Virat Kohli Completes 15 Years In International Cricket - Sakshi
Sakshi News home page

#Virat Kohli: అరంగేట్రంలో విఫలం.. కట్‌ చేస్తే.. ప్రపంచ క్రికెట్‌లో రారాజుగా! ఏకంగా సచిన్‌తో పోటీ

Published Fri, Aug 18 2023 12:35 PM | Last Updated on Fri, Aug 18 2023 1:29 PM

Virat Kohli Completes 15 Years In International Cricket. - Sakshi

సరిగ్గా 15 ఏళ్ల క్రితం.. అంటే 2008 ఆగస్టు 18న అంతర్జాతీయ క్రికెట్‌లోకి 19 ఏళ్ల భారత యువ ఆటగాడు అడుగుపెట్టాడు. ఆ రోజు ఎవరూ ఊహించలేదు.. ఆ యువకెరటం ప్రపంచక్రికెట్‌ను శాసిస్తాడని. ఆ రోజు ఎవరూ అనుకోలేదు.. ఆ యువ కిషోరం క్రికెట్‌ గాడ్‌ సచిన్‌ టెండూల్కర్‌తో పోటీ పడతాడని.

తన అరంగేట్ర మ్యాచ్‌లోనే విమర్శలపాలైన ఆ యువ సంచలనం.. ఇప్పుడు ఏకంగా ప్రపంచ క్రికెట్‌లో తన పేరును సువర్ణ అక్షరాలతో లిఖించుకున్నాడు. ఎంతో మంది యువ ఆటగాళ్లకు అతడే ఆదర్శం. అతడు ఎవరో కాదు టీమిండియా స్టార్‌ క్రికెటర్‌, రన్‌ మిషన్‌, రికార్డుల రారాజు విరాట్‌ కోహ్లి. కింగ్‌ కోహ్లి అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టి నేటితో 15 ఏళ్లు గ‌డిచాయి. 

శ్రీలంకపై డెబ్యూ..
2008, ఆగస్ట్ 18న  శ్రీలంకతో జరిగిన వన్డే మ్యాచ్‌తో కోహ్లి అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. ఈ మ్యాచ్‌లో కోహ్లి టీమిండియా స్టార్‌ ఓపెనర్‌ గౌతం గంభీర్‌తో కలిసి భారత ఇన్నింగ్స్‌ను ప్రారంభించాడు. తన తొలి మ్యాచ్‌లో కోహ్లి కేవలం 12 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. దీంతో అతడిపై విమర్శల వర్షం కురిసింది. అతడు ఓపెనర్‌గా పనికిరాడని కామెంట్లు చేశారు. కానీ కోహ్లి మాత్రం వాటిని పట్టించుకోలేదు. అదే సిరీస్‌లో నాలుగో వన్డేలో తొలి హాఫ్‌సెంచరీ సాధించి విమర్శకుల నోళ్లు మూయించాడు.

ఇక ఆ మ్యాచ్ తర్వాత కోహ్లి వెనుదిరిగి చూడలేదు. ఆ సిరీస్‌లో ఐదు మ్యాచ్‌లు ఆడిన విరాట్‌.. 159 పరుగులతో పర్వాలేదనపించాడు. అలా అంచె అంచెలుగా ఎదిగి ఆస్ట్రేలియాకు చెందిన స్టీవ్ స్మిత్, న్యూజిలాండ్‌ కెప్టెన్‌  కేన్ విలియమ్సన్ , ఇంగ్లండ్‌ స్టార్‌ ఆటగాడు జో రూట్‌లతో 'ఫ్యాబ్ ఫోర్'లో కోహ్లి భాగమయ్యాడు.

ఆ మూడేళ్లు..
ఎంతటి స్టార్‌ క్రికెటరైనా ఏదో ఒక సమయంలో గడ్డు పరిస్ధితులు ఎదుర్కొక తప్పదు. ఇటువంటి పరిస్ధితితే కింగ్‌ కోహ్లికి కూడా ఎదురైంది. 70 సెంచరీలు అలవోక సాధించిన కోహ్లి.. తన 71వ శతకాన్ని అందుకోవడానికి దాదాపు మూడేళ్ల పట్టింది. ఈ సమయంలో విరాట్‌ ఫామ్‌ కోల్పోయి తీవ్ర విమర్శల ఎదుర్కొన్నాడు. అంతేకాకుండా అతడి పని అయిపోందని, క్రికెట్‌ నుంచి తప్పుకుంటే బాగుంటుందని చాలా మంది హేళన చేశారు.

