దుబాయ్ : సెప్టెంబర్ 19 నుంచి మొదలుకానున్న ఐపీఎల్ 13వ సీజన్ ఆరంభానికి ముందే చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో కరోనా కలకలం రేపిన సంగతి తెలిసిందే. జట్టులో 13 మంది కరోనా బారిన పడ్డారు. అయితే మొదటిదఫా నిర్వహించిన కరోనా పరీక్షల్లో అందరికి నెగిటివ్ వచ్చినట్లు మంగళవారం వచ్చిన రిపోర్టులో తేలింది. తాజాగా గురువారం ఈ 13 మందికి రెండోసారి కరోనా పరీక్షలు నిర్వహించారు. దీనికి సంబంధించిన ఫలితాలు శుక్రవారం ఉదయం రానున్నాయి. మరోవైపు రేపటినుంచే చెన్నై సూపర్‌కింగ్స్ ప్రాక్టీస్ మొదలుపెట్టనున్నట్లు జట్టు యాజమాన్యం ఒక ప్రకటనలో పేర్కొంది. ఫలితాలు శుక్రవారం ఉదయం వెలువడుతుండడంతో.. ఎలాగూ ఆటగాళ్లందరికి నెగెటివ్ వస్తుంది.. సాయంత్రం కల్లా చెన్నై జట్టు తమ ప్రాక్టీస్ మొదలుపెడుతుందని యాజమాన్యం స్పష్టం చేసింది.(చదవండి : జడ్డూ బాయ్.. వాట్ ఏ స్టన్నింగ్ క్యాచ్)
ఇప్పటికే చెన్నై మినహా అన్ని జట్లు తమ ప్రాక్టీస్‌ను మొదలుపెట్టేశాయి. అంతకుముందు.. సీఎస్‌కే సీఈవో కాశీ విశ్వనాథన్ మాట్లాడుతూ.. టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో చెన్నై జట్టు ముంబైతో తలపడేందుకు సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. ఇదే విషమమై బీసీసీఐ కూడా స్పందించింది. టోర్నీ ఆరంభ మ్యాచ్ కచ్చితంగా చెన్నె సూపర్‌కింగ్స్, ముంబై ఇండియన్స్‌ల మధ్యే జరుగుతుందని ఆశిస్తున్నట్టు తెలిపింది. ఈ విషయంపై శనివారం ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు బీసీసీఐ పేర్కొంది.
అసలే కరోనా బారిన పడ్డామన్న ఆలోచనలో ఉన్న సీఎస్‌కేకు ఆ జట్టు ఆటగాడు సురేశ్ రైనా బిగ్ షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. కొన్ని వ్యక్తిగత కారణాలతో ఐపీఎల్ సీజన్ నుంచి తప్పుకుంటున్నట్లు పేర్కొన్నాడు. రైనా అనూహ్య నిష్క్రమణపై సోషల్‌మీడియాలో వివిధ రకాల రూమర్లు వచ్చాయి. సీఎస్‌కే యాజమాని శ్రీనివాసన్‌తో పొసగకనే రైనా అర్థంతరంగా స్వదేశానికి పయనమయ్యాడనే కామెంట్లు వినిపించాయి. దీంతో రైనా స్వయంగా రంగంలోకి దిగాడు. తన కుటుంబంపై కొంతమంది దాడి చేసిన ఘటనలో మేనమామ చనిపోయిన కారణంగానే స్వదేశానికి ఉన్నపళంగా రావాల్సివచ్చిందని వివరణ ఇచ్చుకున్నాడు.(చదవండి : ఫ్యాన్‌కు సీఎస్‌కే అదిరిపోయే రిప్లై)
తనకు జట్టుతో ఎటువంటి విభేదాలు లేవని కూడా తెలిపాడు. దీనిపై సీఎస్‌కే యజమాని ఎన్ శ్రీనివాసన్ కూడా సానుకూలంగానే స్పందించారు. తనకు రైనా కొడుకు లాంటి వాడు అంటూ శ్రీని స్పష్టం చేశారు. దాంతో సీఎస్‌కేతో రైనాకు విభేదాలు అంశానికి తొందరగానే ముగింపు పడింది. రైనా తిరిగి జట్టుతో కలవడమనేది ఇంకా డైలమాలోనే ఉంది. జట్టుతో తనకేమీ పొరపచ్చలు లేవని, అవకాశం ఉంటే జట్టుతో కలుస్తాననే సంకేతాలు పంపాడు. ఈ క్రమంలోనే రైనా జట్టుతో కలిసినా అది టోర్నీ మధ్యలో జరగవచ్చు.ధోని నాయకత్వంలో చెన్నై సూపర్‌కింగ్స్ జట్టు ఐపీఎల్ చరిత్రలో విజయవంతమైన జట్టుగా పేరుపొందింది. ఇప్పటికే మూడుసార్లు టైటిల్‌ను కొల్లగొట్టిన చెన్నై రెండు సార్లు చాంపియన్ లీగ్స్‌ను గెలిచింది. అంతేకాదు.. ఐపీఎల్ సీజన్లలో 8సార్లు ఫైనల్ చేరిన జట్టుగా, ఎక్కువసార్లు ప్లేఆఫ్ మ్యాచ్‌లు ఆడిన జట్టుగా చరిత్ర సృష్టించింది.
Comments
Please login to add a commentAdd a comment