భారత్-ఆస్ట్రేలియా మధ్య బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ఆరంభానికి మరో మూడు రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఈ ప్రతిష్టాత్మక ట్రోఫీలో భాగంగా తొలి టెస్టు నవంబర్ 22 నుంచి పెర్త్ వేదికగా మొదలు కానుంది. మొదటి టెస్టు కోసం ఇప్పటికే పెర్త్‌కు చేరుకున్న ఇరు జట్లు నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాయి.
ఈ మ్యాచ్‌కు ముందు ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ డేవిడ్ వార్నర్ తన జట్టుకు హెచ్చరిక జారీ చేశాడు. టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లితో జాగ్రత్తగా ఉండాలని కమ్మిన్స్ సేనకు వార్నర్ సూచించాడు. కాగా విరాట్ కోహ్లికి ఆసీస్ గడ్డపై టెస్టుల్లో అద్బుతమైన ట్రాక్ రికార్డు ఉంది. ఆస్ట్రేలియాలో ఇప్పటివరకు 13 మ్యాచ్‌లు ఆడిన విరాట్ 54.08 సగటుతో 1352 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లో ఏకంగా 6 సెంచరీలు ఉన్నాయి.
"బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ అంటే చాలు విరాట్ కోహ్లి చెలరేగిపోతాడు. ముఖ్యంగా ఆస్ట్రేలియాలో అతడిని అడ్డుకోవడం అంత సులువు కాదు. అతడు ఎల్లప్పుడూ పరుగుల దాహంతో ఉంటాడు. ఆసీస్ గడ్డపై అతడిని మించిన ఆటగాడు ఇంకొకరు లేరు. విమర్శకుల నోళ్లు మూయించడానికి కోహ్లికి ఇదే సరైన సమయం.
ఈ సిరీస్‌లో కోహ్లి నుంచి పెద్ద ఇన్నింగ్స్‌లు వస్తాయాని నేను ఆశిస్తున్నాను. ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకు కచ్చితంగా విరాట్ నుంచి ముప్పు పొంచి ఉంది. కోహ్లి ఫామ్‌పై పెద్దగా ఆందోళన లేదు. ఎందుకంటే ఇటువంటి పెద్ద సిరీస్‌లలో ఎలా ఆడాలో కోహ్లికి బాగా తెలుసు" అని హెరాల్డ్ సన్ కాలమ్‌లో డేవిడ్ భాయ్ రాసుకొచ్చాడు.
చదవండి: రోహిత్ వచ్చినా అతడినే కెప్టెన్‌గా కొనసాగించండి: హర్భజన్
Comments
Please login to add a commentAdd a comment