కానీ కోహ్లి  దెబ్బతిన్న సింహంలా అద్బుతమైన కమ్‌బ్యాక్‌ ఇచ్చాడు. గతేడాది దుబాయ్‌ వేదికగా జరిగిన ఆసియాకప్‌ టీ20లో ఆఫ్గానిస్తాన్‌పై కోహ్లి సంచలన సెంచరీతో చెలరేగాడు. ఆ సెంచరీతో తన మూడేళ్ల నిరీక్షణకు తెరదించాడు. ఇక ఆ మ్యాచ్‌ తర్వాత కోహ్లిని అపడం ఎవరూ తరం కాలేదు. అదే ఏడాది టీ20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌పై కోహ్లి ఆడిన ఇన్నింగ్స్‌ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఇక తన 15 ఏళ్ల కెరీర్‌లో కోహ్లి ఒక బ్యాటర్‌గా, కెప్టెన్‌గా, ఫీల్డర్‌గా ఎన్నో అరుదైన ఘనతలను తన పేరిట లిఖించుకున్నాడు.

15 ఏళ్లలో కోహ్లి సాధించిన ఘనతలు.. 

అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్లలో విరాట్ కోహ్లిది రెండో స్థానం. ఈ అరుదైన ఘనత సాధించిన జాబితాలో క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ 100 సెంచరీలతో తొలి స్ధానంలో ఉన్నాడు. కోహ్లి ఇప్పటివరకు తన కెరీర్‌లో 76 సెంచరీలు సాధించాడు. వన్డేలలో 46, టెస్టుల్లో 29, టీ20లో ఒక సెంచరీ విరాట్‌ చేశాడు.

టీ20 క్రికెట్ చ‌రిత్ర‌లో అత్య‌ధిక పరుగులు చేసిన ఆటగాడు కోహ్లినే. ఇప్పటివరకు 115 టీ20లు ఆడిన విరాట్‌.. 52.73 సగటుతో 4008 పరుగులు చేశాడు.

వన్డేల్లో ఒకే దేశంపై అత్యధిక సెంచరీల రికార్డు కూడా కోహ్లి పేరిటే ఉంది. అతడు శ్రీలంకపై వన్డేలలో ఏకంగా 10 సెంచరీలు చేశాడు.

వ‌న్డేల్లో 7 నుంచి 12 వేల ప‌రుగుల వ‌ర‌కు అత్యంతవేగంగా చేసిన ఆటగాడు కూడా కోహ్లినే

వన్డేల్లో భారత తరపున అత్యధిక క్యాచ్‌లు పట్టిన రికార్డు కోహ్లి పేరిటే ఉంది. ఇప్పటివరకు కోహ్లి మొత్తం 142 క్యాచ్‌లు అందుకున్నాడు.

అంతర్జాతీయ క్రికెట్ లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ సిరీస్ అవార్డులు గెలుచుకున్న ఆటగాడు కూడా కోహ్లినే. కోహ్లి తన కెరీర్‌లో ఇప్పటి వరకు 20 ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు సొ​ంతం చేసుకున్నాడు. 

అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక  పరుగులు సాధించిన జాబితాలో కోహ్లి ఐదో స్ధానంలో కొనసాగుతున్నాడు. ఇప్పటివరకు 501 మ్యాచ్‌లు ఆడిన కోహ్లి.. 25582 పరుగులు చేశాడు. కోహ్లి టెస్టుల్లో 8676, వన్డేల్లో 12898, టీ20ల్లో 4008 పరుగులు చేశాడు.

కెప్టెన్‌గా ఎన్నో ఘనతలు..
విరాట్‌ కోహ్లి కెప్టెన్‌గా భారత్‌కు ఐసీసీ టైటిల్‌ను అందించికపోయినప్పటికీ ఎన్నో చారిత్రత్మక విజయాలను తన పేరిట లిఖించుకున్నాడు. టెస్టుల్లో 68 టెస్టుల‌కు విరాట్‌ సారథ్యం వహించగా.. భారత్‌ అందులో 40 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. 17 మ్యాచ్‌ల్లో ఓటమి పాలవ్వగా.. 11 మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి.

టెస్టుల్లో కెప్టెన్‌ విరాట్‌ విన్నింగ్‌ శాతం  58.82గా ఉంది. అదే విధంగా వన్డేల్లో విరాట్‌ సారథ్యంలో టీమిండియా 95 మ్యాచ్‌లు ఆడగా. 65 మ్యాచ్‌ల్లో భారత్‌ విజయం సాధించింది. వన్డే క్రికెట్‌లో అతడి విన్నింగ్‌ శాతం 68 శాతంగా ఉంది.

ఆసియాకప్‌తో మళ్లీ..
ఇక వెస్టిండీస్‌ టూర్‌ అనంతరం కోహ్లి విశ్రాంతి తీసుకుంటున్నాడు. అతడు ఆసియాకప్‌-2023తో మళ్లీ తిరిగి మైదానంలో అడుగుపెట్టనున్నాడు.  ఈ మెగా ఈవెంట్‌ కోసం భారత జట్టును బీసీసీఐ ఒకట్రెండు రోజుల్లో ప్రకటించే అవకాశం ఉంది.
చదవండి: IND vs IRE: తొలిసారి బిజినెస్ క్లాస్‌లో ప్రయాణం.. మా అమ్మ కల నెరవేరింది! రింకూ భావోద్వేగం

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement