారం గులాబీ బంతితో ఆడుకున్నారు. భారత సారథి కోహ్లి తొలిసారిగా పింక్ బాల్‌తో ప్రాక్టీస్ చేశాడని జట్టు వర్గాలు తెలిపాయి. పింక్ బాల్‌తో అతను డిఫెన్స్ ఆడాడు. కోల్‌కతాలో ఈనెల 22 నుంచి జరిగే డేనైట్ టెస్టు కోసం అలవాటు పడేందుకే ఆటగాళ్లు సంప్రదాయ ఎర్ర బంతితో కాకుండా ఈసారి పింక్ బాల్‌తో ప్రాక్టీస్ చేశారు. పేసర్లు, స్పిన్నర్ల కోసం మూడు నెట్స్‌లను ఏర్పాటు చేయగా, టీమిండియా విజ్ఞప్తి మేరకు త్రోడౌన్ ప్రాక్టీస్ కోసం మరో చోట టర్ఫ్, బ్లాక్ సైట్‌స్క్రీన్‌ను ఏర్పాటు చేశారు.
ఇక్కడే అందరికంటే ముందుగా కోహ్లి ప్రాక్టీస్ చేశాక... తర్వాత పుజారా, శుబ్‌మన్ గిల్ కూడా పింక్ బాల్‌తో ప్రాక్టీస్ చేశారు. డేనైట్ టెస్టుకు రోజుల వ్యవధే ఉండటంతో బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ)లో డైరెక్టర్ రాహుల్ ద్రవిడ్ మార్గదర్శనంలో ఇటీవల రహానే, మయాంక్ అగర్వాల్, పుజారా, షమీలకు ప్రత్యేకంగా పింక్‌బాల్ ప్రాక్టీస్‌ను బీసీసీఐ ఏర్పాటు చేసింది. గురువారం నుంచి ఇండోర్‌లో తొలి టెస్టు జరుగుతుంది.
పిల్లలతో కోహ్లి గల్లీ క్రికెట్...
భారత కెప్టెన్ విరాట్ కోహ్లి పిల్లలతో గల్లీ క్రికెట్ ఆడాడు. ఇక్కడి బిచోలి మర్దానా ప్రాంతంలో సరదాగా పిల్లలతో క్రికెట్ ఆడాడు. ఈ వీడియా, ఫొటో షూట్ నెట్టింట బాగా వైరల్ అయింది. చెక్ షర్ట్, జీన్స్ వేసుకొని కోహ్లి పిల్లలతో చేసిన అల్లరిని నెటిజన్లు తెగ ‘లైక్’ చేశారు.
చీకట్లో కాస్త క్లిష్టం కావొచ్చు; పింక్ బాల్‌పై పుజారా వ్యాఖ్య
బెంగళూరు: డేనైట్ టెస్టు కోసం ఉపయోగించే గులాబీ బంతితో రాత్రయితే దాన్ని చూడటంలో సమస్య ఎదురవుతుందని భారత మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ చతేశ్వర్ పుజారా అన్నాడు. ‘నేను ఇదివరకే దులీప్ ట్రోఫీలో పింక్‌బాల్‌తో ఆడాను. అది మంచి అనుభవం. దేశవాళీ క్రికెట్‌లో అలా ఆడిన అనుభవం ఇప్పుడు అక్కరకొస్తుంది. అయితే పగటి సమయంలో పింక్‌బాల్‌తో ఏ సమస్యా ఉండదు. కానీ చీకటి పడినపుడు ఫ్లడ్‌లైట్ల వెలుతురులో బంతిని చూడటం కష్టమవుతుందేమో! అదే జరిగితే మ్యాచ్‌లో ఆ రాత్రి సెషనే కీలకంగా మారొచ్చు’ అని పుజారా అన్నాడు. టీమిండియాలో కెప్టెన్ కోహ్లి సహా చాలా మందికి పింక్‌బాల్‌తో ఆడటం కొత్త. పుజారా, మయాంక్ అగర్వాల్, హనుమ విహారి, కుల్దీప్ యాదవ్‌లకు మాత్రం కూకబుర్రా గులాబీ బంతులతో దులీప్ ట్రోఫీ ఆడిన అనుభవం ఉంది.
రెడ్‌బాల్ కంటే ఎక్కువ కష్టపడాలి...
రెడ్‌బాల్‌తో పోలిస్తే పింక్‌బాల్‌తో ఆడేందుకు కాస్త ఎక్కువ కష్టపడాల్సి ఉంటుందని భారత వైస్ కెప్టెన్ అజింక్య రహానే అన్నాడు. ‘నా వరకైతే గులాబీ బంతి ఆటకు నేను కొత్త. ఇది కాస్త భిన్నంగా అనిపించింది. మా దృష్టంతా బంతి స్వింగ్, సీమ్‌పైనే ఉంటుంది. నా అంచనా ప్రకారం బంతిని శరీరానికి దగ్గరగా ఆడాల్సి ఉంటుంది’ అని అన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment