
కాబూల్: రెండు నెలల విరామం తర్వాత అఫ్గానిస్తాన్ క్రికెటర్లు తిరిగి ప్రాక్టీస్ మొదలుపెట్టారు. ఇక్కడి కాబూల్ క్రికెట్ స్టేడియంలో ఆదివారం నుంచి ఆరంభమైన ప్రాక్టీస్ సెషన్‌లో లెగ్ స్పిన్నర్ రషీద్ ఖాన్, ఆల్ రౌండర్ మొహమ్మద్ నబీతో పాటు పలువురు ఆటగాళ్లు పాల్గొన్నట్లు అఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డు (ఏసీబీ) తెలిపింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో తమ ఆటగాళ్లు మరింత మెరుగవడానికి, మైదానంలో జట్టుగా సమష్టి ప్రదర్శన ఇచ్చేందుకు ఈ సెషన్ ఉపయోగపడుతుందని ఏసీబీ పేర్కొంది.
కరోనా నేపథ్యంలో నెలరోజుల పాటు సాగే ఈ సెషన్‌ను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ), ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) మార్గదర్శకాలకు లోబడే నిర్వహించనున్నట్లు ఏసీబీ ఒక ప్రకటనలో తెలిపింది. అంతేకాకుండా శనివారం ఏసీబీ ప్రధాన కార్యాలయంలో కరోనాపై అవగాహన కార్యక్రమాన్ని కూడా నిర్వహించి తమ ఆటగాళ్లతో పాటు బోర్డు అధికారులను చైతన్య పరిచింది. ఈ ఏడాది అఫ్గానిస్తాన్ అక్టోబర్‌లో టి20 ప్రపంచకప్, నవంబర్‌లో ఆస్ట్రేలియాతో జరిగే ఏకైక టెస్టు మ్యాచ్ ఆడాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment